Shivam Dube: సిక్సర్ల దూబె.. శివమెత్తుతాడా?

ప్రస్తుత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ ఆటగాడు శివమ్‌ దూబె (Shivam Dube) మంచి ప్రదర్శనే ఇస్తున్నాడు. ఈ క్రమంలో దూబె గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం..

Updated : 29 Apr 2023 09:32 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆరడుగుల ఆజానుబాహుడు. సినిమాల్లోకి వెళ్లాల్సిన కుర్రాడు క్రికెట్‌ వైపు వచ్చాడా... అన్నట్లుగా ఉంటాడు. మొన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై కేవలం 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. ఇప్పటికే అర్థమైందిగా అతడే చెన్నై సూపర్ కింగ్స్‌ టాలెంటెడ్ బ్యాటర్ శివమ్‌ దూబె (Shivam Dube). ఇవాళ రాజస్థాన్‌తో చెన్నై మరో మ్యాచ్‌ ఆడనుంది. నేటి మ్యాచ్‌లోనూ శివమ్‌ దూబె శివమెత్తి ఆడతాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు. 

మధ్యతరగతి కుటుంబం..

ముంబయిలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు శివమ్‌. తల్లిదండ్రులు రాజేశ్ దూబె, మాధురి దూబె. శివమ్‌ దూబె 1993లో జన్మించాడు. డెయిరీ వ్యాపారం చేసే రాజేశ్ దూబె నష్టాలు రావడంతో జీన్స్‌ వాషింగ్‌ బిజినెస్‌ ప్రారంభించారు. కొంతకాలానికి కుమారుడి క్రికెట్‌ కెరీర్‌ కోసం ఆ వ్యాపారాన్ని ఇతరులకు లీజుకు ఇచ్చేశాడు. నాలుగేళ్ల వయసులోనే దూబెను చంద్రకాంత్ పండిత్‌ క్రికెట్‌ అకాడమీలో చేర్పించాడు. 

ఆర్థిక కష్టాలను ఎదుర్కొని.. 

క్రికెటర్‌గా మారాలని 13 ఏళ్ల వయసులోనే భావించినప్పటికీ ఆర్థిక పరిస్థితులు, ఫిట్‌నెస్ కారణంగా దూబె వెనుకడుగు వేశాడు. చిన్నప్పుడు బాగా లావుగా ఉండేవాడని అతడి కోచ్ చెప్పాడు. ఫిట్‌నెస్‌ సమస్య నుంచి బయటపడి మరీ తన 19వ ఏట ముంబయి అండర్ -23 జట్టుకు ఎంపికయ్యాడు. ఆ సమయంలో బంధువులు రమేశ్‌, రాజీవ్ మద్దతుగా నిలిచారు. ఐపీఎల్‌ తనకి అవకాశాలను చేరువ చేసింది. 2018లో ఆర్‌సీబీ రూ. 5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. దీంతో అప్పటి వరకు ఉన్న ఆర్థిక కష్టాలు తీరిపోయాయి. తర్వాత సీజన్లలో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. ఐపీఎల్‌ మెగా వేలంలో (2022) సీఎస్‌కే రూ. 4 కోట్లకు దూబెను సొంతం చేసుకుంది. 

అంజుమ్‌తో వివాహం

అంజుమ్‌ ఖాన్‌తో శివమ్‌ దూబెకి 2021 జులై 16న వివాహమైంది. హిందూ, ముస్లిం పద్ధతుల్లో వీరి వివాహం జరిగింది. అంజుమ్ ఖాన్‌ అలీగఢ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి మోడల్‌గా, నటిగా తన ప్రొఫెషన్‌ను కొనసాగిస్తోంది. అయితే, ఆమె వ్యక్తిగత విషయాలకు సంబంధించి ప్రైవసీని కోరుకుంటుందని దూబె పలు సందర్భాల్లో వెల్లడించాడు. గతేడాది అంజుమ్‌ పండంటి బాబుకు జన్మనిచ్చారు. 

ఫిట్‌నెస్‌ కోసం.. 

‘‘చిన్నప్పుడు ఆహారం విషయంలో పెద్దగా నియమాలు పెట్టుకోలేదు. దీంతో బాగా లావుగా తయారయ్యా. కానీ, క్రికెటర్ కావాలని అనుకున్నాక, 14 నుంచి 17 ఏళ్ల వయసులో మాత్రం విపరీతంగా డైట్ పాటించా.  అమ్మకు మాత్రం అలా చేయడం ఇష్టం లేదు. సరిగ్గా తినడం లేదని బాధపడుతుండేది. కొన్ని రోజులకు తనూ అర్థం చేసుకుంది’’ అని శివమ్‌ దూబె చెప్పాడు. నాటి నుంచి నేటి వరకు ఎక్కువ సమయం జిమ్‌, రన్నింగ్‌, వాకింగ్‌లతో గడిపేస్తాడు.    

ఫేవరెట్స్‌ వీరే..

శివమ్‌ దూబెకు క్రికెట్‌తోపాటు ప్రయాణాలు చేయడమంటే చాలా ఇష్టం. సంగీతాన్నీ బాగా ఆస్వాదిస్తాడు. క్రికెట్‌లో దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్‌ కలిస్‌ స్ఫూర్తి. క్రికెట్‌ కాకుండా ఫుట్‌బాల్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తాడు. బాలీవుడ్‌ స్టార్స్‌ వరుణ్‌ ధావన్‌, శ్రద్ధా కపూర్‌ ఫేవరెట్‌ నటీనటులు. సింగర్ బి. పరాగ్‌ను బాగా ఇష్టపడతాడు. క్రికెట్‌ ఆడని సమయంలో డ్యాన్స్, రైడింగ్‌, జిమ్‌లో గడపడం చేస్తాడు. 

యువీకి ప్రత్యామ్నాయంగా..

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ రిటైర్‌మెంట్‌ ప్రకటించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి శివమ్ అడుగు పెట్టాడు. అతడు లిస్ట్‌ - A క్రికెట్‌లో 47 సిక్స్‌లు, 46 ఫోర్లు బాదాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 39 సిక్స్‌లు, 99 పోర్లు కొట్టాడు. దీంతో డొమెస్టిక్ క్రికెట్‌లో సిక్సర్ల దూబెగా పేరొందిన శివమ్‌.. యువీ స్థానాన్ని రీప్లేస్ చేస్తాడని అంతా భావించారు. ఆల్‌రౌండర్‌ కావడంతో ఆ నమ్మకాలూ బాగా పెరిగిపోయాయి. అయితే 2019లో అరంగేట్రం చేసిన దూబె కేవలం ఒక్క వన్డే ఆడి 9 పరుగులు చేశాడు. 13 అంతర్జాతీయ టీ20లు ఆడి 105 పరుగులను మాత్రమే చేశాడు. మళ్లీ మూడేళ్ల నుంచి అంతర్జాతీయ జట్టులోకి రాలేకపోయాడు. 

ఐపీఎల్‌ కెరీర్‌ ఇలా.. 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో శివమ్‌ ఇప్పటి వరకు నాలుగు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ముంబయి ఇండియన్స్, రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్ ప్రాతినిధ్యం వహించగా.. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌  తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో అతడు మంచి గణాంకాలనే నమోదు చేశాడు. భారీ సిక్సర్లు బాదే దూబె సీఎస్‌కే తరఫున తన అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. గతేడాది ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 8 సిక్స్‌లు, 5 ఫోర్లతో 46 బంతుల్లోనే 95 పరుగులు చేశాడు. తొలుత 30 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన దూబె.. తర్వాత 45 పరుగులను కేవలం 16 బంతుల్లోనే రాబట్టాడంటే ఆ దూకుడుని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 42 మ్యాచుల్లో 872 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. దూబె తన ఐపీఎల్ కెరీర్‌లో 53 సిక్స్‌లు, 54 ఫోర్లు బాదడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని