Virat - Karthik: విరాట్‌ లాంటి ఓ విరాట్‌... అభిమానులను తికమకపెడుతున్న కార్తీక్‌

చూడటానికి విరాట్‌ కోహ్లీలానే ఉంటాడు కానీ విరాట్‌ కాదు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో చేసిన ఫొటో కూడా కాదు. అతనే కార్తిక్‌ శర్మ. ఇటీవల మళ్లీ వైరల్‌ అవుతున్న ఆయన గురించి ఆసక్తికర సమాచారం. 

Published : 10 Oct 2023 19:53 IST

ఒకప్పుడు అంటే 90ల్లో బల్వీర్‌ చంద్‌ అనే క్రికెట్‌ అభిమాని ఉండేవాడు. అతడిని చూడగానే ‘అరే.. సచిన్‌ తెందుల్కర్‌లాగే ఉన్నాడే’ అని అభిమానులు అనుకునేవాళ్లు. మాస్టర్‌ మాదిరే రింగుల జట్టు.. అదే ఎత్తు.. బరువుతో తెందుల్కర్‌ని తలపించేవాడు బల్వీర్‌ .  భారత్‌ ఆడే మ్యాచ్‌లకు వచ్చి జాతీయ జెండా పట్టుకుని హంగామా చేసేవాడు. 

కట్‌ చేస్తే..

కార్తీక్‌ శర్మ... అతడిని చూడగానే ‘ఏంటి విరాట్‌ కోహ్లిలా ఉన్నాడే!’ అని అనుకోని వాళ్లు ఉండరు. బల్వీర్‌ చంద్‌ అయినా తేరిపారా చూస్తే భిన్నంగా అనిపిస్తాడేమో కానీ కార్తీక్‌.. కోహ్లి క్లోన్‌లాగే ఉంటాడు. విరాట్‌ మాదిరి శరీరం, అతడిలాగే గడ్డం, నవ్వుతో సహా భారత క్రికెట్‌ స్టార్‌ని దించేశాడు కార్తీక్‌. చండీగఢ్‌కు చెందిన ఈ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా మారాడు. అతడు ఎక్కడికి వెళ్లినా అభిమానులు పొరబడి ఆటోగ్రాఫ్‌లు అడుగుతున్నారంటే కార్తీక్‌.. విరాట్‌ను ఎంతలా తలపిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. 

అవునా.. అతడేనా!

కార్తీక్‌కు విరాట్‌కు చాలా పోలికలే ఉన్నాయి. ఏదో ముఖ కవళికలు కలవడం మాత్రమే కాదు. అతడి నడక, స్టయిల్, నవ్వు కూడా విరాట్‌నే పోలి ఉండడంతో అభిమానులు ఆశ్చర్యపడుతున్నారు. అందుకే సోషల్‌ మీడియాలో అతడికి ఫాలోయింగ్‌ కూడా భారీగా పెరిగిపోయింది. కార్తీక్‌ బయటకు వస్తే చాలు కోహ్లి వచ్చాడేమో అనుకుని వెంటపడుతున్నారట. విరాట్‌.. ప్లీజ్‌ ఆటోగ్రాఫ్‌ ఇవ్వండి.. ఫొటోలు కావాలి అని అడుగుతున్నారట. కానీ ఈ క్రేజ్‌ని అతడేమి సొమ్ము చేసుకోవాలని అనుకోవట్లేదు. వచ్చిన వాళ్లకు తాను విరాట్‌ని కానని ముందే చెప్పేస్తున్నాడు. 

అయినా అభిమానులు మాత్రం అతడిని వదలట్లేదు. కోహ్లినే కావాలని ఇలా చెబుతున్నాడని అనుకుని ఫొటోలు దిగుతున్నారట. ఆటోగ్రాఫ్‌లు అడుగుతున్నారట. అతడి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ని ఇప్పటికే 2.5 లక్షల మంది దాకా ఫాలో అవుతున్నారు. రోజురోజుకి ఈ ఫాలోవర్లు పెరిగిపోతున్నారు. కోహ్లి లాగే తల మీద చేయి పెట్టుకుని ఆలోచిస్తున్నట్లు ఉన్న ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తే దీనికి 60 వేల లైక్‌లు పైనే వచ్చాయి. అప్పటి నుంచే కార్తీక్‌ క్రేజ్‌ పెరిగిపోయింది. 

క్రికెట్‌ రాదు కానీ..

కోహ్లిని పోలిన కార్తీక్‌కు కూడా విరాట్‌ ఆరాధ్య ఆటగాడు. అయితే కార్తీక్‌కు క్రికెట్‌ పెద్దగా రాదు. క్రీడలంటే ఇష్టమే కానీ ఏ క్రీడల్లోకి వెళ్లలేదు. అయితే కోహ్లి అంటే అతడికి చాలా ఇష్టం. అతడిని ఆదర్శంగా భావిస్తాడు. మైదానంలోనే కాదు మైదానం బయట విరాట్‌ వ్యక్తిత్వానికి తాను ఫిదా అని చెబుతాడు. ఏదో ఒక రోజు తన క్రికెట్‌ హీరోని కలవాలనేది అతడి ఆశ. తనకు పేరు వచ్చినా.. కార్తీక్‌ ఏమి బడాయికి పోడు. తాను ఎప్పుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. కోహ్లిని పోలిన కోహ్లి గురించి తెలుసుకున్న కొన్ని సంస్థలు డాక్యుమెంటరీలు కూడా తీస్తున్నాయి. హ్యుమన్స్‌ ఆఫ్‌ బాంబే పేరిట కార్తీక్‌పై ఓ డాక్యుమెంటరీ నిర్మాణానికి సిద్ధమైంది.

- ఈనాడు క్రీడా విభాగం 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని