Street Child World Cup 2023: ఆ బాలలకు ప్రపంచకప్‌ ఆనందం

భారత్‌లో వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ (ODI World Cup 2023) ఆరంభానికి ముందే ఈ స్ట్రీట్‌ చిల్డ్రన్‌ కప్‌ మొదలైంది. అందులో ఆడే వారు కొంతమంది అనాథలు.. ఇంకొందరు దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్న వాళ్లు.. మురికివాడల్లో జీవిస్తున్నవాళ్లు!

Updated : 25 Sep 2023 12:27 IST

వారిలో కొంతమంది అనాథలు.. ఇంకొందరు దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్న వాళ్లు.. మురికివాడల్లో జీవిస్తున్నవాళ్లు! అలాంటి వారి మోములో ఆనందం నింపడం కోసం ఓ ప్రపంచకప్‌ వచ్చింది. భారత్‌లో వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ ఆరంభానికి ముందే ఈ స్ట్రీట్‌ చిల్డ్రన్‌ కప్‌ మొదలైంది. మిక్స్‌డ్‌ జండర్‌ ఈవెంట్‌గా జరుగుతున్న ఈ టోర్నీ చెన్నై వేదికగా షురూ అయింది. వీధి బాలల్లో క్రికెట్‌ నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ ప్రపంచకప్‌ను నిర్వహిస్తున్నారు. భారత్‌తో పాటు ఇంగ్లాండ్, బురుండీ, హంగేరీ, మారిషస్, బంగ్లాదేశ్, నేపాల్, రువాండా, మెక్సికో, శ్రీలంక, దక్షిణాఫ్రికా నుంచి క్రికెటర్లు ఈ కప్‌లో పాల్గొనబోతున్నారు. వీధి బాలల కోసం ప్రపంచకప్‌ జరగడం ఇది రెండోసారి. 

ఒక్కొక్కరిది ఒక్కో గాథ

తినడానికే తిండి లేక.. ఉండటానికి ఇళ్లు లేక.. నా అనే దిక్కులేక ఎన్నో బాధలు అనుభవించే వీధి బాలలు క్రికెట్‌ ఆడడం ఏంటి? అందులోనూ ప్రపంచకప్‌లో పోటీపడడం ఏంటి? అనే అనుమానాలు వస్తాయి. అయితే క్రికెట్‌ ఆట మీద వారికి ఉన్న ప్రేమ వల్లే ఇది సాధ్యమైంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. సౌకర్యాలు లేకపోయినా వివిధ ఎన్‌జీవోల ద్వారా, దాతల ద్వారా ఆటలో నైపుణ్యం సంపాదించిన ఈ చిన్నారులు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్‌ విషయానికొస్తే సానియా, శ్రవణ్, జన్నత్, ఫర్జానా, సంధ్య లాంటి వాళ్లు ఈ కప్‌లో పోటీపడుతున్నారు.

నిజానికి వారికి ఇలాంటి ఈవెంట్లో ఆడడమే పెద్ద కల. ఎందుకంటే పస్తులు ఉండే స్థితి నుంచి ఇలా బ్యాటు, బంతి పట్టి మైదానంలోకి వచ్చి ఆడడం మామూలు విషయం కాదు. కులీ పని చేసే నాన్న, పని మనిషిగా పని చేసే అమ్మ.. ఇది జన్నత్‌ నేపథ్యం. ఆర్థిక ఇబ్బందులతో చదువు కూడా మానేసింది. కానీ ఎన్‌జీవో సాయంతో మళ్లీ చదువుకుంటోంది. అంతేకాదు క్రికెట్‌ను నేర్చుకుని ఇప్పుడు ప్రపంచకప్‌ ఆడుతోంది. మరోవైపు బిహార్‌కు చెందిన శ్రవణ్‌ను ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసి చదువు చెప్పిస్తోంది. అతడికి క్రికెట్‌ను పరిచయం చేసి సానబట్టింది. దిల్లీలోని ఒక మురికివాడకు చెందిన కరణ్‌ది కూడా ఇదే పరిస్థితి. కనీస సౌకర్యాలు లేని స్థితి నుంచి ఈ కుర్రాడు ఆటలో ఎదిగాడు. రైల్వే ట్రాక్‌ల పక్కన క్రికెట్‌ ఆడి మెరుగయ్యాడు. 

ఎలా ఆడుతున్నారంటే..

ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల నుంచి 20 జట్లు ఈ ప్రత్యేక ప్రపంచకప్‌లో పోటీపడుతున్నాయి. 168 మంది చిన్నారులు ఈ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. బాలికలు, బాలుర కలిసి ఆడడం ఈ కప్‌ ప్రత్యేకత. టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో ప్రతి జట్టులో ఆరుగురు సభ్యులు ఉంటారు. ప్రతి టీమ్‌లో ముగ్గురు బాలురు, ముగ్గురు బాలికలు ఆడతారు. బకెట్‌ లిస్ట్, చెట్నా, హోప్‌ ఫౌండేషన్, మ్యాజిక్‌ బస్‌ ఇండియా ఫౌండేషన్, సలామ్‌ బాలక్‌ ట్రస్ట్‌ లాంటి సంస్థలు వీధి బాలల కోసం అండగా నిలుస్తున్నాయి. వారికి అవసరమైన దుస్తులు, షూస్‌తో పాటు ఆహారం, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నాయి.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు