ShaCarri Richardson: షెకారి... స్ప్రింట్‌లో నయా సంచలనం!

షెకారి రిచర్డ్‌సన్‌ (ShaCarri Richardson) మహిళల స్ప్రింట్‌లో ఇప్పుడీమే హాట్‌ టాపిక్. షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌ దాటి పతకం సాధించింది అంటే మామూలు విషయమా? అయితే అది అంత ఈజీగా సాధ్యం కాలేదు.  

Updated : 26 Aug 2023 11:57 IST

మహిళల స్ప్రింట్‌ అనగానే గుర్తొచ్చే పేరు షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌. గత పదేళ్లుగా అంతలా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిందీ ఈ జమైకా స్టార్‌. ఇప్పుడు ఆమె ఆధిపత్యాన్ని గండికొట్టే అథ్లెట్‌ దూసుకొచ్చింది. బుడాపెస్ట్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో షెల్లీ స్వర్ణం కలను కల్లలు చేస్తూ విజేతగా నిలిచింది. ఆమే 23 ఏళ్ల షెకారి రిచర్డ్‌సన్‌ (ShaCarri Richardson). అమెరికా నయా సంచలనం. 

షెకారికి ఈ స్వర్ణం అంత తేలిగ్గా దక్కలేదు. ఎన్నో ఒడుదొడుకులు.. మరెన్నో ఇబ్బందులు.. కెరీర్‌ను ముంచేస్తాయా అనిపించిన కష్టాలు! అమ్మని కోల్పోయింది.. ఆ తర్వాత అనూహ్యంగా డోప్‌ పరీక్షలో దొరికిపోయింది. టోక్యో ఒలింపిక్స్‌కు దూరమైంది. గాయాలతో ఇబ్బందిపడింది. ఆ తర్వాత మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినా పరాజయాలే వెక్కిరించాయి. ఇంతటి క్లిష్టస్థితిలోనూ షెకారి మళ్లీ లేచింది. ఒత్తిడిని తట్టుకుంటూ కష్టాలకు నిలుస్తూ ప్రపంచ విజేత అయింది. 100 మీటర్ల పరుగులో తిరుగులేని షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌ జైత్రయాత్రకు చెక్‌ పెట్టింది.

తలకు భిన్నమైన రంగులు.. జట్టుకు పూసలు.. పొడవాటి గోళ్లు.. పెదాలకు లిప్‌స్టిక్‌.. ఏవరైనా ఫ్యాషన్‌ మోడల్‌ ట్రాక్‌లోకి వచ్చిందా అనిపిస్తుంది షెకారిని చూస్తే! కానీ ఆమె పరుగెత్తితే మెరుపులే! అమెరికా మాజీ దిగ్గజ అథ్లెట్‌ ఫ్లోరెన్స్‌ గిఫ్రిత్‌ జాయ్‌నర్‌ మాదిరే భిన్న అలంకరణలతో బరిలో దిగే షెకారి.. రికార్డులను బద్దలు కొట్టడంలోనూ జాయ్‌నర్‌నే అనుసరిస్తుంది. 2019లో రెండు అండర్‌-20 రికార్డులను తిరగరాసి అందరినీ తనవైపు తిప్పుకొందీ సంచనల అథ్లెట్‌. లూసియానాలో జరిగిన ఎన్‌సీఏఏ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల పరుగును 10.75 సెకన్లలో పూర్తిచేసి మార్లెస్‌ గోర్స్‌ రికార్డును సవరించిన ఈ అథ్లెట్‌.. 200 మీటర్ల పరుగును 20.17 సెకన్లలో ఫినిష్‌ చేసి 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో అలిసెన్‌ ఫెలిక్స్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. 

2020 టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశం షెకారికి త్రుటిలో చేజారింది. యుఎస్‌ అథ్లెటిక్స్‌ ట్రయల్స్‌లో వంద మీటర్ల పరుగులో 10.86 సెకన్ల టైమింగ్‌తో షెకారి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సందర్భంగా తీసుకున్న యూరిన్‌ శాంపిల్‌లో నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు తేలడంతో ఆమెపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ ట్రయల్స్‌కు ముందు తల్లిని కోల్పోయిన బాధలో ఒత్తిడిని తట్టుకోవడానికి షెకారి వాడిన కొన్ని మాత్రల్లో నిషేధిత ఉత్ప్రేరకం ఉండడం ఆమె పాలిట శాపమైంది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడాలనుకున్న ఆమె కల చెదిరింది. దీంతో మానసికంగా కుంగిపోయింది. 

2022లో పునరాగమనం చేసినా ఆశించిన ప్రదర్శన చేయకపోవడంతో యూజీన్‌ ప్రపంచ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌కు కూడా ఎంపిక కాలేకపోయింది. కానీ ఈ ఏడాది షెకారికి కలిసొచ్చింది. మునుపటి ఫామ్‌ని అందుకున్న ఆమె ఈ మేలో తొలి డైమండ్‌ లీగ్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. 100 మీటర్ల పరుగులో 10.76 సెకన్ల టైమింగ్‌తో మీట్‌ రికార్డు నెలకొల్పడమే కాక స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఈ జులైలో బుడాపెస్ట్‌ ప్రపంచ అథ్లెటిక్స్‌ బెర్తు కూడా దక్కించుకున్న షెకారి..అదే జోరుతో షెల్లీ ఫ్రేజర్‌ లాంటి దిగ్గజాన్ని వెనక్కి నెట్టి పసిడిని ముద్దాడింది. 10.65 సెకన్లలో రేసు ముగించిన ఆమె ఛాంపియన్‌షిప్‌ రికార్డును నెలకొల్పుతూ ప్రపంచ ఛాంప్‌గా నిలిచింది. 200 మీటర్ల పరుగులోనూ ఫైనల్‌ చేరిన ఆమె.. కాంస్య పతకం కైవసం చేసుకుంది. షెకారి జోరు చూస్తే 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని