Parul Chaudhary: పతకాల కోసం కొండలెక్కి సాధన... పారుల్‌ పవర్‌ ఇదీ!

3000 మీటర్ల స్టీఫుల్‌ ఛేజ్‌లో తొలిసారి ఫైనల్‌కు వెళ్లిన భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించిన పారుల్‌... 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది. ఆమె గురించి మరిన్ని విశేషాలు మీకోసం... 

Updated : 03 Sep 2023 13:59 IST

పారుల్‌ చౌదరి.. చూడటానికి  బక్క పలచగా బలహీనంగా గాలికి పడిపోతుందా అన్నట్లు ఉంటుంది. కానీ ట్రాక్‌లోకి దిగిందంటే దుమ్ము రేపుతోంది. తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్పే ఇందుకు ఉదాహరణ. 3000 మీటర్ల స్టీఫుల్‌ ఛేజ్‌లో తొలిసారి ఫైనల్‌కు వెళ్లిన భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించిన పారుల్‌ (Parul Chaudhary).. ఆపై జాతీయ రికార్డు (9 నిమిషాల 15.31 సెకన్లు) తిరగరాసింది. ఓవరాల్‌గా 11వ స్థానంలో నిలిచి 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది. 3000, 5000 మీటర్లలో సత్తా చాటుతున్న పారుల్‌  కథ స్ఫూర్తిదాయకం.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాలోని బహ్రాలా గ్రామానికి చెందిన పారుల్‌.. రైతు కుటుంబం నుంచి వచ్చింది. చిన్నప్పుడు పొలాల్లో పరుగులు తీసేది. అప్పుడు మొదలు పెట్టిన ఆ పరుగు ఇప్పటికీ కొనసాగిస్తోంది. ప్రొఫెషనల్‌ రన్నర్‌గా మారి పతకాల పంట పండిస్తోంది. తండ్రి ప్రోత్సాహంతో ఇంటర్‌లో అథ్లెటిక్స్‌ను సీరియస్‌గా తీసుకున్న ఆమెకు విజయాలు మాత్రం ఆలస్యంగా వచ్చాయి. చాలా మీట్స్‌లో సత్తా చాటినా కొద్దిలో పతకాలు పోగొట్టుకున్న పారుల్‌.. తొలిసారి తన సామర్థ్యానికి తగ్గ ఫలితాలను అందుకుంటోంది. 2016లో జాతీయ అథ్లెటిక్స్‌ శిబిరానికి ఎంపిక కావడం ఆమె కెరీర్‌లో మలుపు. అక్కడ ఆటకు మెరుగులు దిద్దుకున్న పారుల్‌.. అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటింది. 2019లో ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యంతో మొదలుపెట్టిన పారుల్‌.. అవకాశం చిక్కిన ప్రతిసారీ తానేంటో నిరూపించుకుంటోంది. ఈ ఏడాది బ్యాంకాక్‌ ఆసియా ఛాంపియన్‌షిప్‌లోనే 3000, 5000 మీటర్ల పరుగులో స్వర్ణ, రజతాలు గెలవడమే ఇందుకు ఉదాహరణ.

ప్రపంచ అథ్లెటిక్స్‌లో 11 స్థానంలో నిలిచింది. యూరోపియన్ల నుంచి పోటీని తట్టుకోవడం అంత తేలిక కాదు. అయితే ప్రభుత్వ సహకారం లభించడంతో విదేశాల్లో శిక్షణ తీసుకునే అవకాశాన్ని దక్కించుకున్న పారుల్‌.. అందులో భాగంగా అమెరికాలోని కొలరాడో పర్వతంపై సాధన చేసింది. హై అల్టీట్యూడ్‌ ఉండే ఈ ప్రదేశంలో రెండు నెలలు ప్రాక్టీస్‌ చేయడం వల్ల ఎండ్యూరెన్స్‌లోనూ పారుల్‌ మెరుగుపడింది. విదేశీ కోచ్‌ స్కాట్‌ సిమన్స్, భారత కోచ్‌ జల్వీర్‌ సింగ్‌ శిక్షణలో పారుల్‌ రాటుదేలింది. ఈ ఏడాది ఆరంభంలో 5000 మీటర్ల పరుగులో జాతీయ రికార్డు కొల్లగొట్టిన ఈ రన్నర్‌.. తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్‌లో 3000 పరుగులోనూ జాతీయ రికార్డును తన పేరిట లిఖించుకుంది.

ప్రపంచ అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన పారుల్‌ తదుపరి లక్ష్యం ఆసియా క్రీడలు. ఈ మెగా ఈవెంట్లో సత్తా చాటి వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్‌ ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని పారుల్‌ భావిస్తోంది. ‘‘భారత లాంగ్‌డిస్టెన్స్‌ రన్నర్‌ అవినాశ్‌ సాబ్లేతో కలిసి కొలరాడో పర్వతాలపై చేసిన శిక్షణ వల్ల ఎంతో నేర్చుకున్నా. ఫిట్‌నెస్‌ పరంగా ఈ ట్రైనింగ్‌ బాగా ఉపయోగపడంది. ప్రపంచంలోని టాప్‌ అథ్లెట్లతో పోటీపడి మంచి ఫలితాలు సాధించే అవకాశాన్ని కల్పించింది. త్వరలో జరిగే ఆసియా క్రీడలతో పాటు ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటాలనే సంకల్పంతో ఉన్నా’’ అని పారుల్‌ చెప్పింది.

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని