ODI WC 2023: టీమ్‌ఇండియా ప్లేయర్లు.. గతేడాదిగా ప్రదర్శన ఎలా ఉందంటే?

వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) ప్రారంభమైంది. నేడు (అక్టోబర్ 8) ఆసీస్‌తో భారత్‌ తొలి పోరు జరగనుంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా స్క్వాడ్‌లోని ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉందంటే?

Updated : 08 Oct 2023 12:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. వన్డే ప్రపంచకప్‌ ప్రారంభమైంది. ఇక భారత్ కూడా తన తొలి మ్యాచ్‌లో ఆసీస్‌తో (అక్టోబర్ 8న) నేడు తలపడనుంది. తొలుత ప్రకటించిన జట్టులో ఒకే ఒక్క మార్పు మాత్రమే జరిగింది. అక్షర్ పటేల్‌కు బదులు అశ్విన్‌ జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం ప్రకటించిన జట్టులోని ఆటగాళ్ల వన్డే ఫామ్‌ గతేడాది నుంచి ఎలా ఉందంటే?

 1. రోహిత్ శర్మ (కెప్టెన్): తాజాగా ఆసియా కప్‌లో రోహిత్ శర్మ నేపాల్‌పై అర్ధశతకం సాధించాడు. అయితే, గతేడాది కాలంగా కెప్టెన్ బ్యాటింగ్‌ ప్రదర్శన గొప్పగా ఏమీ లేదు. తన స్థాయికి తగ్గ ఆట ఆడలేకపోయాడు. మొన్న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ వరకు సంవత్సరం వ్యవధిలో మొత్తం 12 వన్డేలు ఆడాడు. రోహిత్ 472 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. గత వరల్డ్‌ కప్‌లో రోహిత్ అత్యధికంగా 648 పరుగులు చేసి టాప్ బ్యాటర్‌గా నిలిచాడు. మరోసారి ఇదే ప్రదర్శన చేస్తే భారత్‌కు తిరుగుండదు. 
 2. శుభ్‌మన్ గిల్‌: ఇటీవల కాస్త ఒత్తిడికి గురవుతున్నాడు కానీ.. గత సంవత్సరం కాలంగా గిల్ ప్రదర్శన బాగుందనే చెప్పాలి. తాజాగా నేపాల్‌తో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే అంతకుముందు పాక్‌పై నిరాశపరిచాడు. ఆ మ్యాచ్‌ వరకు గిల్ 21 వన్డేలు ఆడాడు. వెయ్యికిపైగా పరుగులు సాధించాడు. ఇందులో కివీస్‌పై చేసిన డబుల్‌ సెంచరీ కూడా ఉంది. తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌లోని రెండు మ్యాచుల్లోనూ అదరగొట్టాడు. దీంతో వరల్డ్‌ కప్‌లో అతడిని ఆపడం ప్రత్యర్థులకు కష్టమే. 
 3. విరాట్ కోహ్లీ: ఫామ్‌ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం.. విరాట్ కోహ్లీకి సరిగ్గా సరిపోతుంది. గతేడాది కాలంగా తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేకపోయినప్పటికీ.. అతడు ఉన్నాడంటే ప్రత్యర్థికి హడల్. కోహ్లీ ఇటీవల 14 మ్యాచుల్లో 46.50 సగటుతో 558 పరుగులు సాధించాడు. సాధారణంగా ఏ క్రికెటర్‌కైనా ఇవి మంచి గణాంకాలే అవుతాయి. కానీ, విరాట్ స్థాయికి ఇవి తక్కువే. ఇదే చివరి వరల్డ్‌ కప్‌గా క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్న వేళ.. అదరగొట్టి జట్టును విశ్వవిజేతగా నిలపాల్సిన బాధ్యత అతడిపై ఉంది.
 4. ఇషాన్ కిషన్‌: రిషభ్ పంత్‌ లేకపోవడం.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం యువ వికెట్ కీపర్‌ ఇషాన్ కిషన్‌కు కలిసొచ్చింది. అత్యంత వేగవంతమైన డబుల్‌ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా నిలిచిన ఇషాన్ గతేడాది నుంచి 12 వన్డేలు ఆడాడు. ఇటీవల విండీస్‌పైనా, ఆసియా కప్‌లో పాక్‌పై హాఫ్ సెంచరీలు చేశాడు. వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన వికెట్‌ కీపర్‌గా ధోనీని అధిగమించాడు. ఎడమ చేతివాటం బ్యాటర్‌ కావడం కూడా ఇషాన్‌ అదనపు ప్రయోజనం. కేవలం 12 మ్యాచుల్లోనే 57.45 సగటుతో 632 పరుగులు చేశాడు. ఇదే ఫామ్‌ను వచ్చే వరల్డ్‌ కప్‌లోనూ కొనసాగిస్తే కొందరు సీనియర్లకు జట్టులో స్థానం శాశ్వతంగా గల్లంతు కావడం ఖాయం. 
 5. కేఎల్ రాహుల్‌: వరల్డ్‌ కప్ జట్టులోకి రావడం ఆశ్చర్యకరమే. పెద్దగా ఫామ్‌లో లేకపోయినా.. గాయం నుంచి కోలుకుని వచ్చినా మేనేజ్‌మెంట్‌ అతడిపై నమ్మకం ఉంచింది. ఆసియా కప్‌లోనూ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. సూపర్ -4 బరిలోకి దిగాడు. పాక్‌పై సంచలన సెంచరీతో అదిరిపోయేలా పునరాగమనం చేశాడు. తర్వాత ఆసీస్‌పై వన్డే సిరీస్‌లో అదరగొట్టేశాడు. రెండు హాఫ్‌ సెంచరీలు సాధించాడు. 
 6. సూర్యకుమార్‌: టీ20ల్లో సూపర్ స్టార్. వన్డేల్లోకి వచ్చేసరికి మాత్రం తడబాటుకు గురై నిరాశపరిచాడు. అయితే, మిడిలార్డర్‌లో దూకుడుగా ఆడేందుకు అవసరమవుతాడని టీమ్‌ మేనేజ్‌మెంట్ భావించిందేమో గానీ.. సూర్యకు అవకాశం దక్కింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌పై వరుసగా మూడు డకౌట్లు అయిన ఇన్నింగ్స్‌లు కూడా ఉన్నాయి. ఇటీవల విండీస్‌తో సిరీస్‌లో విలువైన పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. మళ్లీ ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో తన ఫామ్‌ను ఘనంగా చాటి చెప్పాడు. 
 7. శ్రేయస్‌ అయ్యర్‌: గాయాలతో సహవాసం చేసి ఫిట్‌నెస్‌ నిరూపించుకుని మరీ శ్రేయస్‌ జట్టులోకి వచ్చాడు. అతడు ఆసియా కప్‌ కోసం ఎంపిక కావడమే గొప్ప విషయమని అంతా భావించారు. ఎందుకంటే అప్పటికీ ఫిట్‌నెస్‌పై అనుమానాలు ఉన్నాయి. అయితే, ఆసియా కప్‌లో పాక్‌పై క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్‌ స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశాడు. ఉన్నది కాసేపు అయినా ఎలాంటి ఇబ్బందీ పడలేదు. తాజాగా ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో సెంచరీతో ఫామ్‌పై ఉన్న సందిగ్ధతను పటాపంచలు చేశాడు. దీంతో మిడిలార్డర్‌లో భారత్‌కు కీలకమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 8. హార్దిక్‌ పాండ్య: పేస్‌ ఆల్‌రౌండర్‌గా పాకిస్థాన్‌పై ఉత్తమ ప్రదర్శనతో హార్దిక్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. టీ20ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన హార్దిక్‌ వన్డేల్లో మాత్రం నాణ్యమైన ప్రదర్శనే చేశాడు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు మొత్తం 12 మ్యాచ్‌లు ఆడిన పాండ్య 367 పరుగులు సాధించాడు. అంతేకాకుండా బౌలింగ్‌లోనూ పది వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాపై అత్యుతమ గణాంకాలు (3/44) నమోదు చేశాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడంతోపాటు బౌలింగ్‌లో కొన్ని ఓవర్లు వేసినా హార్దిక్ పాండ్య తన బాధ్యతలను నిర్వర్తించినట్లే. 
 9. రవీంద్ర జడేజా: స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా మైదానంలో చురుగ్గా కదలాడే రవీంద్ర జడేజాపై ఈసారి భారీగా అంచనాలు ఉన్నాయి. 2011 వన్డే వరల్డ్‌ కప్‌లో యువ్‌రాజ్‌ సింగ్‌ పోషించిన పాత్రను ఈసారి జడేజా వహించాలి. భారత్‌ వేదికగా మ్యాచ్‌లు కావడంతో స్పిన్‌కు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ. దీంతో బౌలింగ్‌లో తన కోటా ఓవర్లు పూర్తి చేసి కనీసం రెండు లేదా మూడు వికెట్లు తీస్తే చాలు జట్టుకు ఎంతో ఉపయోగం. అయితే, గతేడాదిగా అతడి ప్రదర్శన మాత్రం గొప్పగా లేదు. ఏడు మ్యాచుల్లో 127 పరుగులు చేసి, ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. అయితే, ఆసియా కప్‌లో మూడు వికెట్లు తీసి మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. 
 10. రవిచంద్రన్ అశ్విన్‌: సీనియర్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్. అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. దాదాపు ఏడాదిన్నరపాటు అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. రెండు మ్యాచుల్లో నాణ్యమైన బౌలింగ్‌ వేశాడు. నాలుగు వికెట్లు కూడా తీశాడు. దీంతో గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమైన అక్షర్‌ పటేల్ స్థానంలో అశ్విన్‌కు చోటు దక్కింది. అనుభవం, సీనియారిటీ, స్పిన్‌, బ్యాటింగ్‌.. ఇలా అన్నింట్లోనూ మెరుగైన ఆటగాడు. భారత పిచ్‌లు కాబట్టి మరింత చెలరేగుతాడని అంచనా.
 11. శార్దూల్ ఠాకూర్‌: ఈసారి భారత్‌ నలుగురు ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగుతోంది. ఇందులో పేస్‌ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యతోపాటు శార్దూల్ ఠాకూర్‌ కూడా జట్టులోకి వచ్చాడు. అయితే, బ్యాటింగ్‌లో పెద్దగా అవకాశాలు రాకపోయినప్పటికీ.. బౌలింగ్‌లో మాత్రం తన సత్తా ఏంటో చూపించాడు. గత ఏడాది కాలంలో మొత్తం 15 వన్డేలు ఆడిన శార్దూల్ 94 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, మొత్తం 22 వికెట్లు తీసి అదరగొట్టేశాడు. ఇందులో ఒకసారి నాలుగు వికెట్ల ప్రదర్శన, రెండుసార్లు ‘మూడు వికెట్ల’ ప్రదర్శన చేశాడు.
 12. కుల్‌దీప్‌ యాదవ్‌: యుజ్వేంద్ర చాహల్‌ను కాదని.. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే, దీని వెనుక అతడి గొప్ప ప్రదర్శనలు కూడా కారణం కావచ్చు. ఎందుకంటే గతేడాది కాలంలో మొత్తం 16 మ్యాచుల్లో 29 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమంగా విండీస్‌పై 4/6 ప్రదర్శన చేశాడు. రెండుసార్లు ‘నాలుగు’ వికెట్లు, మూడుసార్లు ‘మూడు’ వికెట్ల ప్రదర్శన చేశాడు. భారత్‌ వేదికగా మ్యాచ్‌లు కాబట్టి అతడి లెఫ్ట్‌ఆర్మ్ లెగ్‌స్పిన్‌ మరింత వైవిధ్యభరితంగా ఉండే అవకాశం ఉంది. 
 13. మహమ్మద్‌ షమీ: అనుభవం ఇక్కడ షమీకి ఉపయోగపడింది. ఎందుకంటే గతేడాది కాలంలో అతడు ఆడిన వన్డేలు 8. అతడు తీసిన వికెట్లు 10. అయితే, ఆసీస్‌పై 3/17 గణాంకాలు నమోదు చేశాడు. బుమ్రాతో కలిసి మెగా టోర్నీల్లో పేస్‌ బౌలింగ్‌ను అద్భుతంగా నడిపించగల సత్తా షమీకి ఉంది. గత ఐపీఎల్‌లోనూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో షమీ కూడా ఉన్నాడంటే అతడి సత్తా ఏంటో అర్థమవుతోంది.
 14. మహమ్మద్ సిరాజ్‌: సంవత్సరం కాలంగా బుమ్రాలేని లోటును తీర్చిన బౌలర్‌ సిరాజ్‌. ఇదేదో అంచనా వేసి చెప్పిన మాటలు కాదు. అతడి గణాంకాలు చూసి చెబుతున్నవే. సీనియర్లు లేనప్పుడు పేస్‌ దాడిని తన భుజస్కంధాలపై వేసుకుని మరీ నడిపించాడు. గత సెప్టెంబర్‌ నుంచి మొన్న పాకిస్థాన్‌తో మ్యాచ్‌ వరకు సిరాజ్‌ 15 వన్డేలు ఆడాడు. మొత్తం 30 వికెట్లు తీశాడంటే అతడి ఫామ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. శ్రీలంకపై 4/32తో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.
 15. జస్‌ప్రీత్‌ బుమ్రా: ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్‌గా పేరొందిన బుమ్రా గతేడాది కాలంలో కేవలం ఒకే ఒక్క వన్డే మాత్రమే ఆడాడు. అదీనూ ఈ ఆసియా కప్‌లో కావడం విశేషం. కానీ, బౌలింగ్‌ చేసే అవకాశం రాకుండా వరుణుడు అడ్డుపడ్డాడు. గాయం కారణంగా విశ్రాంతికే పరిమితమైన బుమ్రా.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. అందులో ఫిట్‌నెస్‌ నిరూపించుకుని మరీ ఆసియా కప్‌తోపాటు వన్డే ప్రపంచకప్‌లోకి అడుగు పెట్టాడు. అయితే, ఆసియా కప్‌లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. తొలిసారి తండ్రైన నేపథ్యంలో బుమ్రా భారత్‌కు తిరిగొచ్చాడు. ఆసియా కప్‌ సూపర్-4లోనూ, ఆసీస్‌తో మూడో వన్డేలో తనదైన ప్రదర్శనతో ఫిట్‌నెస్‌, ఫామ్‌ నిరూపించాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని