Sunil Chhetri: చివరి మ్యాచ్‌ డ్రా.. అంతర్జాతీయ కెరీర్‌కు ఛెత్రి వీడ్కోలు

టీమ్‌ఇండియా స్టార్‌ ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో కువైట్‌తో చివరి మ్యాచ్‌ ఆడాడు.

Published : 06 Jun 2024 23:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫుట్‌బాల్‌ అంతర్జాతీయ వేదికపై టీమ్‌ఇండియా స్టార్‌ ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి (Sunil Chhetri) శకం ముగిసింది. దాదాపు రెండు దశాబ్దాలపాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు ‘2026 ఫిఫా వరల్డ్‌ కప్‌’ క్వాలిఫయర్‌లో భాగంగా గురువారం తన చివరి మ్యాచ్‌ కువైట్‌తో ఆడి.. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. రెండు జట్లూ గోల్‌ కొట్టకపోవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఫలితంగా క్వాలిఫయర్స్‌లో మూడో రౌండ్‌కు చేరుకునే అవకాశాలు భారత్‌కు సంక్లిష్టంగా మారాయి.

అభిమానుల జోష్‌..

తమ అభిమాన ఆటగాడికి వీడ్కోలు పలికేందుకు భారీఎత్తున చేరుకున్న ఆయన ఫ్యాన్స్‌తో కోల్‌కతాలోని సాల్ట్‌ లేక్‌ స్టేడియం నిండిపోయింది. ఛెత్రికి చెందిన 11 నంబర్‌ జెర్సీ ధరించి, ‘సునీల్‌.. సునీల్‌’ అంటూ వారంతా మైదానాన్ని హోరెత్తించారు. భార్య సోనమ్, తొమ్మిది నెలల కుమారుడు స్టాండ్స్‌లో నిలబడి అతడిని ఉత్సాహపరిచారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ‘ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ (AIFF)’ అధ్యక్షుడు కల్యాణ్‌ చౌబే, బెంగాల్‌ క్రీడాశాఖ మంత్రి అరుప్‌ భట్టాచార్య అతడికి శుభాకాంక్షలు తెలిపారు.

‘ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు’: సునీల్ ఛెత్రి

భారత్‌ తరఫున 2005లో జాతీయ జట్టులోకి అడుగు పెట్టిన ఛెత్రి ఇప్పటివరకు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 94 గోల్స్‌ కొట్టాడు. ప్రపంచ స్థాయిలో తనకంటే రొనాల్డో (128), అలీ డాయ్‌ (108), మెస్సి (106)లు మాత్రమే ముందున్నారు. అంతర్జాతీయంగా ఇప్పుడున్న యాక్టివ్‌ ప్లేయర్లలో ఎక్కువ గోల్స్‌ చేసిన మూడో ఆటగాడు ఛెత్రినే కావడం విశేషం. భారత్‌ తరఫున అతడే టాప్‌ స్కోరర్. 2005 జూన్‌ 12న పాకిస్థాన్‌ జట్టుతో ఆడిన తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ 1-1తో డ్రా కాగా.. చివరి మ్యాచ్‌ కూడా అదే రీతిలో ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని