IPL 2024: ధోనీ వల్లే ఇలా ఉన్నా.. ఫైనల్‌లో భయంకర బ్యాటర్‌కు తొలి ఓవర్‌ వేశా: అశ్విన్

రవిచంద్రన్ అశ్విన్‌కు (Aswhin) తమిళనాడు క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలు విషయాలపై మాట్లాడాడు.

Updated : 17 Mar 2024 11:13 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టుకు మూడు ఐసీసీ కప్‌లను అందించిన ఏకైక సారథి ఎంఎస్ ధోనీ (MS Dhoni). కుర్రాళ్లకు అవకాశాలు కల్పించి ముందుకు తీసుకొచ్చిన కెప్టెన్ అతడు. అలాంటి వారిలో రవిచంద్రన్ అశ్విన్‌ (Ashwin) కూడా ఉన్నాడు. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో అతడు పంచుకున్నాడు. టెస్టుల్లో 500+ వికెట్లు తీసిన సందర్భంగా తమిళనాడు క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో అశ్విన్‌కు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా తన కెరీర్‌లోని కీలక విషయాలపై మాట్లాడాడు. 2008లోనే ఐపీఎల్‌లోకి అడుగు పెట్టినప్పటికీ.. మరుసటి ఏడాదిలో తుది జట్టులో స్థానం దక్కింది. తొలి సీజన్‌లో ముత్తయ్య మురళీధరన్ ఉండటంతో అశ్విన్‌కు అవకాశం రాలేదు.

‘‘2008లోనే నేను సీఎస్కే డ్రెస్సింగ్‌ రూమ్‌లో గొప్ప క్రికెటర్లను కలిశా. ఆ సీజన్‌ మొత్తం బెంచ్‌కే పరిమితమైనప్పటికీ.. అక్కడ నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి. ముత్తయ్య మురళీధరన్‌ ఉండటంతో నాకు అవకాశం దక్కలేదు. తర్వాత సీజన్‌లో అరంగేట్రం చేశా. ధోనీకి జీవితాంతం రుణపడి ఉంటా. క్రిస్‌ గేల్‌ వంటి భయంకరమైన బ్యాటర్‌కు తొలి ఓవర్‌ వేసే అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత అనిల్‌ భాయ్‌ నా కెరీర్‌ గురించి మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా దేని గురించైనా మాట్లాడేటప్పుడు పదాల గురించి వెతుక్కోను. అనిల్ కుంబ్లే చేసిన వ్యాఖ్యలకు ఎలా స్పందించాలో తెలియడం లేదు. ఎప్పటికీ గర్వంగా ఫీలవుతా.

తొలినాళ్లలో నేను ఎడమ చేతివాటం బ్యాటర్లకు బౌలింగ్‌ చేయడానికి కాస్త ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు మాత్రం కట్టడి చేయగలను. ఇలా మెరుగవ్వడానికి అప్పట్లో మా ఆటగాడు ఎస్. శరత్‌ కారణం. అతడితో నెట్స్‌లో విపరీతంగా శ్రమించా. ‘అద్భుతమైన ఆఫ్‌స్పిన్నర్‌వి అయితే.. అతడిని ఔట్‌’ చేయమని సహచరులు చెప్పారు. ఒకసారి ఔట్ చేశా. నా బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. చాలా మ్యాచుల్లో ఆడాం. మళ్లీ ఎప్పుడూ నా బౌలింగ్‌లో ఔట్ కాలేదు. అంతటి అద్భుతమైన బ్యాటర్. తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌తో ఎంతో అనుబంధం ఉంది. కుదిరితే తప్పకుండా ఇక్కడికే వస్తా. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. నేను జీవించి ఉన్నా లేకపోయినా నా ఆత్మ మాత్రం చెపాక్‌ చుట్టూ తిరుగుతుంటుంది’’ అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు.

2011 సీజన్‌ ఫైనల్‌లో తొలి ఓవర్‌ను అశ్విన్‌తో ధోనీ వేయించాడు. ప్రత్యర్థి క్రిస్‌ గేల్‌ను నాలుగో బంతికే ఔట్‌ చేసి సంచలనం సృష్టించాడు. ఒక్కసారిగా పాపులర్‌ కావడంతో అదే ఏడాది అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో ఐదో మ్యాచ్‌తో మొత్తం 100 టెస్టులు ఆడిన క్రికెటర్‌గా మారాడు. ఈ మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని