IND vs ENG: ఆ ఆరుగురివి 151.. యశస్వి ఒక్కడే 179*.. తొలి రోజు భారత్‌ 336/6

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో (IND vs ENG) భారత్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత శతకంతో కీలక పాత్ర పోషించాడు. 

Updated : 02 Feb 2024 17:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విశాఖపట్నం వేదికగా భారత్ - ఇంగ్లాండ్‌ (IND vs ENG) జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. భారత ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ (179*; 256 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ సెంచరీతో అజేయంగా నిలిచాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్‌ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. క్రీజ్‌లో యశస్వితోపాటు అశ్విన్‌ (5*) ఉన్నాడు. ఇంగ్లాండ్‌ అరంగేట్ర బౌలర్‌ షోయబ్‌ బషీర్‌తోపాటు రెహాన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (14) వికెట్‌తో బషీర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో ఖాతా తెరవడం విశేషం. సీనియర్ బౌలర్ జేమ్స్‌ అండర్సన్, స్పిన్నర్ టామ్‌ హార్ట్‌లీ చెరో వికెట్ తీశారు.

ఆ ఒక్కడే నిలబడి..

ఆరంభంలో ఆచితూచి ఆడిన యశస్వి (Yashasvi Jaiswal) క్రీజ్‌లో కుదురుకున్నాక చెలరేగిపోయాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఏకాగ్రత కోల్పోలేదు. రోహిత్‌తో కలిసి తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించాడు. శుభ్‌మన్‌ (34)తో రెండో వికెట్‌కు 49, శ్రేయస్‌ అయ్యర్‌ (27)తో మూడో వికెట్‌కు 90, అరంగేట్ర బ్యాటర్ రజత్‌ పటీదార్‌ (32)తో నాలుగో వికెట్‌కు 70, అక్షర్ పటేల్‌తో (27) ఐదో వికెట్‌కు 52 పరుగులు జోడించాడు యశస్వి.

స్పిన్నర్లు, పేసర్‌ ఎంత ఇబ్బందిపెట్టినా ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో భారీ సిక్స్‌తో సెంచరీ సాధించడం విశేషం. 151 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న జైస్వాల్‌ ఆ తర్వాత మరింత దూకుడు ప్రదర్శించాడు. తొలి రోజు ఆట మరికాసేపట్లో ముగుస్తుందనగా.. లోకల్‌ బాయ్‌ శ్రీకర్ భరత్ (17)ను రెహాన్ బోల్తా కొట్టించాడు. ఆఫ్‌సైడ్‌ వెళ్తున్న బంతిని కట్‌ చేసేందుకు యత్నించి బ్యాక్‌వర్డ్‌ పాయింట్ వద్ద బషీర్‌కు చిక్కాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని