Irene Paredes - Lucia Ybarra I క్రేజీ జోడీ... ఆటలో ఆ అమ్మ.. బాబుతో ఈ అమ్మ!

ఇరీనె పరెడెస్‌ (Irene Paredes), లూసియా యిబర్రా (Lucia Ybarra) ఈ ఇద్దరూ సాధారణమైన జోడీ కాదు. అందుకే ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. అంతగా ఏం చేశారంటే...

Published : 15 Aug 2023 14:43 IST

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో స్పెయిన్‌ తరపున ఆ అమ్మాయి ఆడుతోంది. డిఫెండర్‌గా మైదానంలో ప్రత్యర్థి క్రీడాకారిణుల గోల్స్‌ ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకుంటోంది. స్టాండ్స్‌లో నుంచి ఆ అమ్మాయి ఆట చూస్తూ.. మరో మహిళ, ఓ బాబు కేరింతలు కొడుతున్నారు. ఆ మహిళ.. ఆమె భార్య. అవును.. మీరు చదివింది నిజమే. ఆ మహిళలిద్దరూ దంపతులు. ఆ బాబు.. వీళ్ల సంతానమే. ఆ ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి పేరు.. ఇరీనె పరెడెస్‌ (Irene Paredes). ఆమె భాగస్వామి లూసియా యిబర్రా (Lucia Ybarra). వీళ్ల రెండేళ్ల బాబు మాటియో. లూసియా కూడా ఒకప్పటి హాకీ క్రీడాకారిణి. స్పెయిన్‌ జాతీయ జట్టుకు ఆమె ఆడింది. ఇప్పుడు బాబు బాగోగులు చూసుకుంటూ.. ఇరీనెను ప్రోత్సహిస్తోంది. ఈ ఇద్దరి ఆటలు వేరు.. కానీ మనసులు ఒక్కటయ్యాయి. సహజీవనం మొదలెట్టారు. లూసియా గర్భం దాల్చి, బిడ్డకు జన్మనివ్వడంతో ఇప్పుడు ఇద్దరూ అమ్మలయ్యారు. 

దగ్గర ఉండి మరీ..

ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ఉమ్మడిగా మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో స్పెయిన్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీ చరిత్రలో ఆ జట్టు సెమీస్‌ వెళ్లడం ఇదే తొలిసారి. ఆ జట్టులో కీలక క్రీడాకారిణి అయిన 32 ఏళ్ల ఇరీనెను.. ఆమె భాగస్వామి లూసియా దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తోంది. ప్రపంచకప్‌లో ఆడుతున్న తమ క్రీడాకారిణులను మానసికంగా బలంగా ఉంచడం కోసం వీళ్ల కుటుంబాలు టోర్నీకి వచ్చేందుకు స్పెయిన్‌ సమాఖ్య అనుమతినిచ్చింది. దీంతో ఇప్పుడు ఇరీనె, లూసియా, మాటియో కలిసే ఉంటున్నారు. 

అత్యంత తీవ్రత ఉండే ప్రపంచకప్‌లో ఇరీన్‌ రాణించేలా లూసియా అండగా నిలుస్తోంది. మరోవైపు తల్లి బాటలోనే సాగిన లూసియా హాకీని కెరీర్‌గా ఎంచుకుంది. 2004, 2008, 2016 ఒలింపిక్స్‌లో ఆడిన ఆమె.. ఆ తర్వాత ఫీల్డ్‌ హాకీని వదిలేసింది. లూసియా, ఇరీనె ఇద్దరికీ తల్లి అయ్యే అవకాశం ఉంది. కానీ ఇరీనె కెరీర్‌ కోసం.. ఆ బాధ్యతను లూసియా తీసుకుంది. కృత్రిమ పద్ధతిలో గర్భం దాల్చి.. 2021 సెప్టెంబర్‌లో బాబుకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టాక నాలుగు నెలలకే హాకీ స్టిక్‌ పట్టి ఆమె యూరో ఇండోర్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడం విశేషం. మరోవైపు క్లబ్‌ ఫుట్‌బాల్‌ కెరీర్‌లో పారిస్‌ సెయింట్‌ జర్మైన్‌ కెప్టెన్‌గా జట్టుకు తొలి లీగ్‌ టైటిల్‌ అందించిన ఇరీనె.. 2021 మధ్య నుంచి బార్సిలోనాకు ఆడుతోంది. 

వీళ్లు కూడా..

క్రీడల్లో ఇరీనె, లూసియా లాంటి జోడీలు ఇంకా చాలా ఉన్నాయి. సారా జోన్స్‌- లియా విల్కిన్సన్‌ (బ్రిటన్‌) టోక్యో ఒలింపిక్స్‌ హాకీ బరిలో దిగారు. అనీసా- అమంద (అమెరికా) సాఫ్ట్‌బాల్‌లో ఒలింపిక్స్‌లో ఆడారు. రియో ఒలింపిక్స్‌లో పసిడి నెగ్గిన హెలెన్‌- కేట్‌ (బ్రిటన్‌).. ఆ ఘనత సాధించిన తొలి స్వలింగ సంపర్కుల వివాహ జంటగా రికార్డుల్లోకెక్కింది. మెగాన్‌- సెలియా (బ్రిటన్‌), జార్జియా- స్టెఫానీ (కెనడా), స్యూ బర్డ్‌- మెగాన్‌ (అమెరికా).. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమతో ఒక్కటైన స్వలింగ సంపర్కుల క్రీడాకారిణుల జంటలు ఎన్నో! క్రికెట్లోనూ ఇలాంటి జోడీలున్నాయి. అలెక్స్‌ బ్లాక్‌వెల్‌ (ఆస్ట్రేలియా)- లిస్నీ (ఇంగ్లాండ్‌), అమీ సాథర్‌వైట్‌- లియా తహుహు (న్యూజిలాండ్‌), డేన్‌ వాన్‌ నికెర్క్‌- మరిజానె కాప్‌ (దక్షిణాఫ్రికా), కేథరీన్‌ బ్రంట్‌- నాట్‌ సీవర్‌ (ఇంగ్లాండ్‌) లాంటి మాజీ, తాజా క్రికెటర్లు జీవిత భాగస్వాములుగా మారారు. 

ఆసియా కప్‌ కోసం భారత జట్టు.. ‘ఈ నాలుగే’ కీలకం!

మరోవైపు క్రీడలతో సంబంధం లేని మహిళలను భాగస్వామిగా స్వీకరించిన మహిళా క్రికెటర్లూ ఉన్నారు. దిగ్గజ క్రికెటర్‌ సారా టేలర్‌ (ఇంగ్లాండ్‌).. తన భాగస్వామి డయానా మెయిన్‌తో కలిసి తల్లి కాబోతున్నారు. డయనా గర్భం దాల్చిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో సారా ప్రకటించింది. లియా- తహుహు జంట 2020లోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఆయా దేశాల్లో స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టం అనుమతి ఉండడంతో ఇలాంటి జంటలు ఎక్కువవుతున్నాయి. 

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని