Sunil Chhetri: అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు.. ‘ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు’: సునీల్ ఛెత్రి

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ కెరీర్‌కు స్టార్‌ ఆటగాడు సునీల్ ఛెత్రి ముగింపు పలికాడు. ఈ మేరకు కఠినమైన నిర్ణయాన్ని ప్రకటించాడు.

Updated : 16 May 2024 17:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా స్టార్‌ ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి (Sunil Chhetri) అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. దాదాపు రెండు దశాబ్దాలపాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఛెత్రి చివరిసారిగా జూన్ 6న కువైట్‌తో మ్యాచ్‌ ఆడనున్నాడు. తన నిర్ణయంపై ఓ వీడియో పోస్టు చేసిన కెప్టెన్‌ ఛెత్రి కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. రిటైర్‌మెంట్‌ గురించి తన తల్లి, భార్యకు చెప్పినప్పుడు కన్నీరు పెట్టుకున్నారని గుర్తు చేసుకున్నాడు. 

‘‘గత 19 ఏళ్ల నా కెరీర్‌లో గొప్ప జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. బాధ్యతలు, ఒత్తిడి, అమితమైన ఆనందం.. ఇలా ఎన్నింటినో అనుభవించా. వ్యక్తిగతంగా నేను ఇన్నేళ్లపాటు భారత జట్టుకు ఆడతానని అనుకోలేదు. మంచిచెడులు ఉన్నాయి. గత ఒకటిన్నర నెల నుంచి కొత్తగా అనిపిస్తోంది. నేను చివరి మ్యాచ్ ఆడేందుకు సమయం ఆసన్నమైందని అనుకుంటున్నా. జాతీయ జట్టు కోసం ప్రతి క్షణం కష్టపడ్డా. కువైట్‌తో మ్యాచ్‌ మాకు చాలా అవసరం. తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాలంటే మూడు పాయింట్లు కీలకం. జట్టు పరంగా ఎంత ముఖ్యమో.. వ్యక్తిగతంగా నాకూ గుర్తుండిపోయే మ్యాచ్‌ అవుతుందని భావిస్తున్నా. నేను ఈ నిర్ణయం గురించి ఇంట్లో చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. మా అమ్మ, నాన్న, నా భార్య రియాక్షన్‌ను మాటల్లో చెప్పలేను. మా నాన్న కాస్త అర్థం చేసుకున్నాడు. కానీ, అమ్మతోపాటు నా భార్య ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించారు. నాకది చాలా కొత్తగా అనిపించింది. నేను ఆట ఆడేటప్పుడు వారు చాలా ఒత్తిడికి గురయ్యేవారు. ఇదే విషయం చెప్పా. ఇక దేశం తరఫున ఆడటంలేదనే విషయంతో వారు కన్నీళ్లు ఎందుకు పెట్టుకున్నారో వారు చెప్పలేకపోయినా నాకర్థమైంది. నాలోని చిన్నపిల్లాడు మాత్రం ఫుట్‌బాల్‌ను ఆడటం ఆపవద్దని చెబుతున్నాడు. ఎప్పుడు జాతీయ జట్టు కోసం ఆడేందుకు అవకాశం వచ్చినా వదిలిపెట్టవద్దంటాడు. జీవితంలో నేనెంతో అదృష్టవంతుడిని. కలను నిజం చేసుకోవడంలో విజయవంతమయ్యా’’ అని ఛెత్రి వెల్లడించాడు. 

భారత్‌ తరఫున 2005లో జాతీయ జట్టులోకి అడుగు పెట్టిన ఛెత్రి ఇప్పటి వరకు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 94 గోల్స్‌ కొట్టాడు. అంతర్జాతీయంగా ఇప్పుడున్న యాక్టివ్‌ ప్లేయర్లలో ఎక్కువ గోల్స్‌ చేసిన మూడో ఆటగాడు. అతడి కంటే ముందు క్రిస్టియానో రొనాల్డో (128), లియోనిల్‌ మెస్సి (106) ఉన్నారు. భారత్‌ తరఫున ఛెత్రినే టాప్‌ స్కోరర్. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని