T20 World Cup 2024: వరల్డ్‌ కప్‌ జట్టు ప్రకటనకు ముందు.. తర్వాత మన బ్యాటర్ల ఆట తీరిదీ!

టీమ్ఇండియా జూన్ 5న టీ20 ప్రపంచ కప్‌లో తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. మరి ఆటగాళ్ల ఫామ్‌ను ఓ సారి పరిశీలిద్దాం.

Updated : 03 Jun 2024 09:50 IST

ప్రపంచస్థాయి బౌలర్లను ఎదుర్కొనే అవకాశం. ఇక్కడ సత్తా చూపిస్తే వరల్డ్‌ కప్‌ జట్టులో స్థానం ఖాయం... ఇదీ ఐపీఎల్‌కు ముందు భారత క్రికెటర్ల ఆలోచనలు. 

ఆ రోజు రానే వచ్చింది. వరల్డ్‌ కప్‌ కోసం జట్టును బీసీసీఐ ప్రకటించింది. అప్పటి వరకు దూకుడుగా ఆడిన కొందరు.. తమ పేరు ఉందని తెలిశాక రిలాక్స్‌ అయిపోయినట్లు ఆడారు. వారి గణాంకాలను గమనిస్తే ఇట్టే తెలిసిపోతోంది. అందరి పరిస్థితి ఇలా ఉందని కాదు. ఎక్కువ మంది ఇలానే ఆడారు. భారత స్క్వాడ్‌లోని ప్రధాన బ్యాటర్ల  ఫామ్‌పై ఓ లుక్కేద్దాం..

  1. రోహిత్ శర్మ: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో నిలకడైన ఆటతీరును ప్రదర్శించాడు. వరల్డ్‌ కప్‌ స్క్వాడ్‌ను ప్రకటించక ముందు ఒక సెంచరీతోపాటు 30+ స్కోర్లను 4 సార్లు సాధించాడు. ఇక జట్టును వెల్లడించిన తర్వాత ఆడిన ఐదింట్లో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఓపెనర్‌గా వస్తూ దూకుడుగా ఆడే క్రమంలో వికెట్‌ను సమర్పించుకున్నాడు.
  2. విరాట్ కోహ్లీ: ఫామ్‌, ఫార్మాట్‌, పిచ్‌లతో సంబంధం లేదు. అతడి ఆట కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుందనడంలో సందేహం లేదు. ఈసారి ఐపీఎల్‌ ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ కోహ్లీనే. 700+ పరుగులు చేసి అదరగొట్టాడు. జట్టు ప్రకటన చేయకముందు అతడి ఆటను.. వెల్లడించిన తర్వాత కోహ్లీ గేమ్‌ను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అయితే, ఆర్సీబీకి విజయాలు అత్యంత ముఖ్యం కావడం కూడా విరాట్ బ్యాటింగ్‌ దూకుడుపై ప్రభావం చూపింది. చివరి ఆరు మ్యాచుల్లో (70, 42, 92, 27, 47, 33) కీలక ఇన్నింగ్స్‌లతో వీరవిహారం చేశాడు. 
  3. యశస్వి జైస్వాల్: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌నకు చేరుకుంది. గతేడాది మాదిరిగా యశస్వి జైస్వాల్‌ దూకుడైన ఆటతీరును ప్రదర్శించలేదు. ఓ మూడు మ్యాచుల్లోనే నాణ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. వరల్డ్ కప్‌ కోసం జట్టు ప్రకటించిన తర్వాత 67, 4, 24, 4, 42 పరుగులు చేశాడు. రెండో క్వాలిఫయర్‌లో ఒకవైపు వికెట్లు పడుతున్నా వేగంగా (21 బంతుల్లోనే 42) పరుగులు సాధించాడు. కానీ, జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు.
  4. సూర్యకుమార్ యాదవ్‌: కొడితే హాఫ్ సెంచరీ.. లేకపోతే ఫట్‌.. ఇదీ ఐపీఎల్‌లో సూర్యకుమార్‌ ఆటతీరు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థులను హడలెత్తించాడనే చెప్పాలి. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌పై శతకం సాధించి ఒంటి చేత్తో ముంబయిని గెలిపించాడు. వరల్డ్‌ కప్‌ స్క్వాడ్‌లోకి వచ్చాక ఒక సెంచరీ, ఒక హాఫ్‌ సెంచరీ (102, 56) కొట్టాడు. అంతకుముందు ఆడిన ఆరు మ్యాచుల్లోనూ రెండు అర్ధశతకాలు (78, 52) ఉన్నాయి.
  5. రిషభ్ పంత్‌: దాదాపు 15 నెలల గ్యాప్‌ తర్వాత మైదానంలోకి అడుగు పెట్టాడు. తొలి అర్ధభాగంలో మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. ఎప్పుడైతే తమ జట్టు నాకౌట్‌ ఆశలను కోల్పోయిందో కాస్త వెనుకబడ్డాడు. అలాగని పరుగులు చేయలేదని కాదు. ఆ జట్టులో ఇతరులతో పోలిస్తే ఫర్వాలేదనిపించాడు. వేగంగా మాత్రం ఆడలేకపోయాడు. ప్రపంచ కప్‌ కోసం జట్టును ప్రకటించిన తర్వాత పంత్ నాలుగు మ్యాచులు ఆడాడు. అందులో అత్యధిక స్కోరు 33. అంతకుముందు ఎనిమిది మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రెండుసార్లు 40+ స్కోరు చేశాడు. 
  6. సంజూ శాంసన్: ఐపీఎల్‌లో రాజస్థాన్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనే 86 పరుగులు చేసి తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. ఆ తర్వాత వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్రపంచ కప్‌ జట్టు రేసులో ముందు నిలిచాడు. అనుకున్నట్లుగానే స్థానం దక్కించుకున్నాడు. రాజస్థాన్‌ను కెప్టెన్‌గా ప్లేఆఫ్స్‌ చేర్చాడు. ఆ తర్వాత ఆడిన ఐదు మ్యాచుల్లో ఒక్కసారి మాత్రమే (86) అర్ధశతకం బాదాడు. మరొకసారి డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు.
  7. హార్దిక్‌ పాండ్య: ప్రదర్శన గొప్పగా లేకపోయినా ప్రపంచ కప్‌ జట్టులో చోటు దక్కించుకున్న క్రికెటర్‌. ఐపీఎల్‌ సీజన్‌లో పాండ్య 14 మ్యాచుల్లో 11 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్‌ కప్‌ కోసం ఎంపిక చేసినప్పటి నుంచి అతడు రెండు వికెట్లు మాత్రమే తీశాడు. వైస్‌ కెప్టెన్సీ అప్పగించిన క్రమంలో హార్దిక్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. దానికి వార్మప్ మ్యాచ్‌లో సరైన సమాధానం ఇచ్చాడు. బ్యాటింగ్‌లో దూకుడుగా ఆడి 23 బంతుల్లోనే 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బౌలింగ్‌లోనూ ఒక వికెట్ తీశాడు. 
  8. శివమ్ దూబె: ఐపీఎల్‌ ఆరంభంలో శివమ్‌ దూబె ఆటను చూస్తే హార్డ్ హిట్టర్ దొరికాడని అంతా సంతోషించారు. వరల్డ్‌ కప్‌ కోసం జట్టును ప్రకటించక ముందు దూబె 9 మ్యాచుల్లో 360 పరుగులు చేశాడు. ఎప్పుడైతే స్క్వాడ్‌లోకి వచ్చాడో.. అప్పటి నుంచి అతడి ఆటతీరు దారుణంగా ఉంది. చివరి ఐదు మ్యాచుల్లో కేవలం 36 పరుగులు మాత్రమే చేశాడంటే నమ్ముతారా? ఇందులో రెండు డకౌట్‌లు ఉన్నాయి. తొలిసారి బౌలింగ్‌ చేసిన అతడు ఒక్క వికెట్ పడగొట్టాడు. తాజాగా వార్మప్ మ్యాచ్‌లో 16 బంతుల్లో కేవలం 14 పరుగులే చేశాడు. భారీ షాట్లు కొట్టడంలో తడబాటుకు గురైనట్లు కనిపిస్తోంది.
  9. శుభ్‌మన్‌ గిల్ (ట్రావెల్ రిజర్వ్‌): టీమ్‌ఇండియా ప్రకటించిన 15 మంది స్క్వాడ్‌లో శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం దక్కలేదు. ట్రావెల్ రిజర్వ్‌గా వచ్చాడు. జట్టును ప్రకటించిన తర్వాత ఐపీఎల్‌లో మూడు మ్యాచ్‌లు ఆడాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. అంతకుముందు 89, 72 పరుగులు చేశాడు. 30+ స్కోర్లూ మూడు సార్లు చేశాడు. రెండు మ్యాచులు రద్దు కాగా.. తానాడిన చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌లో శతకం (104) బాదడం గమనార్హం. 
  10. రింకు సింగ్‌ (ట్రావెల్ రిజర్వ్‌): గతేడాది ఐపీఎల్‌లో ఒక వెలుగు వెలిగిన క్రికెటర్లలో రింకు ఒకడు. మరీ ముఖ్యంగా యశ్‌ దయాల్ బౌలింగ్‌లో ఐదు సిక్స్‌లతో పేరు మారుమోగిపోయింది. భారత జట్టులోకి అడుగు పెట్టాడు. వరల్డ్‌ కప్ ప్రధాన టీమ్‌లోకి వస్తారని అంతా భావించారు. ట్రావెల్ రిజర్వ్‌గా మాత్రమే అవకాశం దక్కింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో 15 మ్యాచులు ఆడిన అతడు 113 బంతుల్లో 168 పరుగులు చేశాడు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు రావడం, కేకేఆర్‌ ప్రధాన బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉండటంతో ఎక్కువ బంతులు ఆడే అవకాశం రాలేదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు