IND vs NZ: పొట్టి కప్‌ ముగిసె.. పొట్టి సిరీస్‌కు సమయమొచ్చె

భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లూ తమ సాధనతో సిద్ధంగా ఉన్నాయి. తొలి మ్యాచ్‌కు వెల్లింగ్టన్‌ వేదిక.

Updated : 17 Nov 2022 19:12 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ ముగిసి ఇంకా వారం గడవకముందే టీమ్‌ఇండియా క్రికెట్ అభిమానుల కోసం పొట్టి ఫార్మాట్‌లో మ్యాచ్‌లు సిద్ధంగా ఉన్నాయి. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం న్యూజిలాండ్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. మరి ఇరు జట్లలోని కీలక ఆటగాళ్లు ఎవరనేది తెలుసుకొందాం.. 

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, బుమ్రా, షమీ, డీకే వంటి సీనియర్లు లేకుండా టీమ్‌ఇండియా బరిలోకి దిగుతోంది. బుమ్రా గత టీ20 ప్రపంచకప్‌లోనూ ఆడని విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ అదరగొట్టేయగా.. రోహిత్, రాహుల్‌ మాత్రం తమ స్థాయి ప్రదర్శన చేయలేదు. అయినప్పటికీ హార్దిక్‌ పాండ్య నాయకత్వంలో భారత్‌ జట్టు పటిష్టంగా ఉంది. రిషభ్‌ పంత్‌ను వైస్‌ కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ ఎలాగూ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. పంత్‌తోపాటు యువ బ్యాటర్లు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మరీ ముఖ్యంగా శుభ్‌మన్‌ గిల్, సంజూ శాంసన్‌, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, ఇషాన్‌ కిషన్‌ కీలకం. అయితే వీరిలో తుది జట్టులో ఎవరు ఉంటారనేది తెలియాలంటే మ్యాచ్‌ వరకు ఆగాల్సిందే. 

ఉమ్రాన్‌ వచ్చేశాడు.. చాహల్‌, హర్షల్‌కు ఈసారైనా..?

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌ ఆరు మ్యాచ్‌లను ఆడింది. సీనియర్‌ లెగ్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌కు ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం కల్పించలేదు. ఆసీస్‌ పిచ్‌లు లెగ్‌స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయని మాజీలు చెప్పినా.. భారత కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్‌ అటువైపుగా ఆలోచనే చేయలేదు. అలాగే డెత్‌ ఓవర్లలో అండగా నిలుస్తాడని భావించి ఎంపిక చేసిన హర్షల్‌ పటేల్‌కూ ఛాన్స్‌ దక్కలేదు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లోనైనా వీరిద్దరికి అవకాశం ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. టీ20 ఫార్మాట్‌లో లెగ్‌ స్పిన్నర్లు ప్రభావం చూపుతారనేది మాజీల వాదన. ఇక భారత ఫాస్టెస్ట్‌ బౌలర్‌గా మారిన యువ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఎట్టకేలకు జాతీయ జట్టులో మళ్లీ చోటు సంపాదించాడు. కుల్‌దీప్‌ కూడా తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. ఆల్‌రౌండర్లు దీపక్ చాహర్‌, శార్దూల్ ఠాకూర్‌ కూడా తమ అవకాశం కోసం వేచి చూస్తున్నారు. 

దాదాపు అదే జట్టుతో కివీస్‌..

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ సెమీస్‌లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌ చేతిలో టీమ్‌ఇండియా.. పాక్‌పై కివీస్‌ ఓడిపోయాయి. అయితే పొట్టి కప్‌లో బరిలోకి దిగిన జట్టులో ఒకరిద్దరు మినహా మిగతావారిని భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేయడం విశేషం. ట్రెంట్‌ బౌల్ట్‌కు విశ్రాంతినిచ్చిన కివీస్‌ మేనేజ్‌మెంట్‌ కీలకమైన బ్యాటర్లు ఫిన్‌ అలెన్, బ్రాస్‌వెల్‌, డేవన్ కాన్వే, టామ్‌ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్‌, జీమ్మీ నీషమ్‌లను ఎంపికచేసింది. ప్రపంచకప్‌లో పెద్దగా రాణించని ఆ జట్టు సారథి కేన్‌ విలియమ్సన్‌కు రెస్ట్‌ ఇస్తారని అంతా భావించారు. అయితే కేన్‌కే నాయకత్వ పగ్గాలను అప్పజెప్పారు. టిమ్‌ సౌథీ, మిచెల్‌ సాంట్నర్, ఆడమ్‌ మిల్నే, ఐష్‌ సోధి, లాకీ ఫెర్గూసన్‌తో కూడిన బౌలింగ్‌ దళం అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే మ్యాచ్‌లు జరిగేది న్యూజిలాండ్‌లోనే కాబట్టి వారికి వారి పిచ్‌లపై పూర్తి అవగాహన ఉంటుంది.

భారత్‌- న్యూజిలాండ్‌ సిరీస్‌: జట్లు, తేదీలు, వేదికలు, స్ట్రీమింగ్‌ వివరాలు ఇవే!

గత రికార్డులు ఇలా..

* భారత్‌ - న్యూజిలాండ్ జట్లు 20 టీ20 మ్యాచుల్లో తలపడ్డాయి. 

* భారత్‌ 11 మ్యాచుల్లో గెలవగా.. న్యూజిలాండ్ 9 మ్యాచుల్లో విజయం సాధించింది.

* భారత్‌ వేదికగా జరిగిన మైదానాల్లో భారత్‌ ఐదు మ్యాచుల్లో, న్యూజిలాండ్‌ 4 మ్యాచుల్లో విజయం సాధించింది.

* కివీస్‌ వేదికగా  భారత్‌ 6 మ్యాచుల్లో, న్యూజిలాండ్‌ మూడు మ్యాచుల్లోనే విజయం సాధించడం విశేషం.

* తటస్థ వేదికల్లో జరిగిన రెండు మ్యాచుల్లోనూ న్యూజిలాండ్‌ గెలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని