SL vs BAN: షకిబ్‌ తీరు అవమానకరం.. నా ‘టైమ్‌’ ఇంకా ఉంది.. వీడియో ఆధారాలున్నాయ్‌: ఏంజెలో మాథ్యూస్‌

బంగ్లా, శ్రీలంక జట్లు ఇప్పటికే సెమీస్‌ రేసు నుంచి వైదొలిగాయి. వారి ముందున్న మరో ఆశ ఛాంపియన్స్‌ ట్రోఫీ. ఆ ట్రోఫీకి అర్హత సాధించాలంటే వన్డే ప్రపంచ కప్‌ (ODI World Cup 2023) పాయింట్ల పట్టికలో టాప్‌-8లో ఉండాలి. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది.

Updated : 07 Nov 2023 12:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక సీనియర్‌ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ తొలిసారి ‘టైమ్డ్‌ ఔట్’గా పెవిలియన్‌కు చేరాడు. క్రీజ్‌లోకి వచ్చి గార్డ్‌ తీసుకోకుండానే మళ్లీ హెల్మెట్‌ కోసం వేచి చూశాడు. దీంతో బంగ్లా కెప్టెన్‌ షకిబ్‌ ఔట్‌ కోసం అప్పీలు చేయగా.. అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. దీంతో తీవ్ర అసహనంతో మాథ్యూస్‌ డగౌట్‌కు వెళ్లిపోయాడు. మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ బంగ్లా జట్టు కెప్టెన్‌ షకిబ్‌ తీరుపై మాథ్యూస్‌ తీవ్ర విమర్శలు గుప్పించాడు. తనకు ఇంకా సమయం ఉన్నా ఔట్‌గా ప్రకటించారని.. ఆ వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నట్లు వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం కూడా చేసుకోలేదు. దానిపైనా మాథ్యూస్‌ స్పందించాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి.. టైమ్‌డ్‌ ఔట్‌ అయిన శ్రీలంక బ్యాటర్‌

‘‘నేనేమీ తప్పు చేయలేదు. బ్యాటింగ్‌ కోసం రెండు నిమిషాల్లోపే సిద్ధమయ్యా. అయితే, హెల్మెట్ సరిగా లేదని గుర్తించా. ఇదే విషయం ఆటగాళ్లకు, అంపైర్లకు చెప్పా. మరి వారి కామన్‌సెన్స్‌ ఏమైందో తెలియదు. షకిబ్‌, బంగ్లా జట్టు నుంచి అవమానకర రీతిలో ప్రతిస్పందన వచ్చింది. వారు ఇదే విధంగా క్రికెట్‌ ఆడాలనుకుంటే ఆ స్థాయికి దిగిపోండి. ఇలా ప్రవర్తించడం మాత్రం చాలా తప్పు. నేను రెండు నిమిషాల్లోపు సిద్ధంగా ఉండకపోతే ఔటని నిబంధనలు చెబుతున్నాయి. కానీ, అప్పటికీ ఐదు సెకన్ల సమయం మిగిలే ఉంది. నా దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయి. అందుకే ఇదంతా వారి కామన్‌సెన్స్‌కే వదిలేస్తున్నా. ఇక్కడ నేను మన్కడింగ్‌, ఫీల్డర్‌ను అడ్డుకోవడం వంటి వాటి గురించి మాట్లాడటం లేదు. 

(ఫొటోలు: మాథ్యూస్ ట్విటర్)

కరచాలనం చేసుకోకపోవడం పెద్ద విషయమే కాదు. మీరు ఇతరుల నుంచి గౌరవం పొందాలనుకుంటే.. మీరు కూడా అలాంటి గౌరవమే ఇవ్వాలి. మేమంతా ఈ జెంటిల్మన్‌ గేమ్‌కు రాయబారులం. ఇతరులకు గౌరవం ఇవ్వకుండా ప్రవర్తించినప్పుడు మీరేం అడగ్గలరు? ఇప్పటి వరకు నాకు బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకిబ్‌, ఆ జట్టు పట్ల గౌరవం ఉండేది. ఇరు జట్లూ విజయం కోసమే పోరాడతాయి. నిబంధలను పాటించడం మంచిదే. కానీ, నేను రెండు నిమిషాల్లోపే సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి వీడియో ఆధారాలు మా వద్ద ఉన్నాయి. తప్పకుండా వీటిని తర్వాత బయటపెడతాం. మొదట వికెట్‌ పడినప్పటి నుంచి నేను క్రీజ్‌లోకి వచ్చేవరకూ తీసుకున్న సమయం ఎంతనే దానిపై ఆధారాలతోనే మాట్లాడుతున్నా. నా పదిహేనేళ్ల కెరీర్‌లో ఇలా దిగజారిపోయిన జట్టును ఎప్పుడూ చూడలేదు. అంపైర్లు కూడా ఇలాంటి విషయాల్లో మెరుగైన నిర్ణయం తీసుకోవాల్సింది. నేను క్రీజ్‌లో ఉండుంటే మా జట్టే గెలిచేదని చెప్పడం లేదు. కానీ, మనకు కాస్తయినా ఇంగిత జ్ఞానం ఉండాలి. నేను కావాలని హెల్మెట్‌ స్ట్రిప్‌ను లాగేయలేదు. అదే ఊడిపోయింది. అయితే, బంగ్లా వ్యవహరించిన తీరు మాత్రం నన్ను షాక్‌కు గురి చేసింది. మరే జట్టు కూడా ఇలా ఆలోచించదు’’ అని మాథ్యూస్‌ వ్యాఖ్యానించాడు.

షకిబ్‌ ప్రతిస్పందన ఇదే..

‘మాథ్యూస్‌ మరో హెల్మెట్‌ కోసం అడిగాడు. అప్పుడు ఓ ఫీల్డర్‌ నా దగ్గరకు వచ్చి మనం అప్పీల్‌ చేస్తే అంపైర్‌ అతణ్ని ఔట్‌గా ప్రకటిస్తాడని చెప్పాడు. అది నిబంధనల్లో ఉందని పేర్కొన్నాడు. అప్పుడే నేను అప్పీల్‌ చేశా. సీరియస్‌గానే అప్పీల్‌ చేస్తున్నావా అని అంపైర్‌ అడిగాడు. నిబంధనల్లో ఉంది కాబట్టి అవుననే చెప్పా. అది తప్పోఒప్పో తెలీదు. కానీ నేను యుద్ధంలో ఉన్నాననిపించింది. గెలుపు కోసం ఏమైనా చేయాలనిపించింది. అందుకే అలా చేశా. ఇప్పుడు దీనిపై చర్చ సాగుతూనే ఉంటుంది. తర్వాత బ్యాటింగ్‌లోనూ రాణించి విజయం సాధించడంలో ఆ టైమ్‌ఔట్‌ ఉపయోగిపడిందని అంగీకరిస్తా’’ అని బంగ్లా కెప్టెన్‌ షకిబ్‌ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని