SL vs BAN: బంగ్లా-శ్రీలంక ఆడితే ఫైరే .. గత కొన్ని సిరీస్‌లుగా ఇదే తంతు

 బంగ్లా-శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌ మ్యాచ్‌కు మధ్య ఏదో సిరీస్‌లా వివాదాలు కొనసాగుతున్నాయి. అప్పటి మాటకు ఇప్పుడు ప్రతీకారం.. అప్పటి చర్యకు ఇప్పుడు ప్రతిచర్య అన్నట్లుగా సాగుతున్నాయి.

Published : 07 Nov 2023 15:37 IST

నిదహాస్‌ ట్రోఫీ.. ఆసియా కప్‌.. ఇప్పుడు ప్రపంచకప్‌.. టోర్నీ మారుతోంది కానీ శ్రీలంక-బంగ్లాదేశ్‌ (SL vs BAN) మధ్య మైదానంలో వైరం మాత్రం అంతకంతకు పెరిగిపోతోంది. ఆటగాళ్ల మధ్య అస్సలూ పొసగట్లేదు. తాజాగా ప్రపంచకప్‌లో మాథ్యూస్‌ను టైం ఔట్‌ వివాదంతో ఈ జట్ల మధ్య వేడి ఇంకో స్థాయికి వెళ్లింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత లంక-బంగ్లా ఆటగాళ్లు  కనీసం కరచాలనం చేసుకోకపోవడమే ఇందుకు ఉదాహరణ. భారత్‌-పాకిస్థాన్, ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ మధ్య పోరు మాదిరిగానే లంక-బంగ్లా మ్యాచ్‌ల్లో ఉద్వేగాలు రేగుతున్నాయి. మ్యాచ్‌ మ్యాచ్‌కు మధ్య ఏదో సిరీస్‌లా వివాదాలు కొనసాగుతున్నాయి. అప్పటి మాటకు ఇప్పుడు ప్రతీకారం.. అప్పటి చర్యకు ఇప్పుడు ప్రతిచర్య అన్నట్లుగా సాగుతున్నాయి.

నా ‘టైమ్‌’ ఇంకా ఉంది.. వీడియో ఆధారాలున్నాయ్‌: ఏంజెలో మాథ్యూస్‌

మొదటి నుంచి అంతే..

బంగ్లా-శ్రీలంక ఒకప్పుడు స్నేహంగానే ఆడినా ఇప్పుడు మైదానం ఈ రెండు జట్లకు పొసగట్లేదు. ముఖ్యంగా గత అయిదేళ్లలో వైరం బాగా పెరిగిపోయింది. 2018 నిదహాస్‌ ట్రోఫీలో లీగ్‌ మ్యాచ్‌లో లంకపై గెలిచిన తర్వాత బంగ్లా ఆటగాళ్లు నాగిని నృత్యం చేయడంతో ఈ జట్ల మధ్య వేడి రాజుకుంది. ఆ తర్వాత మ్యాచ్‌లో బంగ్లాను చిత్తు చేసిన తర్వాత లంక ఆటగాళ్లు కూడా ఇలాగే నృత్యం చేసి రెచ్చగొట్టారు. బంగ్లా బౌలర్‌ నురుల్‌ హాసన్‌.. అప్పటి లంక కెప్టెన్‌ తిసార పెరీరాతో వివాదానికి దిగాడు. ఇక అక్కడ నుంచి ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా నాగిని నృత్యాలు మాములుగామారాయి. ఈ రెండు జట్ల  మధ్య వివాదం జరిగిన ప్రతిసారీ స్టార్‌ ఆటగాడు షకిబ్‌ అల్‌ హసన్‌ మైదానంలో చాలా అతిగా ప్రవర్తించి విమర్శల పాలయ్యాడు. అంతే భారీగా జరిమానాలకు గురయ్యాడు. లంక ఆటగాళ్లు ఎంత సౌమ్యంగా ఉన్నా కూడా ఏదో విధంగా స్లెడ్జింగ్‌ చేయడం బంగ్లా ఆటగాళ్లకు అలవాటుగా మారింది. దీంతో లంక కూడా దూకుడుగా మారింది. మాటకు మాట చెబుతోంది. గతంలో ఎప్పుడూ లేనట్లుగా వివాదాల్లోకి వెళుతోంది. నాగిని డ్యాన్స్‌ చేయడం, ఒకరిని ఒకరు దూసుకెళ్లడం ఇందులో భాగమే.

ఆసియాకప్‌లోనూ అంతే

ఈ ఏడాది ఆసియాకప్‌లోనూ ఈ రెండు జట్లు ఇలాగే వైరంతో ప్రవర్తించాయి. తాజాగా మాథ్యూస్‌ని టైమ్‌ ఔట్‌ ఇవ్వడం పెద్ద వివాదానికి తావిచ్చింది. క్రీడా స్ఫూర్తిని మరిచి బంగ్లా కెప్టెన్‌ షకిబ్‌ ఎప్పటిలాగే అనుచితంగా ప్రవర్తించాడని లంక అభిమానులు మండిపడుతున్నాడు. తన 15 ఏళ్ల కెరీర్‌లో ఇంత దిగజారుడు క్రికెట్‌ జట్టును చూడలేదని మాథ్యూస్‌ కూడా వాపోయాడు. ఈ విషయంలో క్రికెట్‌ వర్గాలు రెండుగా చీలిపోయాయి. షకిబ్‌ చేసింది సరైందే అని కొంతమంది వాదిస్తుంటే కచ్చితంగా తప్పు అని ఇంకొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా ఈ సంఘటన రెండు దేశాల మధ్య మళ్లీ అగ్గి రాజేసింది. బంగ్లాపై ఓటమితో ఒకవైపు ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించామన్న బాధ మరోవైపు.. మాథ్యూస్‌ విషయంలో అన్యాయం జరిగిందని మరోవైపు లంక ఆటగాళ్లు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. దీనికి తోడు భారత్‌ చేతిలో ఘోర పరాభవం తర్వాత తమ దేశ బోర్డు రద్దు కావడం కూడా లంకకు మరింత బాధ కలిగిస్తోంది. మరి మున్ముందు ఈ రెండు జట్ల మధ్య జరగబోయే సిరీస్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. 

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని