WI vs IND: వారి మద్దతు అద్భుతం.. అదే అక్కరకొచ్చింది.. మేం 15 రన్స్‌ తక్కువ చేశాం!

విండీస్‌పై నాలుగో టీ20 మ్యాచ్‌లో (WI vs IND) భారత్‌ విజయం సాధించింది. బ్యాటింగ్‌ పిచ్‌పై ఓపెనర్లు అదరగొట్టేయడంతో తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది.

Updated : 13 Aug 2023 08:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెస్టిండీస్‌తో కీలకమైన నాలుగో టీ20 మ్యాచ్‌లో (WI vs IND) భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2-2తో సమం చేసి సజీవంగా ఉంచుకోగలిగింది. విజేతను తేల్చే చివరి మ్యాచ్‌ కూడా ఫ్లోరిడాలోని లాడర్‌హిల్స్‌ వేదికగా జరగనుంది. అయితే, నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత యువ ఆటగాళ్లు జైస్వాల్, గిల్ అర్ధశతకాలు సాధించి జట్టును గెలిపించారు. టీమ్‌ఇండియా గెలవడంపై కెప్టెన్ హార్దిక్ పాండ్యతోపాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ యశస్వి జైస్వాల్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే, తమ జట్టు మరో 15 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని విండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ వ్యాఖ్యానించాడు. 

WI vs IND: అమెరికాలో అదరగొట్టారు

‘‘లాడర్‌హిల్స్‌లో భారీ సంఖ్యలోనే భారతీయులు ఉన్నారు. వారందరూ మద్దతుగా నిలిచారు. మేం వారిని ఎంటర్‌టైన్‌ చేశామని భావిస్తున్నా. యువ బ్యాటర్లు శుభ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్ అద్భుతం. బౌలర్లు కష్టానికి బ్యాటర్లుగా మేం బాధ్యత తీసుకుని ఆడాల్సి ఉంటుంది. బౌలర్లే మ్యాచ్‌ విన్నర్లు. వారు త్వరగా వికెట్లు తీస్తే మ్యాచ్‌ మన నియంత్రణలోనే ఉంటుంది. యువ ఓపెనర్లు గిల్, జైస్వాల్ చక్కని షాట్లతో అలరించారు. ఇలాంటి వేడి పరిస్థితుల్లో వారే మ్యాచ్‌ను ముగించడం బాగుంది. ఓడిన రెండు మ్యాచుల్లో.. తొలి టీ20లో మాత్రం మేం చేసిన తప్పిదాల వల్లే ఓడిపోయాం. అయితే పుంజుకుని సిరీస్‌ రేసులో నిలవగలిగాం. టీ20 క్రికెట్‌లో విజయం ఏ ఒక్కరికి ఫేవర్‌గా ఉండదు. నాణ్యమైన క్రికెట్‌ ఆడితే తప్పక గెలుస్తారు’’ అని పాండ్య తెలిపాడు. 


మంచి బ్యాటింగ్‌ పిచ్‌.. కానీ..: పావెల్

‘‘లాడర్‌హిల్స్‌ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే, మేం కనీసం ఇంకో 10 నుంచి 15 పరుగులు అదనంగా చేసుంటే బాగుండేది. హెట్‌మయెర్, హోప్ అద్భుతంగా ఆడారు. మాకు నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. అయితే, మేం అనుకున్న ప్రణాళికలను మైదానంలో అమలు చేయడంలో విఫలమయ్యాం. అత్యుత్తమ బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన జట్టుతో ఆడేటప్పుడు నిత్యం అలర్ట్‌గా ఉండాలి. సిరీస్‌ ప్రారంభం నుంచి స్పిన్‌ బౌలింగ్‌ను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై దృష్టిసారించాం. అయితే, మధ్య ఓవర్లలో ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సి ఉంది. ఫైనల్‌ మ్యాచ్‌లాంటి చివరి గేమ్‌లో తప్పకుండా పుంజుకొని విజేతగా నిలిచి విండీస్‌కు తిరిగి వెళ్తాం’’ అని పావెల్ అన్నాడు. 


పరుగులు రాబట్టడం సులువేం కాదు: జైస్వాల్

‘‘పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందనిపించినా.. ఇక్కడ పరుగులు రాబట్టడం కష్టంగానే ఉంది. నా మీద నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన మేనేజ్‌మెంట్, కెప్టెన్ హార్దిక్‌కు ధన్యవాదాలు. ఇదే నా బ్యాటింగ్‌పై చాలా ప్రభావం చూపింది. ఆ నమ్మకాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో బ్యాటింగ్‌ చేశా. జట్టు అవసరాలకు తగ్గట్టుగా పరుగులు చేయడమే నా లక్ష్యం. పవర్‌ప్లేలో భారీగా పరుగులు సాధిస్తే తర్వాత ఒత్తిడి తక్కువగా ఉంటుంది. పరిస్థితులను అర్థం చేసుకుని ఆడితే పరుగులు ఆటోమేటిక్‌గా వస్తాయి. హోల్డర్, మెకాయ్‌ బౌలింగ్‌ను ఐపీఎల్‌లో ఎదుర్కోవడం కలిసొచ్చింది. గిల్‌తో అద్భుతమైన భాగస్వామ్యం నిర్మించడం ఆనందంగా ఉంది. సింగిల్స్‌ తీస్తూ స్ట్రైక్‌ను రొటేట్‌ చేస్తూ ఆడాలని నిర్ణయించుకున్నాం. ఇక్కడికి వచ్చి మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నా’’ అని జైస్వాల్ తెలిపాడు. 

మ్యాచ్‌కు సంబంధించి మరికొన్ని విశేషాలు..

  • టీ20ల్లో అత్యధిక భాగస్వామ్యం నిర్మించిన మూడో జోడీగా గిల్ - జైస్వాల్ నిలిచారు. వీరద్దరూ తొలి వికెట్‌కు 165 పరుగులు జోడించారు. అయితే, దీపక్ హుడా - సంజూ శాంసన్‌ 2022లో ఐర్లాండ్‌పై మొదటి వికెట్‌కు 176 పరుగులను జోడించారు. ఇక 2017లో శ్రీలంకపై కేఎల్ రాహుల్ - రోహిత్ శర్మ 165 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. 
  • అత్యంత పిన్నవయసులో భారత్‌ తరఫున టీ20ల్లో హాఫ్ సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడిగా యశస్వి జైస్వాల్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 84 పరుగులు చేసిన యశస్వి వయసు 21 ఏళ్ల 227 రోజులు. అందరికంటే ముందు రోహిత్ శర్మ (20 ఏళ్ల 143 రోజులు) ఉండగా.. ఆ తర్వాత తిలక్ వర్మ (20 ఏళ్ల 271 రోజులు), రిషభ్‌ పంత్ (21 ఏళ్ల 38 రోజులు) ఉంన్నారు. వీరిలో ముగ్గురు ఎడమచేతివాటం బ్యాటర్లు కావడం గమనార్హం. 
  • ఇదే సిరీస్‌లో తొలి టీ20 మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్‌ తన మొదటి స్పెల్‌ ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టగా.. ఇప్పుడు నాలుగో మ్యాచ్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ ఆ ఘనతను సాధించాడు. కీలకమైన పూరన్‌తోపాటు రోవ్‌మన్‌ పావెల్‌ వికెట్లను ఒకే ఓవర్‌లో తీశాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని