IND vs ENG: లండన్‌కు మరో స్టార్ ప్లేయర్.. ఐదో టెస్టులో ఆడటం అనుమానమే?

ఇప్పుడు మరో టీమ్‌ఇండియా ఆటగాడు లండన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. గాయం తగ్గకపోవడంతో అక్కడికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని భావిస్తున్నాడు.

Updated : 28 Feb 2024 12:05 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో (IND vs ENG) భారత్ 3-1 ఆధిక్యంతో దూసుకుపోయింది. చివరి మ్యాచ్‌ ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది.  టీమ్‌ఇండియా అద్భుత పోరాటంతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. గాయం కారణంగా గత మూడు టెస్టులకు దూరంగా ఉన్న భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌ (KL Rahul) చివరి మ్యాచ్‌కైనా అందుబాటులోకి వస్తాడని ఆశించినా అలా జరగలేదు. గాయం నుంచి కోలుకోలేదని.. ఫిట్‌నెస్‌ సాధించలేదని తెలుస్తోంది. దీంతో చికిత్స కోసం అతడు లండన్‌ వెళ్తున్నట్లు సమాచారం.

ఇంగ్లిష్‌ జట్టుతో సిరీస్‌ కోసం ప్రకటించిన చివరి మూడు టెస్టుల స్క్వాడ్‌లో కేఎల్‌ రాహుల్‌ పేరుంది. కానీ, ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటేనే తుది జట్టులో అవకాశం ఇస్తామని మేనేజ్‌మెంట్ ముందే కండీషన్ పెట్టింది. ఇప్పుడు సిరీస్‌ ఎలానూ గెలిచాం కాబట్టి ఆటగాళ్ల గాయాల విషయంలో ఎలాంటి రిస్క్‌ తీసుకొనేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ముగిసిన పది రోజుల్లోనే ఐపీఎల్‌ ప్రారంభం కానుంది. ఆ మెగా లీగ్‌ తర్వాత టీ20 ప్రపంచ కప్‌ జరగనుంది. ఇప్పటికే షమీ లండన్‌లోనే శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. అతడు ఐపీఎల్‌కూ అందుబాటులో ఉండటం లేదు. మరి కేఎల్‌ ఫిట్‌నెస్‌ పరిస్థితి కూడా కొద్ది రోజుల్లోనే వెల్లడి కానుంది. మెగా లీగ్‌లో పాల్గొనడంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

బుమ్రా వచ్చేస్తాడు..

వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న బుమ్రా (Bumrah) చివరి మ్యాచ్‌లో ఆడనున్నాడు. ధర్మశాల పేసర్లకు స్వర్గధామం. ఈ క్రమంలో అతడితోపాటు మరో ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్లకు అవకాశం ఇవ్వొచ్చు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన ఆకాశ్ దీప్‌, సిరాజ్‌ ఆడటం ఖాయమే. ఇద్దరు స్పిన్నర్లు అశ్విన్‌, జడేజాకే తుది జట్టులో అవకాశం ఉంటుంది. మూడో స్నిన్నర్‌ను తీసుకేనే ఛాన్స్‌లు తక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని