Asia Cup 2023: పాక్‌లో ఆసియాకప్‌ ఆడబోం..: జైషా

వచ్చే ఏడాది ఆసియాకప్‌ పాకిస్థాన్‌లో కాకుండా తటస్థవేదికపై ఆడవచ్చని జైషా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ చీఫ్‌గా కూడా షా వ్యవహరిస్తున్నారు.

Updated : 18 Oct 2022 19:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జరగనున్న ఆసియాకప్‌-2023లో భారత్‌ జట్టు పాల్గొనబోదని బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. ముంబయిలో మంగళవారం జరిగిన బీసీసీఐ 91వ వార్షిక సమావేశం అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది ఆసియాకప్‌ పాకిస్థాన్‌లో కాకుండా తటస్థవేదికపై ఆడవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ చీఫ్‌గా కూడా షా వ్యవహరిస్తున్నారు. దీంతో పాక్‌లో ఈ టోర్నీ జరగడంపై కూడా సందేహాలు ముసురుకొన్నాయి. ఈ అంశంపై ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌లో చర్చించాల్సి ఉంది. ముంబయిలో ఏజీఎం అనంతరం జైషా మాట్లాడుతూ.. ‘‘ఆసియా కప్‌ తటస్థ వేదికపై జరుగుతుంది. నేను ఏసీసీ అధ్యక్షుడిగా ఈ మాట చెబుతున్నా. మేము అక్కడికి వెళ్లము. వారు ఇక్కడికి రారు. గతంలో కూడా ఆసియాకప్‌లు తటస్థ వేదికలపై నిర్వహించాం’’ అని వ్యాఖ్యానించారు. 

ఇక భారత్‌ చివరి సారిగా 2006లో పాక్‌లో పర్యటించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో 2012-13 నుంచి భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. ప్రపంచ స్థాయి టోర్నీలు, ఆసియాకప్‌ల్లో మాత్రమే పరస్పరం తలపడుతున్నాయి. భారత్‌-పాక్‌లు చివరి సారిగా యూఏఈలో 2022 టీ20 ఆసియాకప్‌లో తలపడ్డాయి. ఈ నెల 23న టీ20 ప్రపంచ కప్‌లో కూడా మరోసారి దాయాదుల పోరు జరగనుంది. 

నేడు ముంబయిలో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో రోజర్‌ బిన్నీని బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ప్రకటించారు. బిన్నీ ఒక్కరే ఈ పదవికి నామినేషన్‌ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జైషా కార్యదర్శిగా మరోసారి కొనసాగనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని