Chess: చదరంగంలో ‘ఎత్తు’కు... సత్తా చాటుతోన్న భారత కుర్రాళ్లు!

ప్రపంచ చెస్‌లో (World Chess) భారత్‌కంటూ ప్రత్యేక స్థానం రావడంలో విశ్వనాథన్‌ ఆనంద్‌ పాత్ర కీలకం. ఆయన తర్వాత చాలా మంది గ్రాండ్‌ మాస్టర్లుగా మారారు. కొత్తగా వస్తున్న యువకులు ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. 

Updated : 24 Aug 2023 14:18 IST

అజర్‌బైజాన్‌ రాజధాని బాకు.. అత్యంత పోటీ ఉండే, ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లు తలపడే చెస్ ప్రపంచకప్ జరుగుతోందక్కడ! ఈ నాకౌట్ టోర్నీలో ఏ రౌండ్లో ఓడినా ఇంటికే! ఇప్పుడు ఓపెన్ విభాగంలో ప్రిక్వార్టర్స్ వరకూ పోటీలు వచ్చాయి. ఇక్కడి వరకు చేరుకున్న 10 మంది ఆటగాళ్లలో నలుగురు (అర్జున్, ప్రజ్ఞానంద, గుకేశ్‌, విదిత్) భారత గ్రాండ్‌ మాస్టర్లున్నారు. మహిళల క్వార్టర్లో అడుగుపెట్టిన వాళ్లలో మన అమ్మాయి (ద్రోణవల్లి హారిక) ఒకరున్నారు. మరో దేశం నుంచి ఇంతమంది గ్రాండ్ మాస్టర్లు టోర్నీలో ఈ దశ వరకూ చేరుకోలేదు. దీన్ని బట్టి ఈ ప్రపంచ కప్‌లో భారత ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కొన్నేళ్లుగా భారత్ బలీయమైన చదరంగ దేశంగా ఎదుగుతుందనడానికి ఇదే నిదర్శనం. ప్రపంచ స్థాయి పోటీలైనా.. అంతర్జాతీయ టోర్నీలైనా అందులో భారత ప్లేయర్ల ముద్ర ఉండాల్సిందే. అగ్రశ్రేణి ఆటగాళ్లను ఓడించడం.. అద్భుత విజయాలతో సాగడం.. అలవాటుగా మార్చుకున్న మన కుర్రాళ్లు చెస్ ప్రపంచాన్ని ఏలే దిశగా సాగుతున్నారు.

ఒక్కడితో మొదలై

భారత్‌లో చెస్ అంటే.. ఠక్కున వినిపించే పేరు విశ్వనాథన్ ఆనంద్. చదరంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రాండ్‌మాస్టర్‌ హోదా పొందిన మొట్టమొదటి భారతీయుడు ఆయన. 1988లోనే ఈ ఘనత సాధించిన ఆనంద్.. దేశంలో చదరంగానికి ఊపిరి పోశారనే చెప్పాలి. అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఏకైక భారత ఆటగాడు.. ప్రపంచ చదరంగంలో మన సత్తాను చాటిన ఘనుడు ఆయన. కానీ ఇప్పుడు ఆనంద్ ఒక్కరే కాదు ఇంకా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. పెంటేల హరికృష్ణ, విదిత్ గుజరాతి, సూర్యశేఖర గంగూలీ, శశికరణ్, ఎస్పీ సేతురామన్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, లలిత్ బాబు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది అంతర్జాతీయ వేదికపై ఉత్తమ ప్రదర్శనతో మెప్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సీనియర్లు హరికృష్ణ, హంపి, హారిక, లలిత్ బాబు ప్రపంచ చెస్ యవనికపై మెరుస్తూనే ఉన్నారు. హంపి ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచారు. ఇప్పుడిక యువతరం ప్లేయర్లు దూకుడైన ఆటతీరుతో చెస్‌లో భారత ప్రస్థానాన్ని మరో దశకు తీసుకెళ్లేలా కనిపిస్తున్నారు.

Prithvi shaw: పృథ్వీ!.. ప్రతిభ ఉంటే సరిపోతుందా..?

యువ జోరు..

భారత్‌లో ఆనంద్‌తో మొదలైన చెస్ విప్లవం మధ్యలో నెమ్మదించింది. కానీ గత అయిదేళ్లుగా రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. అందుకు కారణంగా యువ ప్లేయర్లే. చిన్నతనంలోనే 64 గళ్ల చదరంగం బోర్డుపై ప్రేమ పెంచుకుని.. ఎత్తుల్లో పట్టు సాధించి అలవోకగా గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించడంతో పాటు ప్రపంచ వేదికలపై సంచలన విజయాలు సాధిస్తున్నారు. 1988 నుంచి 2017 ముగిసే నాటికి మన దేశంలో గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య 50. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 83. మధ్యలో కరోనా ప్రభావంతో టోర్నీలు ఎక్కువగా జరగనప్పటికీ ఈ ఆరేళ్లలో 33 మంది కొత్త గ్రాండ్ మాస్టర్లు రావడం విశేషం. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి అయిదుగురు (అర్జున్ ఇరిగేశి, హర్ష భరత్‌కోటి, రాజా రిత్విక్, రాహుల్ శ్రీవాత్సవ్, ప్రణీత్ వుప్పల) గ్రాండ్ మాస్టర్లుగా అవతరించారు. మరోవైపు ఇతర రాష్ట్రాలకు చెందిన యువ ఆటగాళ్లు కూడా ఒత్తిడిని సమర్ధంగా తట్టుకుంటూ ప్రపంచ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పుడీ ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్స్ చేరిన నలుగురిలో విదిత్‌ను మినహాయిస్తే అర్జున్, ప్రజ్ఞానంద, గుకేశ్‌ టీనేజర్లే. పిన్న వయస్సులోనే వీళ్లు మేటి ఆటగాళ్లను ఓడిస్తూ దూసుకెళ్తున్నారు. చెస్‌ను శాసిస్తున్న మాగ్నస్ కార్ల్‌సన్‌ను వీళ్లు ఓడించడం విశేషం. త్వరలోనే ఈ యువ ప్లేయర్ల నుంచి ప్రపంచ ఛాంపియన్లను చూసే అవకాశముంది. ర్యాంకింగ్స్‌లో ఆనంద్‌ను దాటేసి భారత నంబర్‌వన్ ఆటగాడిగా నిలిచిన గుకేశ్.. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోనూ చోటు దక్కించుకున్నారు.

ఆ ఆతిథ్యంతో..

భారత్ మొట్టమొదటి సారి అతిథ్యమిచ్చిన ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌తో దేశంలో చదరంగానికి మరింత ఆదరణ పెరిగింది. భారత చెస్ రాజధానిగా మారిన చెన్నై.. 2023లో ఈ ఒలింపియాడ్‌ను పండగలా నిర్వహించింది. ఈ పోటీల్లో ఓపెన్, మహిళల విభాగాల్లో భారత్ కాంస్యాలు గెలిచింది. 2020లో వర్చువల్ గా జరిగిన ఒలింపియాడ్‌లో రష్యాతో కలిసి పసిడి పంచుకున్న భారత్ చరిత్ర సృష్టించింది. 2021లోనూ మనకు కాంస్యం దక్కింది. చెస్‌లో భారత ప్లేయర్ల స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఎంతో మంది చిన్నారులు ఇటు వైపు మళ్లుతున్నారు. ఇదే జోరుతో సాగితే ప్రపంచ చెస్‌లో భారత్ అగ్రగామిగా ఎదిగే రోజు మరెంతో దూరంలో లేదు.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని