Bengaluru: డుప్లెసిస్‌ వన్‌డౌన్‌లో రావాలి.. వారిద్దరిని పక్కన పెట్టేయాలి: క్రిష్

బెంగళూరు రెండు ఓటములతో ఇబ్బంది పడుతోంది. అయితే, జట్టులో సమూల మార్పులు తీసుకురావాలని మాజీ క్రికెటర్లు సూచించారు.

Updated : 31 Mar 2024 12:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌లో బెంగళూరు మూడు మ్యాచ్‌లు ఆడి.. రెండు ఓటములను చవిచూసింది. ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్‌ల్లో ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్‌ డుప్లెసిస్ విఫలమై నిరాశ పరిచాడు. బౌలర్లూ గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. స్టార్ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ ఒక్కడే కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. దీంతో బెంగళూరు జట్టుపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అదే సమయంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ బెంగళూరు మేనేజ్‌మెంట్‌కు కీలక సూచనలు చేశాడు.

‘‘విల్‌ జాక్స్‌ బ్యాటర్‌గా హిట్టింగ్‌ చేస్తాడు. ఆఫ్‌ స్పిన్‌ వేయగలడు. నేను బెంగళూరు కెప్టెన్‌ అయితే జాక్స్‌ను విరాట్‌తో కలిసి ఓపెనర్‌గా పంపిస్తా. ఫాఫ్‌ను మూడో స్థానంలో ఆడిస్తా. కామెరూన్‌ గ్రీన్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ ఆ తర్వాత వస్తారు. జాక్స్‌తో రెండు ఓవర్లు వేయిస్తాను. గత మూడు మ్యాచుల్లోనూ విఫలమైన అల్జారీ జోసెఫ్‌తోపాటు రజత్‌ పటీదార్‌ను పక్కన పెట్టేయాలి. యువ బౌలర్‌ ఆకాశ్‌ దీప్‌కు అవకాశం కల్పించాలి. అప్పుడు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సమతూకం వస్తుంది. లేకపోతే సరైన బౌలింగ్‌ లేకుండా ఇబ్బంది పడుతూనే ఉండాల్సి ఉంటుంది. కోల్‌కతాతో మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లు ఒక్క బౌన్సర్‌ కూడా వేయకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది’’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.

కోహ్లీ మరీ నిదానంగానా?: చోప్రా

‘‘సునీల్‌ నరైన్ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. భారీ సిక్స్‌లు కొట్టాడు. మ్యాచ్‌ను అతడు తమ వైపు లాగేసుకున్నాడు. ఫిల్‌ సాల్ట్‌ కూడా దూకుడుగా ఆడాడు. మొదటి ఓవర్‌లోనే 18 పరుగులు రాబట్టాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు పవర్‌ప్లేలోనే 85 పరుగులు సాధించారు. అల్జారీ జోసెఫ్, సిరాజ్, యశ్‌ దయాల్‌.. ఎవరినీ వదిలిపెట్టలేదు. విరాట్ కోహ్లీ మాత్రం 59 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఇక  తొలి ఆరు ఓవర్లలో బెంగళూరు బౌలర్లు బౌన్సర్లు, యార్కర్లకు అస్సలు ప్రయత్నించలేదు’’ అని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా విశ్లేషించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని