IND vs ENG: బజ్‌బాల్.. ఇంకేదైనా పేరు పెట్టుకోండి.. భారత్‌లో ఆడటం కష్టమే: మాజీ క్రికెటర్లు

భారత్‌ను (IND vs ENG) ఓడించి సిరీస్‌ పట్టేయాలని చూసిన ఇంగ్లాండ్‌కు ఎదురు దెబ్బే తగిలింది. బజ్‌బాల్ ఆటతో ఆధిపత్యం ప్రదర్శించడంలోనూ విఫలమైంది.

Published : 28 Feb 2024 12:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు.. భారత్‌ జట్టుకు ‘బజ్‌బాల్’ క్రికెట్‌ రుచి చూపిస్తామని ప్రగల్భాలు పలికిన ఇంగ్లాండ్‌కు సిరీస్‌ ఓటమి ఎదురైంది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో స్వదేశంలో భారత్‌ను ఓడించడం అంత సులువేం కాదని వారికి తెలిసొచ్చింది. ఇదే విషయంపై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. 

‘‘ఇంగ్లాండ్‌ కఠిన సవాల్‌కు సిద్ధమై వచ్చింది. వారు ఆడేది ‘బజ్‌బాల్’ లేదా.. ఇంకేదైనా పిల్చుకోండి. స్వదేశంలో భారత్‌ను ఢీకొట్టడం తేలిక కాదు. గత పదేళ్ల కాలంలో టీమ్ఇండియా ఇక్కడ ఒక్క సిరీస్‌నూ కోల్పోలేదు. ఇంగ్లిష్‌ జట్టు ఇటీవల విభిన్నంగా ఆడుతోంది. కానీ, ఇక్కడ మాత్రం వారి బౌలింగ్‌ ఎటాక్‌ బలహీనంగా ఉంది. భారత బ్యాటింగ్‌ లైనప్‌ను సవాల్‌ చేసే స్థాయిలో లేదు. స్పిన్‌ను ఎదుర్కొని పరుగులు చేయడంలోనూ ఇంగ్లాండ్‌ తడబాటుకు గురైంది. ఇక బెన్‌ స్టోక్స్, బెయిర్‌ స్టో, జో రూట్‌ వంటి సీనియర్‌ బ్యాటర్ల నుంచి నిలకడగా పరుగులు రాబట్టలేదు. కొన్ని కీలకమైన వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యారు. దూకుడుగా బ్యాటింగ్‌ చేయాలని చెప్పడం తేలికే కానీ.. అందరూ అలా చేయడం కష్టం’’ అని అనిల్ కుంబ్లే తెలిపాడు. 

అక్కడ మినహా.. 

‘‘భారత్ - ఇంగ్లాండ్‌ మధ్య తొలి టెస్టు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మనం ‘బజ్‌బాల్’ అని వింటూ ఉన్నాం కానీ ఈ సిరీస్‌లో చూడలేదు. 190 పరుగులు వెనకబడి టర్నింగ్ పిచ్‌పై స్వీప్‌, రివర్స్‌ స్వీప్ షాట్లతో ఆధిక్యంలో రావడం బాగానే ఉంది. ఇలాంటి సమయంలో విభిన్నమైన క్రికెట్‌ ఆడతామని నిరూపించారు. ఇదే మా ఆటతీరంటూ బజ్‌బాల్‌కు తెరలేపారు. కొన్నిసార్లు విజయవంతమైనప్పటికీ.. ఎక్కువగా విఫలమై ఇంగ్లాండ్‌ ఓటమిని చవిచూసింది. సీనియర్‌ ఆటగాడు జో రూట్‌ను కూడా ఇలానే ఆడాలని చెప్పడం సరైంది కాదు. డిఫెన్సివ్‌ మోడ్‌తోనే చకచకా పరుగులు సాధిస్తాడు. బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌ కనీసం బ్యాటింగ్‌ పిచ్‌లపైనైనా కీలక ఇన్నింగ్స్‌లు ఆడాల్సింది. అభిమానులు ఆటను మరింత ఆస్వాదించేలా చేయడంలో ఇంగ్లాండ్‌ సక్సెస్‌ అవుతుందేమో కానీ.. ఫలితాలను రాబట్టడంలో మాత్రం వెనుకబడింది’’ అని ఆకాశ్‌ చోప్రా విశ్లేషించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని