Hima Das: గోల్డెన్‌ గర్ల్‌ హిమకు ఏమైంది?‘ట్రాక్‌’ తప్పిన సంచలన స్ప్రింటర్‌

పట్టుదల, సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పిన స్ప్రింటర్‌ హిమదాస్‌ (Hima Das). ట్రాక్‌పై చిరుత వేగంతో పరుగుత్తి దేశానికి పతకాలు తెచ్చి రికార్డులు తిరగరాసిన ఆమె.. తాజాగా తాత్కాలిక నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘ధింగ్‌ ఎక్స్‌ప్రెస్‌’గా పేరు తెచ్చుకున్న 23 ఏళ్ల హిమదాస్‌కు ఏమైంది? 

Published : 09 Sep 2023 13:51 IST

కాళ్లకు బూట్లు లేకుండా.. మట్టిలో, పొలాల్లో పరుగెత్తిన ఆ కాళ్లు.. అంతర్జాతీయ స్థాయిలో పతకాల పంట పండించాయి. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించాయి. ఏ పోటీలో అడుగుపెట్టినా.. పతకాలు సలాం కొట్టాయి. దీంతో ‘గోల్డెన్‌ గర్ల్‌’గా ఆమె పేరు మార్మోగింది. సంచలన స్ప్రింటర్‌గా ఆమె సాగిపోయింది. కానీ కట్‌ చేస్తే.. ఇప్పుడు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) నుంచి ఆమె ఏడాది పాటు ప్రాథమిక నిషేధం ఎదుర్కొంటోంది. ఆమెనే.. హిమదాస్‌ (Hima Das). ఉవ్వెత్తున ఎగిసి.. కింద పడ్డ కెరటం ఆమె!

పట్టుదల, సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పిన స్ప్రింటర్‌ హిమదాస్‌. 18 ఏళ్లకే అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ (World Athletics Championships)లో స్వర్ణంతో చరిత్ర సృష్టించినా.. ఆసియా క్రీడల్లో ఒకటి కాదు రెండు కాదు మూడు పతకాలు ముద్దాడినా.. 19 రోజుల వ్యవధిలో అయిదు పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచినా ఆమెకే చెల్లింది. ట్రాక్‌పై చిరుత వేగంతో దేశానికి పతకాలు తెచ్చింది. రికార్డులు తిరగరాసింది. కానీ ఇప్పుడేమో తాత్కాలిక నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘ధింగ్‌ ఎక్స్‌ప్రెస్‌’గా పేరు తెచ్చుకున్న 23 ఏళ్ల హిమదాస్‌కు ఏమైంది? 

అలా ఎదిగి..

అస్సాంలోని ధింగ్‌ నగరానికి దగ్గర్లోని కందులిమారి గ్రామంలో పుట్టింది హిమదాస్‌. ఆమెది వ్యవసాయ కుటుంబం. అయిదుగురి సంతానంలో ఆమెనే చివరిది. మొదట ఆమె ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి కావాలనుకుంది. కానీ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడి సూచనతో స్ప్రింట్‌లోకి జంప్‌ అయింది. పరుగు అందుకుంది. ఆ పరుగే ఆమె కెరీర్‌గా మారిపోయింది. బూట్లు లేకపోయినా పొలాల్లో పరుగెడుతూ సాధన కొనసాగించింది. అంచెలంచెలుగా ఎదిగింది. 2018 అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ 400మీటర్ల పరుగులో పసిడితో చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ పోటీల్లో ట్రాక్‌ విభాగంలో దేశానికి దక్కిన మొట్టమొదటి పసిడి ఇదే. అదే ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లోనూ దూకుడు కొనసాగించింది. 400మీ.ల వ్యక్తిగత పరుగులో జాతీయ రికార్డు (50.79సె) ప్రదర్శనతో రజతం గెలిచింది. 4×400 మీటర్ల మహిళల, మిక్స్‌డ్‌ రిలేల్లో స్వర్ణాలు ఖాతాలో వేసుకుంది. 2019లోనూ ఆమె పతకాల వేటలో సాగిపోయింది. ఐరోపాలో 19రోజుల వ్యవధిలో వేర్వేరు పోటీల్లో కలిపి 5స్వర్ణాలు గెలవడంతో హిమ పేరు మార్మోగిపోయింది. అస్సాం పోలీసు విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ (డీఎస్పీ)గా ఉద్యోగమూ వచ్చింది. ఒకప్పుడు సాధారణ బూట్లపైన తమ సంస్థ పేరు రాసుకున్న ఆమె కోసం.. ఆ ప్రముఖ కంపెనీనే ప్రత్యేకంగా బూట్లు తయారు చేయడం విశేషం. 

ఇలా పడి...

అద్భుతమైన ప్రదర్శనతో సాగిపోయిన హిమదాస్‌ కిందపడింది. చిన్న వయసులోనే ఒక్కసారిగా వచ్చిన పేరు ప్రఖ్యాతులు, డబ్బు ఆమెపై ప్రభావం చూపాయనే చెప్పాలి. గాయాలు కూడా తోడవడంతో ఆమె అంచనాలను అందుకోలేకపోయింది. హిమ ప్రదర్శన క్రమంగా పడిపోయింది. వెన్నెముక గాయంతో 2019 ఆసియా ఛాంపియన్‌షిప్‌ 400మీ. పరుగు హీట్స్‌ నుంచి తప్పుకోవడంతో ఆమె పతనం మొదలైంది. 2019 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌కు గాయంతో దూరమైంది. ఆ తర్వాత కరోనా ఆమెను దెబ్బకొట్టింది. కండరాల గాయంతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది. కేవలం 100మీ, 200మీ.ల పరుగుపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్న ఆమె ఉత్తమ ప్రదర్శన రాబట్టలేకపోయింది. కొన్నేళ్లుగా వెన్ను గాయంతో బాధపడుతున్న ఆమెకు ఈ ఏడాది ఏప్రిల్‌లో చీలమండ గాయం బారిన పడింది. దీంతో ఆసియా క్రీడల ఎంపిక టోర్నీ ఫెడరేషన్‌ కప్‌కు దూరమైంది. ఇప్పుడు ఈ డోపింగ్‌ వివాదం ఆమెను చుట్టుముట్టింది. అథ్లెట్లు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలపై ఎప్పటికప్పుడు నాడాకు సమాచారం ఇవ్వాలి. కానీ 12 నెలల్లో మూడు సార్లు హిమదాస్‌ నిబంధనలను ఉల్లంఘించింది. దీంతో ఇప్పుడు ప్రాథమికంగా ఏడాది పాటు నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చింది. తప్పు తేలితే కనీసం ఏడాది లేదా రెండేళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ వివాదం నుంచి బయటకు వచ్చి ఆమె తిరిగి ట్రాక్‌ ఎక్కడం, ఒకవేళ పోటీ పడ్డా మునుపటిలా రాణించడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు