100th Test: అశ్విన్‌ మ్యాజికా.. బెయిర్‌స్టో షోనా.. వందో టెస్టులో మెరిసేదెవరో!

IND vs ENG మధ్య జరిగే ఐదో టెస్టులో భారత బౌలర్‌ అశ్విన్‌.. ఇంగ్లాండ్ బ్యాటర్ బెయిర్‌స్టోలు తమ కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్నారు. మరి, ఈ మ్యాచ్‌లో మెరిసిదేవరో.. 

Updated : 05 Mar 2024 13:21 IST

ధర్మశాలలో భారత్‌-ఇంగ్లాండ్‌ (IND vs ENG) మధ్య జరిగే సిరీస్‌లో ఆఖరిదైన అయిదో టెస్టుకు ఓ ప్రత్యేకత ఉంది. టీమ్‌ఇండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin).. ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో (Jonny Bairstow)లకు ఇది కెరీర్‌లో వందో టెస్టు. ఇప్పటికే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న భారత్‌కు ఆఖరి మ్యాచ్‌లో అశ్విన్‌ మరోసారి మ్యాజిక్‌ చేసి ఇంకో విజయాన్ని అందిస్తాడా.. లేక సిరీస్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌కు బెయిర్‌స్టో బ్యాట్‌తో ఏమైనా అండగా నిలుస్తాడా అనేది ఆసక్తికరం. 

అశ్విన్‌ అలా..

ఈ సిరీస్‌ను టీమ్‌ఇండియా కైవసం చేసుకోవడంలో వెటరన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ది కీలకపాత్ర. 4 టెస్టుల్లో 17 వికెట్లు తీసిన అతడు.. బ్యాటింగ్‌లోనూ కొన్ని కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో అశ్విన్‌ తొలి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు పడగొట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు. బౌలర్, బ్యాటర్‌గానే కాక ఒక ఆటగాడిగా ఈ సిరీస్‌లో తన కమిట్‌మెంట్‌ కూడా చాటుకున్నాడు. మూడో టెస్టు మధ్యలో వ్యక్తిగత కారణంతో జట్టును వీడినా.. వెంటనే తిరిగి వచ్చి అందర్ని ఆశ్చర్యపరిచాడు. నిజానికి ఇంట్లో ఒకరికి బాగోలేనప్పుడు వెంటనే రావడం అనేది ఆటకు అశ్విన్‌ ఎంతటి ప్రాముఖ్యత ఇస్తాడో చెప్పడానికి ఉదాహరణ. వందో టెస్టు రూపంలో అతడి ముంగిట పెద్ద మైలురాయి ఉంది. ఈ సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన అశ్విన్‌.. ఆఖరి టెస్టులోనూ తన మార్కు చూపించి జట్టుకు 4-1తో విజయాన్ని అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

ఇటీవలే టెస్టుల్లో 500 వికెట్ల ఘనత అందుకున్న అశ్విన్‌.. 100వ టెస్టు ఆడబోతున్న 14వ భారత ఆటగాడిగా నిలవబోతున్నాడు. అంతేకాదు తొలి తమిళనాడు క్రికెటర్‌ కూడా. 2011లో అరంగేట్రం చేసిన అశ్విన్‌.. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఒంటిచేత్తో భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు. 23.91 సగటుతో వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఈ స్టార్‌ స్పిన్నర్‌ అటు బౌలింగ్‌.. ఇటు బ్యాటింగ్‌లో అదరగొడితే టీమ్‌ఇండియాకు తిరుగుండదు. 

బెయిర్‌స్టో ఇంకోలా..

భారత్‌తో సిరీస్‌లో ఇంగ్లాండ్‌ స్టార్‌ జానీ బెయిర్‌స్టో మాత్రం ఇప్పటిదాకా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ సిరీస్‌లో నాలుగు టెస్టుల్లో ఒక్కటి కూడా తన మార్కు ఇన్నింగ్స్‌ లేదు. ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో బెయిర్‌స్టో అత్యధిక స్కోరు 38 మాత్రమే. అది కూడా నాలుగో టెస్టులో సాధించాడు. మూడో టెస్టులో (0; 4 పరుగులు) అయితే ఒక్క ఇన్నింగ్స్‌లోనూ రెండంకెల స్కోరు కూడా చేయలేదు. 2012లో తొలి టెస్టు ఆడిన బెయిర్‌స్టో.. ఇంగ్లాండ్‌కు నమ్మదగ్గ ఆటగాడి పేరు దక్కించుకున్నాడు.

ఇటీవల ఫామ్‌ కోల్పోయినా..100వ టెస్టులోనైనా సత్తా చాటుతాడని ఆ జట్టు భావిస్తోంది. కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ కూడా తాజాగా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. కెరీర్‌లో అరుదైన మైలురాయి అందుకుంటున్న బెయిర్‌స్టో కచ్చితంగా ధర్మశాల టెస్టును చిరస్మరణీయం చేసుకుంటాడని భావిస్తున్నట్లు మెక్‌కలమ్‌ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ధర్మశాల టెస్టు బ్యాటర్‌గా పెద్ద పరీక్షే. ఇంగ్లాండ్‌ గౌరవంగా ఈ సిరీస్‌ను ముగించాలన్నా.. కెరీర్‌ నిలబడాలన్నా బ్యాటింగ్‌లో రాణించడం బెయిర్‌స్టోకు అత్యావశ్యకం. 

మరో విశేషం ఏమిటంటే అశ్విన్, బెయిర్‌స్టో మాత్రమే కాదు న్యూజిలాండ్‌ స్టార్లు కేన్‌ విలియమ్సన్, టిమ్‌ సౌథీ కూడా తాజాగా 100 టెస్టుల మైలురాయిని అందుకోబోతున్నారు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఈ ఘనత సాధించనున్నారు. టెస్టు చరిత్రలో ఇలా ఒకేసారి నలుగురు క్రికెటర్లు 100 టెస్టుల మైలురాయిని అందుకోవడం ఇదే తొలిసారి.

-ఈనాడు క్రీడావిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు