IPL 2023: ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసు.. ఓడితే.. కష్టమే!

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తన చివరి లీగ్‌ మ్యాచ్‌ను ముంబయితో (MI vs SRH) ఆడనుంది. ఈ మ్యాచ్‌ ఫలితంతో హైదరాబాద్‌కు ఒనగూరే ప్రయోజనం ఏమీలేదు. కానీ, ముంబయి ప్లేఆఫ్స్‌ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే గుజరాత్‌ కూడా బెంగళూరుపై (RCB vs GT) గెలిచినా/ఓడినా తన అగ్రస్థానం చెక్కుచెదరదు. ఆర్‌సీబీ ఓడితే మాత్రం కష్టాలు తప్పవు. 

Updated : 22 May 2023 14:42 IST

ఇంటర్నెట్ డెస్క్: గత యాభై రోజులుగా అలరిస్తోన్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 (IPL 2023) సీజన్‌ లీగ్‌ దశ చివరి రోజుకు చేరింది. నేడు మూడు జట్ల ప్లేఆఫ్స్‌ భవితవ్యం తేలనుంది. ఖాళీగా ఉన్న ఏకైక బెర్తు కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. అందులో బెంగళూరు, ముంబయి జట్లు ముందంజలో ఉండగా.. వీటి ఫలితాలపైనే రాజస్థాన్‌ అవకాశం ఆధారపడింది. 

తొలుత ముంబయి (14 పాయింట్లు) - హైదరాబాద్‌ (8 పాయింట్లు) జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇందులో ముంబయి గెలిస్తే.. బెంగళూరు ఎంత తేడాతో గుజరాత్‌పై విజయం సాధించాలనేది తేలుతుంది. ఒకవేళ ముంబయి ఓడిపోతే.. బెంగళూరు స్వల్ప తేడాతో గెలిచినా చాలు నాలుగో బెర్తు సొంతమవుతుంది. ముంబయి, బెంగళూరు తమ చివరి మ్యాచుల్లో ఓడిపోతే.. రాజస్థాన్‌ రాయల్స్‌కూ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అప్పుడు మూడు జట్లూ పద్నాలుగేసి పాయింట్లతో ఉంటాయి. నెట్‌రన్‌రేట్‌ మెరుగ్గా ఉన్న టీమ్‌ ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తలపడాల్సి ఉంటుంది. 

వర్షం పడే అవకాశాలు

ముంబయి, రాజస్థాన్‌ జట్లతో పోలిస్తే రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు మరిన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ, గుజరాత్‌తో బెంగళూరు వేదికగా ఆర్‌సీబీ తలపడనుంది. అయితే, బెంగళూరులో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం చినుకులు పడేందుకు ఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ మ్యాచ్‌ జరగకుండా రద్దు అయితే గుజరాత్‌, బెంగళూరుకు చెరో పాయింట్‌ వస్తుంది. అప్పుడు బెంగళూరు ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. ముంబయి ఒకవేళ హైదరాబాద్‌పై విజయం సాధిస్తే మాత్రం బెంగళూరు ఆశలకు అడ్డుకట్ట పడుతుంది. ముంబయి 16 పాయింట్లు సాధించి నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్తుంది. అలాకాకుండా విజయం సాధిస్తే మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ఆర్‌సీబీ ముందంజ వేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని