Team India: ఈసారి ‘బెస్ట్ ఫీల్డర్‌’ మెడల్‌.. అనౌన్స్‌ చేసిన క్రికెట్ దిగ్గజం

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) టీమ్ఇండియా వరుస విజయాలు సాధించడంలో ఫీల్డింగ్‌ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో అత్యుత్తమ ప్రదర్శన చేసేవారికి ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్‌ను ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు.

Published : 03 Nov 2023 15:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మైదానంలో అత్యుత్తమ ఫీల్డింగ్‌ ప్రమాణాలతోపాటు సహచరుల్లో ఉత్సాహం నింపే ఆటగాడిని ఎంపిక చేసి ‘బెస్ట్‌ ఫీల్డర్‌’ (Best Fielder) అవార్డును టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ అందిస్తోంది. శ్రీలంకతో మ్యాచ్‌లోనూ భారత ఆటగాళ్లు (IND vs SL) అదరగొట్టేశారు. అయితే, ఒకే ఒక్కరికి ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్‌ను ఫీల్డింగ్‌ కోచ్ దిలీప్‌ అందించారు. అయితే, ఈసారి వినూత్నంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ‘బెస్ట్‌ ఫీల్డర్’ ఎవరనేది ప్రకటించడం విశేషం. మరోసారి శ్రేయస్ అయ్యర్ ఈ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఫీల్డింగ్‌ కోచ్ దిలీప్‌, క్రికెట్‌ లెజెండ్ సచిన్‌ తెందూల్కర్‌ మాట్లాడిన వీడియోను భారత క్రికెట్‌ టీమ్‌ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

‘‘శ్రీలంకతో మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రతిభ చూపారు. క్యాచ్‌లు, ఫీల్డింగ్‌, బంతిని విసరడం ఎక్కడైనా సరే రవీంద్ర జడేజా కనిపించాడు. ప్రతి ఒక్కరూ చురుగ్గా ఉన్నారు. కేఎల్ రాహుల్‌ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. శ్రేయస్‌ అయ్యర్ ఫీల్డింగ్‌ బాగా చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డర్లను సెట్ చేయడం చాలా బాగుంది. అయితే, ఈసారి విజేత ఎవరనేది మాత్రం నేను చెప్పడం లేదు. స్పెషల్‌ గెస్ట్‌ ఉన్నారు’’ అని దిలీప్ తెలిపాడు. ఆటగాళ్లను టీవీ స్క్రీన్‌ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ప్రత్యక్షమయ్యాడు. 

2003 వరల్డ్‌ కప్‌ గుర్తుకొచ్చింది: సచిన్

వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్న టీమ్‌ఇండియాను చూస్తుంటే 2003 వరల్డ్‌ కప్‌ గుర్తుకొచ్చిందని సచిన్ వ్యాఖ్యానించాడు. ‘‘రోహిత్ ఒక రోజు నన్ను కలిసి ఇలా ఫీల్డింగ్‌ మెడల్‌ గురించి చెప్పాడు. దీంతో నేను ఒక్కసారిగా 20 ఏళ్ల గతానికి వెళ్లిపోయా. దక్షిణాఫ్రికా వేదికగా ఆడిన మ్యాచ్‌లు గుర్తుకొచ్చాయి. మేం కూడా ఒక ఛార్ట్‌ను ఉంచుకున్నాం. ‘నేను చేయగలను. మేం చేయగలం’ అని ప్రతిఒక్కరం ప్రతిజ్ఞ చేశాం. దేశం కోసం వందశాతం నిబద్ధతతో ఆడేందుకు అది స్ఫూర్తిగా నిలిచేది. ఇప్పుడు ఈ మెడల్‌ కూడా ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం నింపుతుందని భావిస్తున్నా. శ్రీలంకతో మ్యాచ్‌ సందర్భంగా శ్రేయస్‌ అయ్యర్‌కు బెస్ట్ ఫీల్డర్‌ మెడల్‌ దక్కింది’’ అని తెలిపాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని