T20 World Cup 2024: వేటకు వేళాయె..

టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ సేన తొలి దశ దాటడం కష్టమేమీ కాకపోవచ్చు. గ్రూప్‌ దశలో లక్ష్యమల్లా పాకిస్థాన్‌ను మట్టికరిపించి అగ్రస్థానంతో సూపర్‌-8కు అర్హత సాధించడమే. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రియులందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూసే ఆ పోరుకు ఇంకో నాలుగు రోజుల సమయం ఉండగా.. ఈలోపు ఆటగాళ్లందరూ అమెరికా వాతావరణానికి అలవాటు పడడానికి, లయ అందుకోవడానికి ఓ మంచి అవకాశం.

Updated : 05 Jun 2024 07:10 IST

ప్రపంచకప్‌లో రోహిత్‌సేన ఆట నేటి నుంచే
తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో ఢీ

టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ సేన తొలి దశ దాటడం కష్టమేమీ కాకపోవచ్చు. గ్రూప్‌ దశలో లక్ష్యమల్లా పాకిస్థాన్‌ను మట్టికరిపించి అగ్రస్థానంతో సూపర్‌-8కు అర్హత సాధించడమే. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రియులందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూసే ఆ పోరుకు ఇంకో నాలుగు రోజుల సమయం ఉండగా.. ఈలోపు ఆటగాళ్లందరూ అమెరికా వాతావరణానికి అలవాటు పడడానికి, లయ అందుకోవడానికి ఓ మంచి అవకాశం. చిన్న జట్టు ఐర్లాండ్‌తో భారత్‌ తొలి పోరు బుధవారమే. ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోకుండా.. పాక్‌తో పోరుకు ముందు మంచి ఫామ్‌ను అందుకోవడానికి ఈ మ్యాచ్‌ను టీమ్‌ఇండియా ఉపయోగించుకోవాలి.

న్యూయార్క్‌

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తొలి పోరుకు సమయం ఆసన్నమైంది. రోహిత్‌సేన బుధవారం ఐర్లాండ్‌ను ఢీకొనబోతోంది. బలాబలాల్లో భారత్‌కు, ఐర్లాండ్‌కు పోలిక లేదు. కానీ ఐర్లాండ్‌ను చిన్న జట్లలో పెద్దదిగా చెప్పొచ్చు. అసోసియేట్‌ దేశాలపై ఆధిపత్యం చలాయించే ఆ జట్టు.. అప్పుడప్పుడూ పెద్ద జట్లకూ షాకులిస్తుంటుంది. గత ఏడాది టీ20 సిరీస్‌లో బుమ్రా నేతృత్వంలోని ద్వితీయ శ్రేణి భారత జట్టుకు ఐర్లాండ్‌ గట్టి పోటీనిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో ఆడే స్టిర్లింగ్, లిటిల్, క్యాంఫర్, అడైర్‌ లాంటి ఆటగాళ్లతో ఆ జట్టు మెరుగ్గానే కనిపిస్తోంది. కాబట్టి చిన్న జట్టన్న ఉదాసీనత రానివ్వకుండా.. టీమ్‌ఇండియా తన స్థాయికి తగ్గట్లు ఆడి విజయం సాధించాల్సిన అవసరముంది.

ఎవరు.. ఎక్కడ?: తొలి మ్యాచ్‌లో భారత్‌ విజయం లాంఛనమే కావచ్చు. ఇందులో ఘనంగా గెలవడమే కాక.. కూర్పు సరిచూసుకోవడానికి, ఆటగాళ్లు లయ అందుకోవడానికి ఉపయోగించుకోవాలనుకుంటోంది టీమ్‌ఇండియా. ఎక్కువ మంది ఆల్‌రౌండర్లు జట్టులో ఉండేలా చూస్తామని రోహిత్‌ చెప్పిన నేపథ్యంలో శివమ్‌ దూబె తుది జట్టులో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. యశస్వి జైస్వాల్‌ బెంచ్‌కే పరిమితం కావొచ్చు. రోహిత్‌తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశముంది. సూర్యకుమార్‌ మూడో స్థానంలో, రిషబ్‌ పంత్‌ ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగొచ్చు. హార్దిక్‌ వీరి తర్వాత వస్తాడు. ఐపీఎల్‌లో, బంగ్లాదేశ్‌తో వార్మప్‌ మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ చక్కగా బౌలింగ్‌ చేశాడు. అతను బ్యాట్‌తోనూ ఫామ్‌లో ఉన్నాడు. జడేజా ఊపు తగ్గిన నేపథ్యంలో అతడి బదులు అక్షర్‌నే ఆడించే అవకాశాలను కొట్టిపారేయలేం. స్పెషలిస్టు స్పిన్నర్లలో కుల్‌దీప్‌ ఒకడికే అవకాశం దక్కొచ్చు. బుమ్రాతో కలిసి అర్ష్‌దీప్, సిరాజ్‌ పేస్‌ బాధ్యతలు పంచుకుంటారు. పిచ్‌ స్పిన్‌కు ఎక్కువ అనుకూలం అనుకుంటే.. సిరాజ్‌ స్థానంలో చాహల్‌ ఆడే అవకాశముంది.

ఆల్‌రౌండర్ల నిలయం: 2011 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి సంచలనం రేపిన దగ్గర్నుంచి ఐర్లాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్లో ఎవ్వరూ తేలిగ్గా తీసుకోవట్లేదు. ముఖ్యంగా జట్ల మధ్య అంతరం తక్కువగా ఉండే టీ20ల్లో ఎక్కువగా ఆల్‌రౌండర్లతో నిండిన ఐర్లాండ్‌తో జాగ్రత్తగా ఉండాల్సిందే. క్యాంఫర్, అడైర్, డెలానీ, డాక్రెల్, టెక్టార్, స్టిర్లింగ్‌.. ఇలా ఆరుగురు ఆల్‌రౌండర్లను తుది జట్టులో ఆడిస్తుంది ఐర్లాండ్‌. వీరిలో స్టిర్లింగ్‌ ఈ మధ్య బ్యాటింగ్‌కే పరిమితమవుతున్నాడు. ఓపెనింగ్‌లో అతను దూకుడుగా ఆడి జట్టుకు మెరుపు ఆరంభాలనిస్తుంటాడు. కెప్టెన్‌ బాల్‌బిర్నీ కూడా ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడు. టెక్టార్, టకర్, డాక్రెల్, డెలానీ, క్యాంఫర్, అడైర్‌.. ఇలా కింది వరుస వరకు బ్యాటుతో సత్తా చాటగలరు. బౌలింగ్‌లో లిటిల్, యంగ్, అడైర్‌ కీలకం.


పిచ్‌ బౌలర్లదే!

న్యూయార్క్‌ క్రికెట్‌ స్టేడియం ప్రపంచకప్‌లో ఇప్పటికే ఓ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చింది. అందులో శ్రీలంక 77 పరుగులకే కుప్పకూలగా.. అంత చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి దక్షిణాఫ్రికా చాలా కష్టపడింది. 4 వికెట్లు కోల్పోయి 16వ ఓవర్లలో కానీ విజయాన్నందుకోలేకపోయింది. దీన్ని బట్టే ఇక్కడ బౌలర్లదే హవా అని అర్థమవుతోంది. ఇక్కడే బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బాగానే బ్యాటింగ్‌ చేసింది. 5 వికెట్లకు 182 పరుగులు సాధించింది. కానీ బంగ్లా మాత్రం 122/9కి పరిమితమైంది. ఆ అనుభవం భారత బ్యాటర్లు, బౌలర్లకు ఉపయోగపడేదే. అయితే దక్షిణాఫ్రికా-శ్రీలంక మ్యాచ్‌ పిచ్‌పై విమర్శలు చెలరేగిన నేపథ్యంలో పిచ్‌ ఈసారి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటివరకు ఐర్లాండ్‌తో ఎనిమిది టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత్‌.. అందులో ఏడు గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. 


‘‘కోచ్‌గా కొనసాగాలని ద్రవిడ్‌ను ఒప్పించడానికి ప్రయత్నించా. కానీ అతడికీ చాలా పనులు ఉంటాయి కదా. నేను మాత్రం అతడితో కలిసి పని చేయడాన్ని ఆస్వాదించా. మిగతా ఆటగాళ్లు కూడా నాలాగే భావిస్తూ ఉంటారు. నేను ఐర్లాండ్‌లో అరంగేట్రం చేసినప్పుడు అతడే కెప్టెన్‌. మాకు అతడు ఆదర్శం’’

రోహిత్‌ శర్మ


తుది జట్లు (అంచనా).. భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), కోహ్లి, సూర్యకుమార్, పంత్, దూబె, హార్దిక్, జడేజా/అక్షర్, కుల్‌దీప్, బుమ్రా, అర్ష్‌దీప్, సిరాజ్‌.

ఐర్లాండ్‌: బాల్‌బిర్నీ (కెప్టెన్‌), స్టిర్లింగ్, టెక్టార్, టకర్, డాక్రెల్, డెలానీ, క్యాంఫర్, అడైర్, మెకార్తీ, యంగ్, వైట్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు