Prithvi shaw: పృథ్వీ!.. ప్రతిభ ఉంటే సరిపోతుందా..?

Special story on prithvi shaw: ఇటీవల ఇంగ్లాండ్‌ వన్డే కప్‌లో నార్తాంప్టన్‌షైర్‌కు ఆడుతూ సోమర్‌సెట్‌పై పృథ్వీ షా డబుల్‌ సెంచరీ చేశాడు. టీమ్‌ ఇండియాలో పునరాగమనానికి ఇది మాత్రమే సరిపోతుందా?తన కెరీర్‌ ఇలా అవ్వడానికి స్వీయ తప్పిదాలు లేవా?

Published : 12 Aug 2023 13:19 IST

కేవలం 18 ఏళ్ల వయసులోనే భారత జట్టు తరఫున టెస్టు కెరీర్‌ ఆరంభించిన కుర్రాడు పృథ్వీ షా (Prithvi shaw). తొలి మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టి అబ్బురపరిచాడు కూడా. అంత గొప్పగా కెరీర్‌ను ఆరంభించిన కుర్రాడు.. ఇప్పుడు టీమ్‌ఇండియా ఛాయల్లోనే లేడు. ప్రతిభకు లోటు లేని ఈ కుర్రాడు.. క్రమశిక్షణ కొరవడి, ఫిట్‌నెస్‌ లేక చేజేతులా కెరీర్‌ను దెబ్బ తీసుకున్నాడు. తాజాగా ఇంగ్లాండ్‌ వన్డే కప్‌లో మెరుపు డబుల్‌ సెంచరీ బాదిన పృథ్వీని చూసి.. ఎక్కడ ఉండాల్సిన ఆటగాడు ఎక్కడ ఉన్నాడు అంటూ జాలిపడుతున్నారు.

153 బంతులు.. 244 పరుగులు.. 28 ఫోర్లు.. 11 సిక్సర్లు.. ఇటీవల ఇంగ్లాండ్‌ వన్డే కప్‌లో నార్తాంప్టన్‌షైర్‌కు ఆడుతూ సోమర్‌సెట్‌పై పృథ్వీ షా వీర విధ్వంసం తాలూకు గణాంకాలివి. ఇంగ్లాండ్‌ పిచ్‌లపై ఈ స్థాయిలో చెలరేగాడంటే పృథ్వీ ప్రతిభ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ ఇన్నింగ్స్‌ తర్వాత పృథ్వీ అసలు టీమ్‌ఇండియాలో ఎందుకు లేడనే చర్చ మొదలైంది. కెరీర్‌లో జాగ్రత్తగా అడుగులు వేసి ఉంటే.. అక్టోబరులో భారత్‌ వేదికగా మొదలయ్యే వన్డే ప్రపంచకప్‌లో ఆడాల్సిన వాడే పృథ్వీ. కానీ టెస్టు అరంగేట్రంలోనే శతకంతో గొప్పగా అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన అతను.. కొన్ని కారణాలతో భారత జట్టుకు దూరమైపోయాడు. టెస్టు కెరీర్‌ను గొప్పగా ఆరంభించాక ఓ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడి అతను జట్టుకు దూరమయ్యాడు. ఆ గాయం నుంచి కోలుకున్నప్పటికీ.. తర్వాత నడుం దగ్గర అయిన మరో గాయం మరి కొంత కాలం ఆటకు దూరమయ్యేలా చేసింది. ఈలోపు ఫామ్‌ కూడా దెబ్బ తింది. దేశవాళీల్లోనే కాక ఐపీఎల్‌లోనూ నిలకడగా రాణించలేకపోయాడు. దీంతో భారత సెలక్టర్లు అతణ్ని లైట్‌ తీసుకున్నారు. ఇప్పటిదాకా పృథ్వీ 2 టెస్టులు, 6 వన్డేలు, ఒక టీ20లో మాత్రమే భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

మళ్లీ అదే సందిగ్ధత... ప్రపంచకప్ ముంగిట టీమ్‌ఇండియా ఫిట్‌నెస్ కష్టాలు

వెంటాడిన వివాదాలు

పృథ్వీ షా కెరీర్‌ మొదలుపెట్టి ఎన్నో ఏళ్లు అయిపోలేదు. ఈలోపే అతను చాలాసార్లు ప్రతికూల వార్తలతోనే మీడియాలో నానాడు. అతడి కెరీర్లో అతి పెద్ద మరక అంటే.. డోప్‌ పరీక్షలో దొరికిపోవడం. 2019లో 19 ఏళ్ల వయసులోనే అతడు డోపీగా తేలాడు. ఆ ఏడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోప్‌ పరీక్షల్లో.. అతడు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. దీంతో బీసీసీఐ అతణ్ని 8 నెలల పాటు నిషేధించింది. అనారోగ్య సమయంలో వాడిన దగ్గుమందే తాను డోపీగా తేలడానికి కారణమని పృథ్వీ వెల్లడించాడు. అయితే ఒక క్రికెటర్‌గా ప్రతి చిన్న విషయంలో జాగ్రత్త పడటం పృథ్వీ బాధ్యత. అతడు నిర్లక్ష్యంగా ఉన్నాడనడానికి ఇది రుజువు. ఇక గత ఏడాది రోడ్డు మీద ఒక ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్ఫ్లూయెన్సర్‌తో గొడవ పడటం ద్వారా కూడా పృథ్వీ వార్తల్లో నిలిచాడు. ఆ గొడవలో అతడి తప్పేమీ లేదని తర్వాత పోలీసులు తేల్చినప్పటికీ.. ఈ వివాదం కారణంగా కొన్ని రోజుల పాటు అతడి పేరు మీడియాలో, సోషల్‌ మీడియాలో నానింది. పృథ్వీకి ఆటేతర విషయాల మీదే ఆసక్తి అంటూ అతడిపై నెటిజన్లు చురకలు వేశారు. 

ఫిట్‌నెస్‌పై శ్రద్ధ లేదా?

భారత్‌కు ఆడిన కొన్ని మ్యాచ్‌ల్లో, అలాగే ఐపీఎల్‌లో పృథ్వీ ఆట చూసిన వారికి అతడి సామర్థ్యం ఎలాంటిదో తెలుసు. మంచి స్ట్రోక్‌ ప్లే, టెక్నిక్‌ ఉన్న బ్యాటర్‌ అతను. ఎలాంటి బౌలింగ్‌ను అయినా తుత్తునియలు చేయగలడు. అలవోకగా భారీ షాట్లు ఆడగలడు. కానీ ప్రతిభ ఒక్కటే ఉంటే అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ కాలం కొనసాగలేరు. ఆట మీద పూర్తి శ్రద్ధ ఉండాలి. క్రమశిక్షణతో మెలగాలి. ఫిట్‌నెస్‌ కాపాడుకోవాలి. ఈ లక్షణాలే పృథ్వీలో లేవన్నది విశ్లేషకుల మాట.

పృథ్వీ వయసు ప్రస్తుతం కేవలం 23 ఏళ్లు. కానీ అతడి తాజా ఫొటో చూస్తే.. కెరీర్‌ చరమాంకంలో ఉన్నవాడిలా కనిపించడం గమనార్హం. నెత్తిన జుత్తు మొత్తం ఊడిపోవడం వల్ల పెద్ద వయస్కుడిలా కనిపిస్తున్నాడు. ఇందుకు అతణ్ని నిందించడానికేమీ లేదు. కానీ తోటి యువ ఆటగాళ్లు కండలు తిరిగిన దేహంతో ఎంతో ఫిట్‌గా కనిపిస్తుంటే.. పృథ్వీ మాత్రం బాగా బరువు పెరిగి శరీరం మీద ఏమాత్రం అదుపు లేని వాడిలా దర్శనమిస్తున్నాడు. అతణ్ని చూస్తే క్రికెట్‌ ఆడే ఫిట్‌నెస్‌ ఉందని అనిపించదు. పృథ్వీ షాతో పాటు కెరీర్‌ మొదలుపెట్టిన శుభ్‌మన్‌ ప్రస్తుతం టీమ్‌ఇండియా కొత్త సూపర్‌ స్టార్‌గా అవతరించాడన్నా.. రిషబ్‌ పంత్, ఇషాన్‌ కిషన్‌ లాంటి సహచరులు అతణ్ని దాటి చాలా ముందుకు వెళ్లిపోయారన్నా.. వారి క్రమశిక్షణే కారణం. యశస్వి జైస్వాల్, తిలక్‌ వర్మ లాంటి కుర్రాళ్లను చూసి కూడా పృథ్వీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రతిభకు లోటు లేని పృథ్వీ.. ఇప్పటికైనా ఒంటి మీద దృష్టి పెట్టి ఫిట్‌గా తయారవడం, క్రమశిక్షణ అలవర్చుకుని పూర్తిగా ఆట మీద దృష్టిసారించడం అవసరం. అలా చేస్తే త్వరలోనే టీమ్‌ఇండియాలో ఉంటాడనడంలో సందేహం లేదు.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని