IPL 2024: ఐపీఎల్‌ తొలి వేలంలో ధోనీ ధర ఎంతో తెలుసా? 2008 ఆక్షనీర్‌ పోస్ట్ వైరల్‌

ఇటీవల ఐపీఎల్‌ మినీ వేలంలో ఆసీస్ ఆటగాళ్లు ప్యాట్ కమిన్స్‌, స్టార్క్‌ రికార్డు ధరలను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించారు. మరి తొలి సీజన్‌ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడు ఎవరో తెలుసా? 

Updated : 24 Feb 2024 21:25 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఓ సంచలనంగా మారింది. తొలి సీజన్‌ నుంచే భారీగా ప్రజాదరణ దక్కించుకుంది. అటువైపు ఆటగాళ్లకూ కాసుల వర్షం కురిసింది. తొలి ఐపీఎల్‌ సీజన్‌కు.. ఇప్పటి ఎడిషన్‌కు వీక్షణల ప్రకారం, ఆటగాళ్ల భత్యాలపరంగా చాలా తేడా ఉంది. మొదటి సీజన్‌ 2008లో ప్రారంభం కాగా.. ప్రస్తుతం 17వ సీజన్‌ మార్చి 22 నుంచి మొదలుకానుంది. తొలి సీజన్‌ నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్న క్రికెటర్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అందులో టీమ్‌ఇండియా ‘కెప్టెన్ కూల్’, చెన్నై సూపర్ కింగ్స్‌ సారథి ఎంఎస్ ధోనీ కూడా ఉన్నాడు. ఐదుసార్లు సీఎస్‌కేను ఛాంపియన్‌గా నిలిపాడు. మరి అలాంటి మాహీ తొలి వేలంలో ఎంత దక్కించుకున్నాడనేది ఆసక్తికరమే కదా.. ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఆసీస్‌ ఆటగాళ్లు భారీ ధరను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

తొలి వేలాన్ని నిర్వహించిన ఆక్షనీర్ రిచర్డ్‌ మ్యాడ్లీ కొంతమంది టాప్‌ ప్లేయర్లతో కూడిన జాబితాను పోస్టు చేసి.. వీరికి ఎంత మొత్తం దక్కిందో వెల్లడించాలని కోరాడు. ఇప్పుడా పోస్టు వైరల్‌గా మారిపోయింది. ఆసీస్‌ దివంగత దిగ్గజం షేన్ వార్న్‌, ఎంఎస్ ధోనీ, ఆడమ్‌ గిల్‌క్రిష్ట్‌, షోయబ్‌ అక్తర్, మహేల జయవర్థనె, ముత్తయ్య మురళీధరన్‌ కనీస ధరతో కూడిన లిస్ట్‌ను తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. 

  • షేన్‌ వార్న్‌ 4,50,000 డాలర్లతో (రూ.1.90 కోట్లు) బరిలోకి దిగాడు. అంతే మొత్తం వద్ద రాజస్థాన్‌ రాయల్స్‌ వార్న్‌ను తీసుకుంది. తొలి సీజన్‌లోనే ఆర్‌ఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. 
  • ఎంఎస్ ధోనీ 4 లక్షల (రూ. 1.70 కోట్లు) డాలర్లతో వేలంలోకి వెళ్లాడు. ఏకంగా 15 లక్షల డాలర్లు (రూ. 6.45 కోట్లు) దక్కించుకున్నాడు. అప్పుడు డాలర్ విలువ దాదాపు రూ. 43 మాత్రమే. ఆ లెక్కన ఆ సీజన్‌లో ఎక్కువ మొత్తం దక్కించుకున్న క్రికెటర్‌గా ధోనీ నిలిచాడు. సచిన్‌కూ 11.21 లక్షల డాలర్లతో (రూ4.80 కోట్లు) తర్వాత స్థానమే.
  •  ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ 3 లక్షల డాలర్లకు వేలంలోకి రాగా.. డెక్కన్ ఛార్జర్స్ 7 లక్షల డాలర్లకు తీసుకుంది. అంటే మన రూపాయల్లో రూ. 3 కోట్లు.
  • పాక్‌ మాజీ స్పీడ్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ 4,25,000 డాలర్లకు (1.80 కోట్లు) కొనుగోలు చేసింది. అతడి బేస్‌ వ్యాల్యూ 2,50,000 డాలర్లు మాత్రమే. 
  • మహేల జయవర్థనె 2,50,000 డాలర్లతో వేలంలోకి వచ్చాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 4,75,000 డాలర్లకు (రూ. 2.05 కోట్లు) తీసుకుంది.
  • ముత్తయ్య మురళీధరన్‌ను సీఎస్‌కే 6 లక్షల డాలర్లు (రూ.2.60 కోట్లు) వెచ్చించి దక్కించుకుంది. అతడి కనీస ధర 2.50 లక్షల డాలర్లు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని