WPL 2024: అమ్మాయిలు.. తగ్గేదేలే.. డబ్ల్యూపీఎల్‌లో అదుర్స్‌

తొలి సీజన్‌ కంటే రెండో ఎడిషన్‌ మహిళల  ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024) ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రతీ మ్యాచ్‌ కూడా అభిమానులకు క్రికెట్ మజాను అందిస్తోంది.

Published : 11 Mar 2024 16:04 IST

మునివేళ్లపై నిలబెట్టే ఉత్కంఠ.. నరాలు తెగే నాటకీయత. మ్యాచ్‌ ఎటు తిరుగుతుందో.. విజేతగా ఏ జట్టు నిలుస్తుందో అనే టెన్షన్‌. బంతి బంతికీ గుండె చప్పుడు పెరుగుతూ.. తగ్గుతూ సాగే మలుపులు. ఇదే.. కదా ఐపీఎల్‌ అందించే కిక్కు. కానీ ఈసారి ఐపీఎల్‌ కంటే ముందే ఇలాంటి టీ20 ఎంటర్‌టైన్‌మెంట్‌ అభిమానులను అలరిస్తోంది. హోరాహోరీ పోరాటాలతో అసలు మజా వస్తోంది. అందుకు కారణం అమ్మాయిలు. అవును.. రసవత్తర పోరాటాలతో మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) రెండో సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. 

ఆ మెరుపులతో..

గత మూడు మ్యాచ్‌లతో డబ్ల్యూపీఎల్‌ ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది. మహిళా క్రికెటర్ల అసాధారణ ప్రదర్శనతో చివరివరకూ అత్యంత ఉత్కంఠగా సాగి ఆఖరి బంతికి ఫలితాలు తేలడం అభిమానులను అలరిస్తోంది. ఆదివారం దిల్లీ క్యాపిటల్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన పోరు అయితే మునివేళ్లపై నిలబెట్టింది. 182 పరుగుల ఛేదనలో రిచా ఘోష్‌ (51; 29 బంతుల్లో 4×4, 3×6) అసాధారణ బ్యాటింగ్‌ ప్రదర్శనతో చెలరేగడంతో ఆర్సీబీ గెలిచేలా కనిపించింది. కానీ చివరి బంతికి రిచా రనౌట్‌ కావడంతో దిల్లీ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ఇప్పుడా మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక శనివారం ముంబయి ఇండియన్స్, గుజరాత్‌ జెయింట్స్‌ మధ్య పోరు మరో లెవల్‌. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ (95 నాటౌట్‌; 48 బంతుల్లో 10×4, 5×6) సంచలన ఇన్నింగ్స్‌తో చెలరేగింది. అసలు ఆశలు లేని స్థితిలో అమోఘమైన బ్యాటింగ్‌తో సత్తా చాటింది. బ్యాటింగ్‌తో ముంబయికి మరో బంతి మిగిలిఉండగా అద్భుత విజయాన్ని అందించింది. అంతకంటే ముందు మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ 138 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్న తీరు అదుర్స్‌ అనే చెప్పాలి. 93/2తో గెలుపు దిశగా సాగిన దిల్లీని యూపీ బౌలర్లు గొప్పగా కట్టడి చేశారు. దీప్తి శర్మ (4/19) హ్యాట్రిక్‌తో అదరగొట్టింది. 

లీగ్‌కు ఆకర్షణగా

ఈసారి తొలి మ్యాచ్‌తోనే డబ్ల్యూపీఎల్‌కు మంచి హైప్‌ వచ్చింది. ఆరంభ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్‌ సజన చివరి బంతికి సిక్సర్‌ కొట్టడంతో దిల్లీ క్యాపిటల్స్‌పై ఆ జట్టు గెలిచింది. ఆ తర్వాత నుంచి రసవత్తర పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (ముంబయి), మెగ్‌ లానింగ్‌ (దిల్లీ), స్మృతి మంధాన (ఆర్సీబీ), జెమీమా రోడ్రిగ్స్‌ (దిల్లీ) మెరుపులతో లీగ్‌కు ప్రత్యేక ఆకర్షణ తెస్తున్నారు. ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో లానింగ్‌ (290), స్మృతి (248), హర్మన్‌ప్రీత్‌ (235) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక సిక్సర్ల విషయానికి వస్తే యువ సంచలనం షెఫాలీ వర్మ దూకుడుతో సాగుతోంది. ఇప్పటికే ఆమె 12 సిక్సర్లు బాదింది. బౌలింగ్‌లో స్పిన్నర్‌ రాధా యాదవ్‌ (10 వికెట్లు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్‌ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరాయి. మరో స్థానం కోసం ఆర్సీబీ, యూపీ వారియర్స్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మరి ఈ రెండు జట్ల నుంచి ముందంజ వేసేది ఎవరో చూడాలి. లీగ్‌ మ్యాచ్‌లు ముగిసేసరికి అగ్రస్థానంలో నిలిచే జట్టు నేరుగా ఫైనల్‌ చేరుతుంది. రెండు, మూడు స్థానాల్లో ఉండే జట్టు.. తుదిపోరులో చోటు కోసం ఎలిమినేటర్‌లో తలపడతాయి. ఈ ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు అభిమానులకు మరింత టీ20 విందు అందించడం ఖాయమనే చెప్పాలి. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని