IPL 2024 : నాయకులైతే మారారు... మరి ఫలితం మారుస్తారా?

అసలైన క్రికెట్‌ మజాను అందించే ఐపీఎల్‌ 2024 (IPL 2024) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. 17వ సీజన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Updated : 21 Mar 2024 17:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్‌ (IPL 2024) మెగా సమరం సిద్ధమవుతోంది. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న 17వ సీజన్‌ కోసం అన్ని జట్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. టైటిలే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కొన్ని జట్లకు కొత్త సారథులు వచ్చారు. మరి వారు ఆయా జట్లను ఎలా నడిపిస్తారు? అభిమానుల అంచనాలు అందుకుంటారా?

సీఎస్కేకు కొత్త సారథి..

ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లలో జట్టును నడిపించిన ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ తన వారసుడిని ప్రకటించాడు. యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్కే యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ధోనీ వెనకుండి జట్టును నడిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జట్టు విజయాల బాట పట్టే వరకూ అండగా నిలుస్తాడు. మైదానంలో మాత్రం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే హక్కు రుతురాజ్‌కే ఉంటుంది. మరి అతడు ఎలా ఈ బాధ్యతలు నిర్వర్తిస్తాడో చూడాలి. ఇప్పటి వరకు సీఎస్కే తరఫునే ఆడుతూ వచ్చిన రుతురాజ్‌ మొత్తం 52 మ్యాచ్‌లు ఆడి 1,797 పరుగులు చేశాడు. 

ముంబయి.. అనూహ్యం..

ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians)ను అత్యధికంగా ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్‌ శర్మను కాదని.. ఈ సారి గుజరాత్‌ నుంచి వచ్చిన హార్దిక్‌ పాండ్యకు పగ్గాలు అప్పగించారు. గుజరాత్‌ను విజయపథంలో నడిపి.. ఒకసారి విజేతగా, మరోసారి రన్నరప్‌గా నిలిపిన పాండ్య ఈ సారి ముంబయిని ఎలా నడిపిస్తాడో చూడాలి. గత కొన్ని సీజన్లుగా ముంబయి ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది. గత సీజన్‌లో నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా.. 2022లో దారుణంగా విఫలమై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అలాంటి జట్టును తిరిగి గాడిలో పెట్టి ఛాంపియన్‌గా నిలబెట్టడం పాండ్యకు పెద్ద సవాలే. ఈ సీజన్‌లో పాండ్య కెప్టెన్సీలో రోహిత్‌ ఆడాలి. ఇలాంటి పరిస్థితుల్లో జట్టులో సమన్వయం ఎలా ఉంటుందో చూడాలి. విజేతగా నిలవడం అలవాటుగా మార్చుకున్న జట్టుకు నాయకత్వం వహించడం, అందులోనూ రోహిత్‌ వారసత్వం తీసుకోవడం పాండ్యకు తలకుమించిన భారమే అంటున్నారు విశ్లేషకులు. మరి పాండ్య ఏం చేస్తాడో చూడాలి. 

గుజరాత్‌.. యువ సారథి..

అరంగేట్ర సీజన్‌లోనే ఛాంపియన్‌, ఆ తర్వాత రన్నరప్‌.. ఇలా గుజరాత్‌ టైటాన్స్‌ (Gujrat Titans) అందరి దృష్టిని ఆకర్షించింది. హార్దిక్‌ పాండ్య టీమ్‌ను వీడటంతో.. జట్టు పగ్గాలను యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ స్వీకరించాడు. బ్యాటింగ్‌లో సత్తా చాటి జట్టుకు అనేక విజయాలు అందించిన గిల్‌.. ఈ సారి కెప్టెన్‌గా కొత్త పాత్రలో ఎలా రాణిస్తాడో చూడాలి. గత సీజన్‌లో 17 ఇన్నింగ్స్‌ల్లో 890 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. ఈ సారి బ్యాటింగ్‌తో పాటు జట్టు సమన్వయ బాధ్యతలనూ చూసుకోవాలి. తక్కువ వయసు, కొద్దిపాటి అనుభవంతో ఆడి, ఆడించడం కత్తి మీద సామే అని చెప్పొచ్చు. సీనియర్లను, తనతోటి కుర్రాళ్లను సమన్వయం చేసుకుని జట్టు స్థాయిని కొనసాగించడం ఏమంత సులభం కాదనే చెప్పాలి. 

కొత్త కెప్టెన్‌.. సన్‌రైజర్స్‌ రాత మారేనా..?

గత కొన్ని సీజన్లుగా అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad)కు కొత్త కెప్టెన్‌ వచ్చాడు. మినీ వేలంలో పాట్‌ కమిన్స్‌ను రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసి.. జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఐపీఎల్‌ వేలం చరిత్రలోనే ఇది రెండో అత్యధిక కొనుగోలు. వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను విజేతగా నిలిపిన కమిన్స్‌.. సన్‌రైజర్స్‌ రాతా మార్చుతాడా అన్నది చూడాలి. గతంలో డేవిడ్‌ వార్నర్‌ నేతృత్వంలో 2016లో ఎస్‌ఆర్‌హెచ్‌ విజేతగా నిలిచింది. ఆ తర్వాత సారథులు మారారే తప్ప.. జట్టుకు టైటిల్‌ అందించలేకపోయారు. ఈసారి కమిన్స్‌ నేతృత్వంలో ఛాంపియన్‌గా నిలవాలని ఆ జట్టు అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో పొట్టి క్రికెట్‌లో కమిన్స్‌ ప్రదర్శన, నాయకత్వ పటిమ అంత ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం. 

అయ్యర్‌పైనే కోల్‌కతా ఆశలు..

భారీ అభిమాన గణం ఉన్న జట్లలో కోల్‌కతా (Kolkata Knight Riders) ఒకటి. అయితే.. ఈ జట్టు గత కొంత కాలంగా తీవ్రంగా నిరాశపరుస్తోంది. కోచ్‌ చంద్రకాంత పండిట్‌ ఆధ్వర్యంలో గత సీజన్‌లో అనుభవం లేని నితీశ్‌ రాణా నేతృత్వంలో ఆ జట్టు పెద్దగా ఆకట్టుకుంది లేదు. గతేడాది గాయం కారణంగా దూరమైన... శ్రేయస్‌ అయ్యర్‌ సారథిగా వచ్చాడు. బ్యాటింగ్‌లో దూకుడు చూపించే అయ్యర్‌.. జట్టును అదే విధంగా నడిపిస్తాడని యాజమాన్యం ఆశలు పెట్టుకుంది. మరోవైపు కేకేఆర్‌ను రెండుసార్లు విజేతగా నిలబెట్టిన గౌతమ్‌ గంభీర్‌.. ఈ సారి జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మరి చంద్రకాంత్‌ పండిట్‌ - శ్రేయస్‌ అయ్యర్‌ - గంభీర్‌ కాంబినేషన్‌లో కోల్‌కతా ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. 

పంత్‌ వచ్చాడు.. దిల్లీ భవిత్యం?

ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవని జట్లలో దిల్లీ (Delhi Capitals) ఒకటి. రోడ్డు ప్రమాదం కారణంగా గత సీజన్‌కు దూరమైన పంత్‌.. ఈ సీజన్‌లో తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు వచ్చాడు. అయితే.. అతడి ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత లేదు. బ్యాటర్‌గానే కొనసాగుతాడని.. కీపింగ్‌ చేయడని తెలుస్తోంది. అన్ని మ్యాచ్‌లు ఆడేది కూడా  ఫిట్‌నెస్‌పైనే ఆధారపడి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జట్టును పంత్‌ తనదైన వ్యూహాలతో ఎలా నడిపిస్తాడోనని అందరిలో ఆసక్తి నెలకొంది. ఒకవేళ పంత్‌ అందుబాటులోకి రాకపోతే దిల్లీని డేవిడ్‌ వార్నర్‌ నడిపిస్తాడని ఇప్పటికే చెప్పేశారు. అప్పుడు ఈ జట్టు పాత కెప్టెన్‌ ఆధ్వర్యంలోనే బరిలోకి దిగుతుంది. 

ఇక మిగతా ఐదు జట్లు పాత సారథుల నేతృత్వంలోనే ముందుకు సాగనున్నాయి. చెన్నైకి మహేంద్ర సింగ్‌ ధోనీ, రాజస్థాన్‌కు సంజూ శాంసన్‌, ఆర్సీబీకి ఫాఫ్‌ డు ప్లెసిస్‌, లఖ్‌నవూకు కేఎల్‌ రాహుల్‌, పంజాబ్‌ కింగ్స్‌కు శిఖర్‌ ధావన్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని