IND w Vs AUS w: భారత అమ్మాయిలు అదుర్స్‌.. ఆస్ట్రేలియాపై తొలి టెస్టు విజయం

టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఆసీస్‌పై తొలిసారి భారత మహిళల (IND w Vs AUS w) జట్టు విజయం సాధించింది. ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించి జయకేతనం ఎగురువేసింది.

Updated : 24 Dec 2023 15:51 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత అమ్మాయిలు అద్భుత ఆటతీరును ప్రదర్శించారు. మొన్న ఇంగ్లాండ్‌ను భారీ తేడాతో ఓడించిన టీమ్‌ఇండియా.. నేడు ఆసీస్‌పై తొలిసారి టెస్టుల్లో (IND w Vs AUS w) విజయం సాధించింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌ను భారత్‌ 8 వికెట్ల తేడాతో గెలుచుకుంది. దీంతో ఆసీస్‌తో తలపడిన 11 టెస్టుల్లో టీమ్ఇండియాకిదే తొలి విజయం. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా స్నేహ్‌ రాణా నిలిచింది.

ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ 233/5 స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్‌ 261 పరుగులకే ఆలౌటైంది. దీంతో 75 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ రెండు వికెట్ల నష్టంతోనే విజయతీరాలకు చేరింది . స్మృతీ మంధాన (38*), జెమీమా రోడ్రిగ్స్ (12*) క్రీజ్‌లో ఉండి గెలిపించారు. షఫాలీ వర్మ 4, రిచా ఘోష్ 13 పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లు కిమ్‌ గార్త్, గార్డెన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అదరగొట్టిన స్నేహ్‌ రాణా

నాలుగో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్‌లో క్రీజ్‌లో పాతుకుపోయిన అన్నాబెల్ సదర్లాండ్‌ (27)ను స్నేహ్‌ రాణా ఔట్‌ చేసి భారత్‌కు బ్రేక్‌ ఇచ్చింది. వెంటనే అలానా కింగ్‌ (0)ను డకౌట్‌ చేసింది. ఆ తర్వాత వచ్చిన జొనాసెన్ (9: 42 బంతుల్లో) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. చివరి రాజేశ్వరి గౌక్వాడ్‌ (2/42)  జొనాసెన్‌తోపాటు కిమ్‌ గార్త్‌ను బౌల్డ్‌ చేసి ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను ముగించింది. స్నేహ్ రాణా తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీయడం గమనార్హం. 

ప్రతి ఒక్కరి శ్రమ ఫలితమిది: హర్మన్‌

‘‘జట్టులోని ప్రతి సభ్యులు శ్రమించారు. ఆసీస్‌పై విజయంతో చరిత్ర సృష్టించగలిగాం. సానుకూల దృక్పథంతో క్రికెట్‌ను ఆడటం వల్ల కలిగే ప్రయోజనమిదే. మరీ ఆత్మరక్షణ ధోరణిలో క్రికెట్‌ ఆడాలని అనుకోలేదు. మంచి భాగస్వామ్యాలను నిర్మించి స్కోరు బోర్డుపై భారీగా పరుగులు ఉంచాలనిఅనుకున్నాం. అలానే సాధించాం. టెస్టు మ్యాచ్‌ ఆడాలనేది ప్రతి ఒక్కరి కల. దానిని నెరవేర్చినందుకు బీసీసీఐకి ధన్యవాదాలు. సెలక్టర్లు మాకు మద్దతుగా నిలిచారు. టెస్టు క్రికెట్‌ను ఆదరించడానికి వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి కృతజ్ఞతలు’’ అని భారత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ వ్యాఖ్యానించింది.

జట్లు స్కోర్లు ఇవీ:

ఆసీస్‌: తొలి ఇన్నింగ్స్‌ : 219/10, రెండో ఇన్నింగ్స్‌: 261/10
భారత్‌: తొలి ఇన్నింగ్స్‌ 406 ఆలౌట్‌. రెండో ఇన్నింగ్స్‌ 75/2.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని