India Vs Pakistan: ఆసియా కప్‌లో దాయాదుల పోరు.. ఎవరిది జోరు?

ఆసియా కప్‌లో ఇప్పటివరకు ఈ చిరకాల ప్రత్యర్థుల (IND vs PAK) మధ్య 17 మ్యాచ్‌లు జరిగాయి. మరి ఏ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధించింది, ఏ జట్టు ఆధిపత్యం కొనసాగించిందో తెలుసుకుందాం.

Updated : 01 Sep 2023 09:44 IST

భారత్‌ x పాకిస్థాన్‌ (India Vs Pakistan) మ్యాచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్‌ ఉంటుంది. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు అభిమానులు. ఈ దాయాది దేశాలు మరోసారి క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023)లో భాగంగా ఇండియా, పాక్‌ మ్యాచ్‌ సెప్టెంబరు 2న (శనివారం) జరగనుంది. ఆసియా కప్‌లో ఇప్పటివరకు ఈ చిరకాల ప్రత్యర్థుల (IND vs PAK) మధ్య 17 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మూడుమ్యాచ్‌లు టీ20 ఫార్మాట్‌లో తలపడ్డాయి. మరి ఏ మ్యాచ్‌లో (వన్డేల్లో) ఏ జట్టు విజయం సాధించింది, ఏ జట్టు ఆధిపత్యం కొనసాగించిందో తెలుసుకుందాం..

మొదటి రెండు మ్యాచ్‌లు మన ఖాతాలోకే

మొదటి ఆసియా కప్‌ 1984లో జరగ్గా.. ఆ సీజన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా (Team India) నిర్ణీత 46 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో పాక్‌ 39.4 ఓవర్లకు 134 పరుగులు చేసి ఆలౌటైంది. 1988లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్లతో జయకేతనం ఎగరవేసింది. పాక్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని 26 బంతులు మిగిలుండగానే అందుకుంది. మోహిందర్ అమర్‌నాథ్ (74) భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

20 ఏళ్ల తర్వాత విజయం

1988లో పాక్‌పై గెలిచిన భారత్.. దాయాది దేశంపై మరో విజయం సాధించేందుకు దాదాపు 20 ఏళ్లు పట్టింది. 1995లో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియాపై పాక్‌ 97 పరుగుల తేడాతో నెగ్గింది. 1997లో జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దయింది. 2000, 2004 సంవత్సరాల్లో జరిగిన మ్యాచ్‌ల్లోనూ భారత్‌కు పరాజయం తప్పలేదు. 2008లో జరిగిన ఆసియా కప్‌లో భారత్, పాక్‌ రెండుసార్లు తలపడ్డాయి. గ్రూప్‌ దశలో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ నిర్దేశించిన 300 పరుగుల లక్ష్యాన్ని టీమ్‌ఇండియా 6 వికెట్లు కోల్పోయి 47 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఆసియా కప్‌లో పాక్‌పై భారత్‌కిది 20 ఏళ్ల తర్వాత మొదటి విజయం. సూపర్‌-4 దశలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఎనిమిదిలో ఆరు.. వరుసగా నాలుగు

2010 నుంచి 2022 వరకు ఆసియా కప్‌లో భారత్, పాక్ ఎనిమిదిసార్లు తలపడగా.. టీమ్‌ఇండియా ఏకంగా 6 సార్లు విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించింది. 2010లో జరిగిన మ్యాచ్‌లో, 2012 సంవత్సరాల్లో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా.. 2014లో పాక్‌ నెగ్గింది. తర్వాత  టీమ్‌ఇండియా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. టీ20 ఫార్మాట్‌లో జరిగిన 2016 ఆసియా కప్‌లో పాక్‌ని భారత్ 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 2018లో ఇరుజట్లు రెండుసార్లు తలపడగా.. రెండింటిలోనూ విజయం సాధించి టీమ్‌ఇండియా హ్యాట్రిక్‌ కొట్టింది. గతేడాది (2022) టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లోనూ దాయాది దేశాలు రెండుసార్లు తలపడ్డాయి. గ్రూప్‌ దశలో జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలుపొంది వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. వారం రోజుల వ్యవధిలో జరిగిన సూపర్‌-4 దశ మ్యాచ్‌లో 181 పరుగుల భారీ స్కోరు చేసినా పాక్‌ చేతిలో భారత్‌కు పరాజయం తప్పలేదు. ఈ సారి విజయం ఏ జట్టును వరిస్తుందో చూడాలి మరి. 

-ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని