Cricket News: ఎన్నికలు ఉన్నా భారత్‌లోనే ఐపీఎల్‌? ఆ జట్టుకు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా డీకే

సార్వత్రిక ఎన్నికలు ఉన్నా ఈ సారి ఐపీఎల్‌ (IPL 2024)ను భారత్‌లోనే నిర్వహించనున్నారని సమాచారం.

Published : 10 Jan 2024 22:36 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌ (IPL)కు మామూలు క్రేజ్‌ లేదు. ముఖ్యంగా భారత్‌లో ఈ లీగ్‌ జరుగుతుందంటే పండగ వాతావరణమే. తమ అభిమాన ఆటగాళ్ల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఫ్యాన్స్‌ స్టేడియాలకు పోటెత్తుతారు. విదేశీ స్టార్‌ ఆటగాళ్లు కూడా భాగమయ్యే ఈ లీగ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 2024 సీజన్‌ (IPL 2024) మినీ వేలం పూర్తయింది. అయితే, ఈసారి ఐపీఎల్‌ను ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటమే ఇందుకు కారణం. 2009లో దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. 2014లో మొదటి 20 మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించారు. 2019లో మొదట కొన్ని మ్యాచ్‌ల షెడ్యూల్‌ ప్రకటించిన ఐపీఎల్ పాలక మండలి.. ఎన్నికల నగారా మోగిన తర్వాత మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ని విడుదల చేసింది. 

ఈసారి ఇండియాలోనే? 

సార్వత్రిక ఎన్నికలున్నా ఈసారి భారత్‌లోనే ఐపీఎల్‌ను నిర్వహించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ (BCCI) వర్గాలు పేర్కొంటున్నాయి. ‘‘టోర్నమెంట్‌ను దేశం వెలుపలికి మార్చే ఆలోచన లేదు. సార్వత్రిక ఎన్నికలు కూడా అదే సమయంలో జరుగుతాయి. అప్పుడు ఏదైనా రాష్ట్రం సహేతుకమైన కారణంతో మ్యాచ్‌ నిర్వహణకు ఇష్టం చూపకపోతే ఆ మ్యాచ్‌ను మరొక వేదికకు తరలించవచ్చు’’  అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మార్చి 22 నుంచి ఐపీఎల్‌-2024 సీజన్‌ ప్రారంభమవుతుందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. 2024 టీ20 ప్రపంచకప్‌ జూన్‌ 2 నుంచి మొదలవనుంది. అంతకంటే 10 రోజుల ముందుగానే ఐపీఎల్‌ సీజన్‌ను ముగించాలని యోచిస్తున్నారు. ఎన్నికల నగారా మోగగానే ఐపీఎల్‌ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది. 


ఆ రెండు నగరాల్లో డబ్ల్యూపీఎల్ సీజన్‌-2 మ్యాచ్‌లు ? 

గతేడాది నిర్వహించిన మహిళల ప్రిమియర్‌ లీగ్ (WPL)కు విశేషమైన ఆదరణ లభించడంతో రెండో సీజన్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ టోర్నీని నిర్వహించే అవకాశముంది. తొలి సీజన్‌లో అన్ని మ్యాచ్‌లను ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం, డివై పాటిల్ స్టేడియాల్లో నిర్వహించారు. రెండో సీజన్‌ మ్యాచ్‌లను దిల్లీ, బెంగళూరు నగరాలు ఆతిథ్యమిస్తాయని సమాచారం. పాలక మండలి త్వరలోనే ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేస్తుందని తెలుస్తోంది.  


ఇంగ్లాండ్ లయన్స్‌ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా డీకే

భారత్, ఇంగ్లాండ్ మధ్య జనవరి 25 నుంచి ఐదు టెస్టుల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ లయన్స్‌, ఇండియా ‘ఎ’ జట్ల మధ్య ఓ వార్మప్‌ మ్యాచ్‌,  నాలుగు రోజుల అనధికార టెస్టులు మూడు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌ల కోసం ఇంగ్లాండ్ లయన్స్‌కు భారత వెటరన్ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik) బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించనున్నాడు. లయన్స్‌ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా ఉన్న ఇయాన్‌ బెల్ ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌తో పనిచేస్తున్నాడు. దీంతో డీకేని అతడి స్థానంలో నియమించుకున్నారు. అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియంలో జనవరి 12 నుంచి వార్మప్‌ మ్యాచ్, 17 నుంచి అనధికార టెస్టులు ప్రారంభంకానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని