IPL 2023 Rewind: గత సీజన్‌ ఐపీఎల్‌ హీరోలు.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?

Published : 19 Mar 2024 17:26 IST

ఐపీఎల్ (IPL) 2024 సీజన్‌కు అంతా సిద్ధమైంది. సీఎస్కే, ఆర్సీబీ (CSK vs RCB)ల మధ్య మార్చి 22న జరిగే మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ పొందిన ఈ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలవడానికి ఫ్రాంఛైజీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. అయితే, గతేడాది ఐపీఎల్‌లో ఎవరెవరు అత్యుత్తమ ప్రదర్శన చేశారో ఓ లుక్కేద్దాం. 

దంచేసిన గిల్ 

2023లో గుజరాత్ టైటాన్స్‌ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) దంచికొట్టాడు. ఫైనల్‌తో కలిపి 17 మ్యాచ్‌లు ఆడి 59.33 సగటుతో 890 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌పై శతకాలు సాధించాడు. ఈ సీజన్‌లో అత్యధిక (3) సెంచరీలు చేసిన ఆటగాడు కూడా ఇతడే. సీజన్‌లో ఎక్కువ (85) ఫోర్లు కొట్టిన రికార్డు కూడా శుభ్‌మన్‌ పేరిటే ఉంది.

గుజరాత్ ‘త్రయం’ అదుర్స్‌ 

గత సీజన్‌లో గుజరాత్ ఫైనల్‌కు చేరడంలో గుజరాత్ బౌలింగ్‌ దళం పాత్ర కీలకమైనది. ఆ జట్టులో ముగ్గురు బౌలర్లు 25 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారంటే గుజరాత్ బౌలింగ్‌ విభాగం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది.  షమి అత్యధికంగా 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ విన్నర్‌గా నిలిచాడు. మోహిత్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌ చెరో 27 వికెట్లు తీశారు.  

అత్యధిక అర్ధ శతకాలు

ఆర్సీబీ కెప్టెన్‌ ఫాప్‌ డుప్లెసిస్‌ ఐపీఎల్ 2023 సీజన్‌లో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 14 మ్యాచ్‌ల్లో 56.15 సగటుతో 730 పరుగులు చేశాడు. 8 అర్ధ సెంచరీలు బాది అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గత సీజన్‌లో అత్యధిక (36) సిక్స్‌లు కొట్టింది కూడా డుప్లెసిసే. 

ఐపీఎల్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ

2023 ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) రాణించాడు. 14 మ్యాచ్‌ల్లో 625 రన్స్‌ చేసి సీజన్‌లో అత్యధిక పరుగులు రాబట్టిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ యువ బ్యాటర్ తన విశ్వరూపం చూపించాడు. కేవలం 13 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్‌ సెంచరీ కావడం విశేషం. 

ఎక్కువ ‘సున్నా’లు వీళ్లవే

గత సీజన్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన షమి ‘డాట్‌’ బాల్స్‌ వేయడంలోనూ అగ్రస్థానంలో నిలిచాడు. 17 మ్యాచ్‌ల్లో 65 ఓవర్లు వేసి 193 బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఆర్సీబీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ( 161), సీఎస్కే ఫాస్ట్‌బౌలర్‌ తుషార్‌ దేశ్‌పాండే (137), గుజరాత్ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ (134), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ (128) డాట్‌బాల్స్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

 ఒకేఒక్క హ్యాట్రిక్

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒకే హ్యాట్రిక్‌ నమోదైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గుజరాత్ టైటాన్స్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ వరుసగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్‌ క్యాచ్‌ ఔటవగా.. శార్దూల్ ఠాకూర్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు.  

ఆకాశ్@ 5/5

బ్యాటర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఐపీఎల్‌లో ఐదు వికెట్లు పడగొట్టాలంటే ఎంతో అనుభవం అవసరం. కానీ, ఓ బౌలర్‌ 10 మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా లేకపోయినా అయిదే పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. లఖ్‌నవూతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబయి పేసర్ ఆకాశ్‌ మధ్వాల్ ఈ సంచలన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. సీజన్‌లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని