Team India: పెద్ద టోర్నీల్లో డెబ్యూ వద్దు.. వారిద్దరికీ చోటు లేదు.. సచిన్-ధోనీ సమానమే!

టీమ్‌ఇండియా ఓ వైపు ఆసియా కప్‌ (Asia Cup 2023) బిజీలో ఉండగా.. మరోవైపు మాజీలు మాత్రం వరల్డ్‌ కప్ (ODI World Cup 2023) గురించే అంచనాలు వేస్తూ విశ్లేషణలు చేసేస్తున్నారు. స్వదేశంలో జరగనున్న మెగా టోర్నీ విజేతగా నిలవాలంటే ఎలాంటి జట్టు ఉండాలో చెబుతున్నారు.

Published : 27 Aug 2023 11:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) యువ ఆటగాడు తిలక్‌ వర్మ తనకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆసియా కప్‌ (Asia Cup 2023) జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫైనల్‌ XIలో అవకాశం వచ్చి రాణించగలిగితే వరల్డ్‌ కప్‌లోకి (ODi World Cup 2023) అడుగు పెట్టేందుకు ఛాన్స్ ఎక్కువ. అయితే, అతడిని పెద్ద టోర్నీల్లో అరంగేట్రం చేయించవద్దని మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ సూచించాడు. ‘‘తిలక్‌ వర్మను (Tilak Varma) పెద్ద టోర్నీల ద్వారా అరంగేట్రం చేయించొద్దు. దానికి ముందు వన్డే సిరీస్‌ ఆడించాలి. తిలక్ అద్భుత ఆటగాడు. అతడిని వరల్డ్‌ కప్‌ జట్టులోకి తీసుకొనే ముందు మరిన్ని వన్డేలు ఆడిస్తే బాగుంటుంది’’ అని క్రిష్‌ వ్యాఖ్యానించాడు. 


వారిద్దరూ ఒకటే: మోహిత్ శర్మ

యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ సమానమేనని సీనియర్‌ ఆటగాడు మోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఎప్పుడు అవకాశం వచ్చినా యువకులు ధోనీతో సంభాషించేందుకు ఆసక్తి చూపుతారని పేర్కొన్నాడు. ఇటీవల ఐపీఎల్‌లోనూ ప్రతి మ్యాచ్‌ తర్వాత ఈ విషయాన్ని మనమంతా చూసినట్లు గుర్తు చేసుకున్నాడు. 

Team India: ప్రాక్టీస్‌ ప్రాక్టీస్‌

‘‘ భారత క్రికెట్‌ కోసం ఎంఎస్ ధోనీ సాధించిన విజయాలు అద్భుతం. యువ క్రికెటర్లకు సూచనలు ఇవ్వడంలో ముందుంటాడు. అతడిని చూస్తే గతంలో మేం సచిన్‌ను కలవడానికి ఎంతో ఆసక్తి చూపేవాళ్లం. ఇప్పుడు యువకులు కూడా ధోనీతో సంభాషించాలని ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అందుకే సచిన్, ధోనీ ఇద్దరూ సమానమేనని చెబుతా’’ అని  మోహిత్ తెలిపాడు. 


కుల్‌దీప్‌, చాహల్‌ లేకుండానే నా జట్టు: మ్యాథ్యూ హేడెన్

భారత్‌ వేదికగా జరగనున్న వరల్డ్‌ కప్‌ కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. మాజీ క్రికెటర్లు తమ జట్లను ప్రకటిస్తూ విశ్లేషిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మ్యాథ్యూ హేడెన్ కూడా భారత జట్టుపై ఓ అంచనాకు వచ్చాడు. అయితే, స్వదేశంలో స్పిన్నర్ల హవా ఉంటుందని తెలిసి కూడా స్పెషలిస్ట్ స్పిన్నర్లకు అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. కుల్‌దీప్‌ యాదవ్, చాహల్‌ లేకుండానే తన జట్టును ప్రకటించాడు. బ్యాటరింగ్‌ ఆర్డర్‌లో రోహిత్, విరాట్, గిల్, శ్రేయస్, కేఎల్, సూర్యకుమార్‌ను తీసుకున్నాడు. జడేజా, అక్షర్ పటేల్‌లను స్పిన్నర్లుగా ఎంచుకున్నాడు. పేసర్లుగా మాత్రం షమీ, సిరాజ్‌, శార్దూల్, బుమ్రాతోపాటు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను ఎంపిక చేశాడు. 

జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), బుమ్రా, విరాట్ కోహ్లీ, గిల్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్‌ యాదవ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య, షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్‌, అక్షర్ పటేల్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని