Rishabh Pant: పంత్‌.. ఇదే కావాలయ్యా...రిషబ్‌ ఇక రెచ్చిపో!

రిషభ్‌ పంత్‌ జట్టులో ఉంటే అదో ధైర్యం. మనది కాదనుకున్న మ్యాచ్‌ను అమాంతం మనవైపు తిప్పేస్తుంటాడు. యాక్సిడెంట్‌ తర్వాత రీఎంట్రీలో చెన్నై మీద అదరగొట్టాడు. 

Published : 02 Apr 2024 17:28 IST

దాదాపు ఏడాదిన్నరగా ఎదురుచూపులు. ఆ యువ ఆటగాడు ఎప్పుడు తిరిగి మైదానంలోకి అడుగుపెడతాడో అనే నిరీక్షణ. మూడు ఫార్మాట్లలోనూ టీమ్‌ఇండియాలో కీలక ఆటగాడిగా ఎదిగిన అతనికి రోడ్డు ప్రమాదం రూపంలో బ్రేక్‌ పడింది. ప్రాణాలైతే దక్కాయి కానీ ఆ ఘటనతో కెరీర్‌ ప్రమాదంలో పడింది. మళ్లీ ఆడటం అనుమానంగా మారింది. కానీ ఆ యోధుడు ఆగిపోలేదు. ఆగిపోతే యోధుడు ఎలా అవుతాడు? అందుకే కోలుకున్నాడు. తిరిగి పుంజుకున్నాడు. మైదానంలో అడుగుపెట్టాడు. మునుపటిలా మెరుపులు మెరిపిస్తున్నాడు. అతనే.. రిషబ్‌ పంత్‌. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై మెరుపు అర్ధశతకంతో మునుపటి పంత్‌ను గుర్తుచేశాడు. 

అద్భుతం

చెన్నైపై పంత్‌ ఆడిన ఇన్నింగ్స్‌ అద్భుతమనే చెప్పాలి. కేవలం అతను పరుగులు చేసిన విధానమే కాదు ఆ స్థాయికి తిరిగి చేరుకోవడానికి అతను పడ్డ కష్టం ఎంతో విలువైంది. అసలు పంత్‌ తిరిగి క్రికెట్‌ ఆడతాడా? అనే సందేహాలు వినిపించాయి. ఒకవేళ ఆడినా మునుపటిలా రాణిస్తాడా? అనే ప్రశ్నలు కలిగాయి. వీటన్నింటికీ ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో పంత్‌ సమాధానమిచ్చాడు. సంకల్పబలం ఉండాలే కానీ సవాళ్లను దాటడం సులువేనని చాటాడు. ఆటపై ప్రేమతో తనను తాను మళ్లీ ఆటగాడిగా నిలబెట్టుకున్నాడు. పూర్తిస్థాయిలో వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలకు తోడు జట్టును నడిపించే భారం అతనిపై ఉంది. ఇక బ్యాటింగ్‌లోనూ అతనే కీలకం. ఈ పరిస్థితుల్లో ఒక్క ఇన్నింగ్స్‌తో ఇటు బ్యాటర్‌గా మెరిసి.. అటు కెప్టెన్‌గా ఈ సీజన్‌లో జట్టు తొలి విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. 

పంత్‌పై భారం

సుదీర్ఘ విరామం తర్వాత పంత్‌ ఈ లీగ్‌తోనే పునరాగమనం చేస్తున్నాడనగానే అందరి ఫోకస్‌ అతనిపైనే ఉంది. బ్యాటింగ్‌ ఆర్డర్లో అతనిపై భారం ఎక్కువగా ఉంది. దిల్లీ తొలి రెండు మ్యాచ్‌ల్లో మధ్య ఓవర్లలో మెరుగ్గా ఆడలేక ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌ల్లో పంత్‌ వరుసగా 18, 28 పరుగులే చేశాడు. లయ అందుకోవడానికి అతనికి ఆ మ్యాచ్‌లు అవసరమయ్యాయి. ఇప్పుడు చెన్నైతో మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. మధ్య ఓవర్లలో ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. సీఎస్కేతో మ్యాచ్‌లోనూ మిచెల్‌ మార్ష్, స్టబ్స్‌ విఫలమయ్యారు. అక్షర్‌ పటేల్‌ వేగంగా ఆడలేకపోయాడు. పంత్‌ ఇన్నింగ్స్‌ లేకపోయి  ఉంటే దిల్లీ మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమయ్యేది. ఈ నేపథ్యంలో తన పాత్రను పంత్‌ చక్కగా పోషించాడు. 

పొట్టి కప్పు దారిలో...

ఐపీఎల్‌ ముగియగానే జూన్‌ 1న టీ20 ప్రపంచకప్‌ ఆరంభమవుతుంది. 2007 తర్వాత మరోసారి పొట్టి కప్పు గెలవలేకపోయిన భారత్‌ ఈ కప్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. 2013 తర్వాత ఐసీసీ టోర్నీలో జయకేతనం ఎగురవేయలేకపోయిన టీమ్‌ఇండియా ఈ పొట్టి కప్‌తో నిరీక్షణకు ముగింపు పలకాలని చూస్తోంది. ఆ దిశగా జట్టుకు పంత్‌ ఎంతో అవసరం. పంత్‌ గైర్హాజరీలో జట్టు చాలామంది వికెట్‌ కీపర్లను ప్రయత్నించి చూసింది. బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్‌ కిషన్‌ పరిగణనలో లేడనే చెప్పాలి. జితేశ్‌ శర్మ, ధ్రువ్‌ జురెల్, సంజూ శాంసన్, అవసరమైతే కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రేసులో ఉన్నారు. కానీ వీళ్లపై పూర్తిగా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి. అదే పంత్‌ ఈ సీజన్‌లో దూకుడు కొనసాగించి తిరిగి టీమ్‌ఇండియాలోకి వస్తే జట్టుకు లాభం కలుగుతుంది. ఇప్పుడీ ఇన్నింగ్స్‌తో పంత్‌కు కొత్త ఆరంభం దక్కింది. ఇలాగే సాగితే టీ20 ప్రపంచకప్‌లోనూ కచ్చితంగా ఆడతాడు. ఆ టోర్నీలోనూ సత్తా చాటి ఐసీసీ టోర్నీలో భారత్‌ నిరీక్షణకు తెరదించాలన్నది అభిమానుల ఆకాంక్ష. 

- ఈనాడు క్రీడా విభాగం  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని