IPL 2024: విజయ్‌ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే

టెస్టు క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్‌ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు.

Published : 25 Apr 2024 15:23 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌ మొదలై నెల రోజులు దాటిపోయింది. అనూహ్య విజయాలు సాధిస్తూ కొన్ని జట్లు ప్లేఆఫ్స్ రేసులో దూసుకుపోతుండగా.. మరికొన్ని మాత్రం డీలాపడి పాయింట్ల పట్టికలో దిగువనే కొనసాగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్‌ - బెంగళూరు జట్ల మధ్య ఉప్పల్ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. ఈక్రమంలో ఐపీఎల్‌లో తన తొలి రోజులను భారత క్రికెట్‌ దిగ్గజం అనిల్ కుంబ్లే (Anil Kumble) గుర్తు చేసుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్‌తో సరదా సంభాషణ జరిగింది. ఆ వీడియోను అశ్విన్ షేర్ చేశాడు. తొలి సీజన్‌ నుంచి మూడేళ్ల పాటు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. భారత టెస్టు జట్టు సారథిగా ఉన్న కుంబ్లే ఐకానిక్‌ ప్లేయర్‌గా కాకుండా వేలంలోకి రావడం గమనార్హం. 

‘‘నేను అప్పటికే టీమ్‌ఇండియా సారథిగా ఉన్నా. అయితే, కొన్ని కారణాల వల్ల నన్ను ఐకానిక్ ప్లేయర్ల జాబితాలో చేర్చలేదు. వేలంలో భాగమయ్యా. వ్యక్తిగతంగా నేను ఈ వేలంలో ఉండాలని అనుకోలేదు. కానీ, ఆక్షన్ లిస్ట్‌లో పేరు ఉంది. వేలంలో నా పేరు రాగానే.. ఫ్రాంచైజీ అప్పటి యజమాని విజయ్ మాల్యా లేచి ‘అతడు మా బెంగళూరుకు చెందిన ఆటగాడు. ఎవరూ అతడిని టచ్ చేయొద్దు’ అని చెప్పినట్లు నాతో కొందరు అన్నారు. నా కనీస ధర వద్దే నన్ను కొనుగోలు చేసినట్లు గుర్తు. వేలంలో మరెవరూ బిడ్‌ వేయలేదు. ఏకంగా ఫ్రాంచైజీ ఓనరే పైకి లేచి బెంగళూరుకు తప్ప మరెక్కడికి నన్ను పంపేది లేదని అనడంతో ఇతరులు ఎవరూ ముందుకురాలేదు’’ అని కుంబ్లే తెలిపాడు.

సవాళ్లను ఎదుర్కొన్నా..

‘‘టెస్టు క్రికెట్‌ను ఎక్కువగా ఆడిన నేను పొట్టి ఫార్మాట్‌కు అనుగుణంగా మారే క్రమంలో సవాళ్లను ఎదుర్కొన్నా. ఇక్కడ కేవలం నాలుగు ఓవర్లను మాత్రమే సంధించాల్సి ఉంటుంది. నేను క్రికెట్‌ కెరీర్‌ను ప్రారంభించినప్పుడు వార్మప్‌ కోసమే కనీసం నాలుగు ఓవర్ల సమయం తీసుకొనేవాడిని. టెస్టుల్లో 50 నుంచి 60 ఓవర్లపాటు బౌలింగ్ చేసేవాడిని. నా శరీరం కూడా దానికే అలవాటైపోయింది. ఇక్కడికి వచ్చేసరికి మ్యాచ్‌ కూడా అయిపోతుంది. నాలాంటి బౌలర్లకు ఫార్మాట్‌ మార్పు చాలా కష్టమైంది. కేవలం నాలుగు ఓవర్లలోనే అత్యుత్తమంగా బౌలింగ్‌ చేయడం ఎలా అనేదానిపై శ్రమించా. అలాంటి సవాళ్లను ఆస్వాదించా. కేవలం నాలుగు ఓవర్ల కోటా గురించే కాకుండా.. మ్యాచ్‌ మొత్తం మీద దృష్టిసారించడం వల్ల త్వరగానే సెట్ కాగలిగా’’ అని వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని