IND Vs BAN: తప్పిన క్లీన్‌స్వీప్‌ గండం.. చివరి వన్డేలో బంగ్లాపై భారత్‌ ఘన విజయం

నామమాత్రమైన మూడో వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను టీమ్‌ఇండియా 227 పరుగుల తేడాతో చిత్తు చేసింది.  భారత్‌ నిర్దేశించిన 410 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా 182 పరుగులకే ఆలౌటైంది.

Updated : 10 Dec 2022 19:14 IST

చిట్టగాంగ్‌: మూడు వన్డేల సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ కాకుండా భారత్ సూపర్‌ విక్టరీ సాధించింది. నామమాత్రమైన మూడో వన్డేలో బంగ్లాదేశ్‌పై టీమ్‌ఇండియా 227 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 409/8 భారీ స్కోరు చేయగా.. అనంతరం బంగ్లాదేశ్‌ 182 పరుగులకే ఆలౌటైంది. ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధిక తేడాతో భారత్‌ గెలిచిన మూడో మ్యాచ్‌ కావడం విశేషం. బంగ్లా బ్యాటర్లలో షకిబ్ (43) టాప్‌ స్కోరర్. భారత బౌలర్లు శార్దూల్ 3, ఉమ్రాన్‌ 2, అక్షర్ పటేల్ 2.. సిరాజ్‌, కుల్‌దీప్‌ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్‌ తీశారు. మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

తొలుత ఇషాన్‌ కిషన్ (210), విరాట్ కోహ్లీ (113) విజృంభించడంతో టీమ్‌ఇండియా 409/8 భారీ స్కోరు చేసింది. శిఖర్ ధావన్‌ (3), కేఎల్ రాహుల్ (8), శ్రేయస్ అయ్యర్ (3) విఫలం కాగా.. వచ్చిన అవకాశాన్ని ఇషాన్‌ సద్వినియోగం చేసుకొని రికార్డు సృష్టించాడు. దీంతో బంగ్లాదేశ్‌పై భారత్‌ పరువు పోకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డును సొంతం చేసుకొన్నాడు. ఇక ప్లేయర్‌ ఆఫ్ ది సిరీస్‌ను మెహిదీ హసన్ మిరాజ్‌ దక్కించుకున్నాడు.


ఒక్క వికెట్‌కు దూరంలో..

మూడోవన్డేలో భారత్‌ విజయానికి చేరువైంది. బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్‌ ఎనిమిది వికెట్లను కోల్పోయింది. గత రెండు మ్యాచుల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన మెహిదీ హసన్ (39)ను శార్దూల్ ఠాకూర్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ప్రస్తుతం 30 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్‌ 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. క్రీజ్‌లో ముస్తాఫిజర్, టస్కిన్ అహ్మద్ (2*) ఉన్నారు. చివరి 20 ఓవర్లలో భారత్‌ విజయానికి ఒక వికెట్‌ అవసరం కాగా.. బంగ్లాదేశ్‌కు 261 పరుగులు కావాలి.


షకిబ్ ఔట్

మూడో వన్డేలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించి బంగ్లాదేశ్‌ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. కాసేపు అడ్డుకొన్న షకిబ్‌  (43) కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. ప్రస్తుతం 23 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్‌ ఐదు వికెట్ నష్టానికి 124 పరుగులు చేసింది. క్రీజ్‌లో మహముదుల్లా (10), అఫిఫ్‌ ఉన్నారు. 


నెమ్మదించిన స్కోరు బోర్డు

భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో బంగ్లా స్కోరు బోర్డు నెమ్మదించింది. అయితే షకిబ్ (32) మాత్రం ఓ వైపు క్రీజ్‌లో పాతుకుపోయాడు. ఓపెనర్లతోపాటు కీలకమైన ముష్ఫికర్‌ రహ్మాన్ (7) వికెట్‌ను బంగ్లా కోల్పోయింది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్‌ మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజ్‌లో షకిబ్‌తోపాటు యాసిల్ అలీ (12*) ఉన్నాడు. బంగ్లా విజయానికి ఇంకా 34 ఓవర్లలో 320 పరుగులు చేయాలి.


ఓపెనర్లు ఔట్

వికెట్లు పడినా బంగ్లా స్కోరు బోర్డు మాత్రం వేగంగానే కదులుతోంది. భారత బౌలర్ల దెబ్బకు ఓపెనర్లు అనముల్ హక్ (8), లిటన్ దాస్ (29) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. అయితే ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన షకిబ్ అల్ హసన్ (23*) దూకుడుగా ఆడుతున్నాడు. షకిబ్‌కు తోడుగా ముష్ఫికర్ రహ్మాన్ (4*) ఉన్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ 10 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది.


తొలి దెబ్బ అక్షర్‌దే

భారీ లక్ష్య ఛేదనను ప్రారంభించిన బంగ్లాదేశ్‌ను అక్షర్‌ పటేల్ తొలి దెబ్బ కొట్టాడు. తాను వేసిన తొలి బంతినే (4.1వ ఓవర్) భారీ షాట్‌కు యత్నించిన అనముల్‌ (8) సిరాజ్‌ చేతికి చిక్కాడు. మరోవైపు తొలి రెండు ఓవర్లు కాస్త ఆచితూచి ఆడిన లిటన్ దాస్ (24*) దూకుడు పెంచాడు. శార్దూల్‌ వేసిన ఓవర్‌లో లిటన్ సిక్స్‌, ఫోర్ కొట్టి ఊపు తెచ్చాడు. దీంతో 15 పరుగులు వచ్చాయి. అంతకుముందు సిరాజ్‌ బౌలింగ్‌లోనూ 12 పరుగులు రాబట్టాడు.  ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసేసరికి బంగ్లా వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. క్రీజ్‌లో దాస్‌తోపాఉటు షకిబ్ (5*) ఉన్నాడు.  తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ 409/8 స్కోరు చేసిన విషయం తెలిసిందే.


భారత్ స్కోరు 409/8

టీమ్‌ఇండియా వన్డేల్లో ఆరోసారి 400 మార్క్‌ను దాటింది. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో ఈ ఘనత సాధించింది. నామమాత్రమైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్‌ కిషన్ (210), స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (113) అదరగొట్టేయగా.. వాషింగ్టన్ సుందర్ (37), అక్షర్ పటేల్ (20) ఫర్వాలేదనిపించారు. శిఖర్ ధావన్ (3), శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (8) విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 2, షకిబ్ 2, ఎబాడట్‌ 2.. ముస్తాఫిజర్, మెహిదీ చెరొక వికెట్‌ తీశారు. బంగ్లాదేశ్‌పై ఇదే భారత్‌కు అత్యధిక స్కోరు. అంతకుముందు 370/4 స్కోరే అత్యధికం.


స్వల్ప వ్యవధిలో వికెట్లు

మధ్య ఓవర్లలో జోరుగా ఆడిన భారత బ్యాటర్లు.. చివరి ఓవర్లలో మాత్రం ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు చేరుతున్నారు. భారత్ స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోయింది. సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ (113)తోపాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ (8) ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 43 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది. క్రీజ్‌లో వాషింగ్టన్ సుందర్ (8*), అక్షర్ పటేల్ (2*) ఉన్నారు.


కోహ్లీ సెంచరీ

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (104*) వన్డేల్లో మరో సెంచరీ బాదాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇది 72వది కాగా.. వన్డేల్లో 27వ శతకం. నిలకడగా ఆడిన కోహ్లీ 85 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో సెంచరీ సాధించాడు. అంతకుముందు డబుల్‌ సెంచరీ తర్వాత ఇషాన్‌ కిషన్ (210) దూకుడుగా ఆడే క్రమంలో పెవిలియన్‌కు చేరాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్‌ (3) విఫలమయ్యాడు. ప్రస్తుతం 39 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోరు 330/3. క్రీజ్‌లో కోహ్లీతోపాటు కేఎల్ రాహుల్ (3*) ఉన్నాడు.


ఇషాన్‌ డబుల్‌

టీమ్‌ఇండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ (200*) వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించాడు. కేవలం 126 బంతుల్లోనే 23 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో ద్విశతకం సాధించాడు. 85 బంతుల్లో సెంచరీ సాధించిన ఇషాన్‌.. మరో 41 బంతుల్లోనే మరో శతకం పూర్తి చేయడం విశేషం. ప్రస్తుతం భారత్ 35 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 295 పరుగులు చేసింది. మరోవైపు విరాట్ కోహ్లీ (85*) కూడా దూకుడు పెంచాడు. ఈ క్రమంలో సెంచరీ వైపు దూసుకొస్తున్నాడు.


ఇషాన్‌ 150+

బంగ్లాతో మూడో వన్డేలో ఓపెనర్ ఇషాన్‌ కిషన్ (164*) వీరవిహారం చేస్తున్నాడు. 103 బంతుల్లోనే 150 పరుగుల మార్క్‌ను తాకాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ధాటిగా ఆడేస్తున్నాడు. 85 బంతుల్లో సెంచరీ సాధించిన ఇషాన్‌.. మరో 18 బంతుల్లోనే అర్ధశతకం చేయడం విశేషం. విరాట్ కోహ్లీ (56*) కూడా దాదాపు ఎనిమిది వన్డేల తర్వాత హాఫ్ సెంచరీ చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 214 పరుగులను జోడించారు. ప్రస్తుతం 29 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 229 పరుగులు చేసింది.


సెంచరీ చేసిన ఇషాన్

ఓపెనర్ ఇషాన్‌ కిషన్ (107*) అదరగొట్టేశాడు. బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ను అద్భుతంగా ఎదుర్కొని మరీ శతకం బాదేశాడు. ఇషాన్‌ 85 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (46*) ఇషాన్‌కి మద్దతుగా నిలిచాడు. ఈ క్రమంలో అర్ధశతకం వైపు దూసుకొస్తున్నాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 147 పరుగులు జోడించారు. ప్రస్తుతం భారత్ 24 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 162 పరుగులు చేసింది.


ఇషాన్ హాఫ్ సెంచరీ

టీమ్‌ఇండియా ఓపెనర్ ఇషాన్‌ కిషన్ (60*) దూకుడు కొనసాగుతోంది. ఈ  క్రమంలో వన్డే కెరీర్‌లో నాలుగో అర్ధశతకం పూర్తి చేశాడు. మరోవైపు సీనియర్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (16*) నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు.  వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు అర్ధశతక (70) భాగస్వామ్యం నిర్మించారు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్‌ నష్టానికి 85 పరుగులు చేసింది.


దూకుడుగా ఇషాన్

తొలి వికెట్‌ను కోల్పోయినప్పటికీ భారత స్కోరు బోర్డును విరాట్ కోహ్లీ (8*)తో కలిసి ఇషాన్‌ కిషన్ (33*) నడిపిస్తున్నాడు. దూకుడుగా ఆడుతూ బౌండరీలు బాదుతున్నాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి టీమ్‌ఇండియా వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. 


తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌.. ధావన్‌ ఔట్‌..

టీమ్‌ఇండియా తొలి వికెట్‌ కోల్పోయింది. మెహిదీ హసన్‌ మిరాజ్‌ వేసిన ఐదో ఓవర్‌ తొలి బంతికి ఓపెనర్‌ ధావన్‌ (3) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టానికి 17 పరుగులు చేసింది. కోహ్లీ 1, ఇషాన్‌ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.


భారత్‌ బ్యాటింగ్‌..

భారత్‌-బంగ్లా మధ్య జరుగుతోన్న మూడో వన్డేలో టాస్‌ ఓడిన టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ప్రారంభించింది. ధావన్‌, ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. తొలి ఓవర్‌ ముగిసే సరికి టీమ్‌ఇండియా 1 పరుగు చేసింది. బంగ్లా తరఫున ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను ప్రారంభించాడు.


భారత్‌-బంగ్లా జట్లు ఇవే..


బౌలింగ్‌ ఎంచుకున్న బంగ్లా..

చిట్టగాంగ్‌ : భారత్‌-బంగ్లా మధ్య నామమాత్రమైన మూడో వన్డే మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన బంగ్లా.. బౌలింగ్‌ ఎంచుకుంది.


పరువు కోసం భారత్‌ పోరాటం.. క్లీన్‌స్వీప్‌పై బంగ్లా కన్ను

బంగ్లా పర్యటనలో టీమ్‌ఇండియా(Team India) వరుసగా రెండు వన్డేల్లో పరాజయం పాలై సిరీస్‌(IND Vs BAN)ను కోల్పోయిన విషయం తెలిసిందే. నేడు నామమాత్రమైన చివరి వన్డే జరగనుంది. కనీసం ఈ మ్యాచ్‌లో అయినా నెగ్గి పరువు దక్కించుకోవాలని టీమ్‌ఇండియా చూస్తుంటే.. సిరీస్‌ నెగ్గిన ఊపులో క్లీన్‌స్వీప్‌ చేసేయాలని బంగ్లా(Bangladesh) పట్టుదలగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని