Rohan Bopanna: అలుపెరగని యోధుడు బోపన్న... 43 ఏళ్లు.. అయినా తగ్గేదేలే!

43 ఏళ్లు.. ఏ ఆటలోనైనా ఏ క్రీడాకారుడైనా రిటైర్మైంట్‌ తీసుకుని హాయిగా సేదతీరే సమయం. ఇక శారీరక సామర్థ్యానికి పరీక్ష పెట్టే టెన్నిస్‌లో అయితే 35 ఏళ్లు దాటిన ఆటగాళ్లు కనబడడమే గగనం. చాలా మంది చిన్న వయస్సులోనే ఆటకు వీడ్కోలు పలుకుతుంటారు. కానీ గాయాలు బాధించినా.. మోకాలిలో గుజ్జు అరిగిపోయి ఇబ్బంది పడ్డా.. వరుసగా ఓటములు ఎదురైనా.. అతను ఆగిపోలేదు. అలా ఆగిపోయి ఉంటే అతను రోహన్‌ బోపన్న  (Rohan Bopanna) ఎందుకవుతాడు.

Updated : 09 Sep 2023 18:28 IST

43 ఏళ్లు.. ఏ ఆటలోనైనా ఏ క్రీడాకారుడైనా రిటైర్మైంట్‌ తీసుకుని హాయిగా సేదతీరే సమయం. ఇక శారీరక సామర్థ్యానికి పరీక్ష పెట్టే టెన్నిస్‌లో అయితే 35 ఏళ్లు దాటిన ఆటగాళ్లు కనబడడమే గగనం. చాలా మంది చిన్న వయస్సులోనే ఆటకు వీడ్కోలు పలుకుతుంటారు. కానీ గాయాలు బాధించినా.. మోకాలిలో గుజ్జు అరిగిపోయి ఇబ్బంది పడ్డా.. వరుసగా ఓటములు ఎదురైనా.. అతను ఆగిపోలేదు. అలా ఆగిపోయి ఉంటే అతను రోహన్‌ బోపన్న  (Rohan Bopanna) ఎందుకవుతాడు. దేనికీ తలవంచని నైజం, వెనక్కి తగ్గని ఆత్మస్థైర్యం, పట్టు వదలని పోరాటమే 43 ఏళ్ల బోపన్న లక్షణాలు. తాజాగా యుఎస్‌ ఓపెన్‌ (US Open) పురుషుల డబుల్స్‌లో మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి రన్నరప్‌గా నిలిచిన బోపన్న.. అలుపెరగని ఓ పోరాట యోధుడు. 

సవాళ్లను దాటి..

అడుగడుగునా అడ్డంకులు ఎదురైనా.. సవాళ్లు పలకరించినా.. టెన్నిస్‌పై ప్రేమతో, విజయాల ఆకలితో ముందుకు సాగడమే బోపన్నకు తెలుసు. లేకపోతే 43 ఏళ్ల వయసులో.. అత్యంత పోటీ ఉండే గ్రాండ్‌స్లామ్‌ల్లో ఒకటైన యుఎస్‌ ఓపెన్‌లో.. యువ ఆటగాళ్లను దాటి రన్నరప్‌గా నిలవడమంటే సాధారణ విషయం కాదు. ఇలాంటి అసాధ్యాలను అందుకోవడం బోపన్నకు అలవాటే. 20 ఏళ్లలో సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మ్యాచ్‌లు.. మధ్యలో గాయాలు.. విజయాలు.. ఓటములు.. ఇలా అన్ని చూసిన బోపన్న ఓ పరిపూర్ణ ఆటగాడు. ఓ దశలో వరుసగా ఓటములే ఎదురవుతుంటే.. సముద్ర తీరంలో కుర్చుని.. ఇంకా టెన్నిస్‌ ఆడటం ఎందుకు? గెలవడం లేదు కదా? ఇంటి దగ్గర కుటుంబం ఉంది చూసుకోవాలి. ఆటకు వీడ్కోలు పలికేద్దామా? అనే ఆలోచనలో బోపన్న మునిగిపోయాడు. కానీ అది కొద్దిసేపు. మళ్లీ ఆట లేకపోతే ఉండగలనా? అని భావించి రాకెట్‌ పట్టాడు. గాయాలను దాటాడు. సాధనలో శ్రమించాడు. మ్యాచ్‌లు గెలవడం మొదలెట్టాడు. ఇప్పుడు ఓపెన్‌ శకంలో ఓ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడిన అతి పెద్ద వయస్సు ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అందుకే బోపన్న ఓ పోరాట యోధుడు.

గుజ్జు అరిగిపోయినా..

రెండు మోకాళ్లలోని గుజ్జు (కార్టిలేజ్‌) పూర్తిగా అరిగిపోయింది. నడుస్తుంటేనే తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఆడటం గురించి ఎవరైనా ఆలోచిస్తారా? కానీ 2019లో రోజుకు రెండు లేదా మూడు పెయిన్‌ కిల్లర్స్‌ మాత్రలు వేసుకుంటూ బోపన్న ఆట కొనసాగించాడు. ఆట పట్ల అతని అంకితభావానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? ఈ సమస్య నుంచి బయటపడేందుకు బోపన్నకు యోగా ఉపయోగపడింది. కరోనా సమయంలో 2020లో బోపన్న.. అయ్యంగార్‌ యోగా చేయడం మొదలెట్టాడు. వారంలో నాలుగు సార్లు 90 నిమిషాల చొప్పున యోగా చేసేవాడు. దీంతో క్రమంగా మోకాలి నొప్పి మాయమైంది. ఎలాంటి మాత్రలు వాడాల్సిన అవసరం లేకపోయింది. అక్కడి నుంచి అతని కెరీర్‌ మళ్లీ కొత్తగా మొదలైంది. మరింత ఉత్సాహంతో బోపన్న కోర్టులో సాగిపోయాడు. ఈ ఏడాది జనవరి నుంచి బెల్జియం ఫిజియో రెబెక్కా వాన్‌తో కలిసి పని చేయడం మొదలెట్టిన బోపన్న ఫిట్‌నెస్‌ మెరుగుపర్చుకున్నాడు. ఇప్పుడు యుఎస్‌ ఓపెన్‌లో ఎబ్డెన్‌తో కలిసి అదరగొట్టాడు. బోపన్న విజయాల కంటే కూడా అతని ఆటతీరు మరింత ఆకట్టుకుంది. కెరీర్‌ ఆరంభంలో ఎలాగైతే దూకుడు ప్రదర్శించాడో ఇప్పుడు కూడా అలాగే ఆడాడు. అంతే కాకుండా తమకు పాయింట్‌ వచ్చిందని తెలిసినా.. బంతి చేతికి తాకిందని వదిలేసుకున్న అతని క్రీడాస్ఫూర్తి అలరించింది. కెరీర్‌లో ఇప్పటివరకూ బోపన్న పురుషుల డబుల్స్‌ టైటిల్‌ గెలవలేదు. రెండు సార్లు (2010, 2023) యుఎస్‌ ఓపెన్‌లోనే రన్నరప్‌గా నిలిచాడు. 2017 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో గాబ్రియల్‌ డబ్రోస్కీ (కెనడా)తో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ దక్కించుకున్నాడు. టూర్‌ స్థాయి డబుల్స్‌ టైటిళ్లు 24 నెగ్గాడు. ఏటీపీ మాస్టర్స్‌ 1000 టైటిళ్లు అయిదు గెలిచాడు. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని