IND vs BAN: బంగ్లాతో మ్యాచ్‌.. ఆసియా కప్ ఓటమికి భారత్‌ ప్రతీకారం తీర్చుకొనేనా..?

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భారత్ మరో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. గురువారం బంగ్లాదేశ్‌తో (IND vs BAN) పుణె వేదికగా తలపడనుంది. వరుసగా నాలుగో మ్యాచ్‌ను గెలిచి సెమీస్‌ రేసులో ముందుండాలని భారత్‌ సన్నద్ధమవుతోంది.

Updated : 19 Oct 2023 09:45 IST

వన్డే ప్రపంచకప్‌ సంచలనాలతో కొనసాగుతోంది. 
మొన్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను అఫ్గాన్‌ మట్టికరిపించింది. 
నిన్న ఫేవరెట్‌గా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్‌ చెక్‌ పెట్టి.. తొలిసారి టెస్టు అర్హత కలిగిన జట్టును ఓడించి సంచలనం సృష్టించింది.

రోసారి అలాంటిదేమైనా చోటు చేసుకుంటుందా...? అనే సందేహం అభిమానుల్లో కలగడం సహజమే. ఎందుకంటే గురువారం భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ జరగనుంది. పుణె వేదికగా తలపడనున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియానే ఫేవరెట్‌. కానీ సంచలనాలకు వేదికగా మారిన వరల్డ్‌ కప్‌లో ఎప్పుడు..? ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. వరుసగా హ్యాట్రిక్‌ విజయాలతో కొనసాగుతున్న భారత్‌ మరో విజయాన్ని సొంతం చేసుకుని సెమీస్‌ అవకాశాలను మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది. గత మ్యాచుల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ చేతుల్లో ఘోరంగా ఓటమి చవిచూసిన బంగ్లా ఈసారైనా పుంజుకోవాలని బలంగా కోరుకుంటోంది. 

అన్ని విభాగాలు పటిష్ఠం..

గత మూడు మ్యాచుల్లో టాప్ ఆర్డర్‌ నుంచి మిడిలార్డర్‌ వరకు అన్ని పరీక్షలను భారత్ ఎదుర్కొంది. దిగ్విజయంగా టాప్‌గా నిలిచింది. తొలుత ఆసీస్‌పై మిడిలార్డర్‌ రాణించడం.. అఫ్గాన్‌, పాక్‌పై భారత టాప్‌ ఆర్డర్‌తోపాటు బౌలర్లు విజృంభించడం ఆస్వాదించాం. ఇప్పుడు సంచలనాలకు మారుపేరుగా నిలిచే బంగ్లాదేశ్‌ను ఎదుర్కోవడంపై దృష్టిసారించాలి. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్, గిల్, విరాట్, కేఎల్ రాహుల్‌, శ్రేయస్‌ కూడిన బ్యాటింగ్‌ విభాగం ఫుల్‌ఫామ్‌తో ఉంది. ఆల్‌రౌండర్లు హార్దిక్‌, రవీంద్ర జడేజా సమయానికి తగ్గట్టుగా వికెట్లను అందిస్తూ సహకారం ఇస్తున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఏదో మంత్రం చదివినట్లు బంతిని పఠించి వికెట్‌ తీసిన హార్దిక్ నెట్టింట వైరల్‌గా మారిపోయాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన ఓపెనర్‌ను ఔట్‌ చేశాడు. బౌలర్లు బుమ్రా, సిరాజ్‌, కుల్‌దీప్‌ చెలరేగిపోయిన వైనం తెలిసిందే. 

బంగ్లాతో కాస్త జాగ్రత్తే.. 

బంగ్లాదేశ్‌తో పోలిస్తే భారత లైనప్‌ బలంగానే ఉంది. కానీ, ఎలాంటి సమయంలోనైనా ప్రత్యర్థి జట్లకు షాక్‌ ఇవ్వగలిగే సత్తా బంగ్లా సొంతం. మరీ ముఖ్యంగా షకిబ్‌ అల్ హసన్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అలాగే ముష్ఫికర్ రహీమ్‌, పేసర్ ముస్తాఫిజర్, షోంపుల్, తస్కిన్ అహ్మద్ కూడా కీలకంగా మారారు. గత నాలుగు వన్డేల్లో భారత్‌పై బంగ్లాదేశ్‌ మూడింట్లో విజయం సాధించింది. అయితే, అప్పుడు టీమ్‌ఇండియా పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగలేదు. ప్రయోగాలు చేస్తూ కీలక ఆటగాళ్లు లేకుండానే ఆడింది. అయినా సరే బంగ్లాతో పోరంటే అలసత్వం ప్రదర్శించకూడదు. ఇటీవల ఆసియా కప్‌ సూపర్-4లోనూ భారత్‌కు పరాభవం ఎదురైంది.

జట్టు కూర్పే కీలకం..

పుణె వేదికగా కాబట్టి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ. భారత్ జట్టు కూర్పులో పది స్థానాలు ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. పేస్‌ ఆల్‌రౌండర్‌ లేదా స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అనేది పిచ్‌ను బట్టి మారుతూ ఉంటారు. అయితే, పుణె కూడా బ్యాటింగ్‌కు సహకారం ఇస్తుంది కాబట్టి తుది జట్టు ఎలా ఉంటందనేది ఆసక్తికరంగా మారింది. ఇక పేస్‌ విభాగంలో బుమ్రాతోపాటు షమీని తీసుకోవాలనే సూచనలూ వస్తున్నాయి. మరో వైపు సిరాజ్‌ కూడా అద్భుతమైన ఫామ్‌లోనే ఉన్నాడు. ఈ క్రమంలో పేస్‌ ఆల్‌రౌండర్‌గా ఉన్న శార్దూల్‌ను పక్కన పెట్టేసి షమీని తీసుకోవచ్చనే ఊహాగానాలు క్రికెట్‌ వర్గాల్లో ఉన్నాయి. షమీకి వరల్డ్‌ కప్‌ వంటి మెగా టోర్నీల్లో మంచి రికార్డు ఉంది. ఈ వరల్డ్‌ కప్‌లోని గత మూడు మ్యాచుల్లో ఆడే అవకాశం రాలేదు. 

భారత జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్, బుమ్రా, సిరాజ్, షమీ/శార్దూల్‌ ఠాకూర్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని