Team India: ప్రాక్టీస్‌ ప్రాక్టీస్‌

ఆసియాకప్‌ కోసం టీమ్‌ఇండియా ముమ్మరంగా సాధన చేస్తోంది. ఆలూర్‌ (కర్ణాటక)లో శిక్షణ శిబిరంలో ఉన్న ఆటగాళ్లు శనివారం జోడీలుగా ప్రాక్టీస్‌ చేశారు.

Updated : 27 Aug 2023 11:03 IST

ఆలూర్‌: ఆసియాకప్‌ కోసం టీమ్‌ఇండియా ముమ్మరంగా సాధన చేస్తోంది. ఆలూర్‌ (కర్ణాటక)లో శిక్షణ శిబిరంలో ఉన్న ఆటగాళ్లు శనివారం జోడీలుగా ప్రాక్టీస్‌ చేశారు. మొదట రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌.. బౌలర్లను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కోహ్లి-శ్రేయస్‌ అయ్యర్‌, రాహుల్‌-సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులోకి వచ్చి సహచరుల బౌలింగ్‌లో ఆడారు. ముఖ్యంగా నాలుగో స్థానంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో కోహ్లి, శ్రేయస్‌లను జోడీగా ఆడించడం ఆసక్తిరేపుతోంది. నాలుగో స్థానానికి శ్రేయస్‌, రాహుల్‌ల పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా రాహుల్‌ అయిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావొచ్చు. ఒకవేళ రోహిత్‌తో పాటు ఇషాన్‌ కిషన్‌ను ఓపెనర్‌గా పంపాలని జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయిస్తే.. గిల్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. అప్పుడు కోహ్లి నాలుగో స్థానంలో ఆడాల్సివుంటుంది. అప్పుడు అయిదో స్థానానికి రాహుల్‌, సూర్య మధ్య పోటీ ఉంటుంది.

రాహుల్‌ ఓకే..: రాహుల్‌ చిన్న గాయంతో ఇబ్బందిపడుతున్నాడని ఆసియాకప్‌కు అతడి సెలక్షన్‌ అనంతరం చీఫ్‌ సెలక్టర్‌ అగార్కర్‌ చెప్పడంతో అనేక ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఇప్పుడో శుభవార్త. రాహుల్‌ ప్రాక్టీస్‌ శిబిరంలో వికెట్‌కీపింగ్‌ చేశాడు. బ్యాటింగ్‌ సాధన చేస్తున్నప్పుడు కూడా అతడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని