IPL 2024 playoffs: రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్‌ రేసు.. 3 స్థానాల కోసం ఐదు జట్ల పోటీ

ఐపీఎల్ 2024 (IPL)సీజన్‌ చివరి దశకు చేరుకున్నా ఇప్పటివరకు ఒకే జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. మిగతా మూడు స్థానాల కోసం తీవ్ర పోటీ ఉంది. 

Published : 14 May 2024 00:04 IST

ఐపీఎల్ 2024 (IPL)సీజన్‌లో గ్రూప్‌ దశలో ఇంకా ఎనిమిది మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. కానీ, కోల్‌కతా జట్టు ఒక్కటే ఇప్పటివరకు అధికారికంగా ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం ఏడు జట్లు పోటీపడుతున్నాయి. ముంబయి, పంజాబ్‌ మినహా మిగతా అన్ని జట్లు నాకౌట్‌ రేసులో ఉన్నాయి. ఆదివారం రాజస్థాన్‌ను చెన్నై, దిల్లీని బెంగళూరు ఓడించడంతో ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరంగా మారింది.  అయితే, 13 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లతో ఉన్న దిల్లీ, 12 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లతో ఉన్న గుజరాత్ సాంకేతికంగా మాత్రమే రేసులో ఉన్నాయి. ఆ జట్లు ప్లేఆఫ్స్‌ చేరడం దాదాపు అసాధ్యం. 

ఈ రెండు జట్లు కూడా 

ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌ ఈ జట్టు దాదాపు ప్లేఆఫ్స్‌ చేరినట్టే. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో (పంజాబ్‌, కోల్‌కతాతో) ఒక్క మ్యాచ్‌లో నెగ్గినా రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ రెండింటిలో ఓడినా అవకాశం ఉంటుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో కాకుండా తక్కువ తేడాతో ఓడాలి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో (గుజరాత్, పంజాబ్‌తో) విజయం సాధిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేఆఫ్స్‌ బెర్తును సొంతం చేసుకుంటుంది. మెరుగైన నెట్ రన్‌రేట్ ఉండటంతో ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా హైదరాబాద్‌ నాకౌట్‌ చేరే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే రాజస్థాన్‌, హైదరాబాద్‌ కచ్చితంగా ప్లేఆఫ్స్‌ చేరే అవకాశం ఉంది. 

లఖ్‌నవూకు ఛాన్స్‌ ఉంది.. కానీ 

పైన పేర్కొన్న విధంగా జరిగితే ఆఖరి బెర్తు కోసం చెన్నై, బెంగళూరు, లఖ్‌నవూ మధ్య పోటీ ఉంటుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న లఖ్‌నవూ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో దిల్లీ, ముంబయితో తలపడనుంది. ఈ జట్టుకు ప్లేఆఫ్స్‌ చేరడానికి మంచి అవకాశం ఉంది. కానీ, నెట్‌ రన్‌రేట్ ప్రతికూల అంశంగా మారింది. -0.769 నెట్‌ రన్‌రేట్‌ ఉన్న లఖ్‌నవూ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో నెగ్గితేనే నాకౌట్‌ దశకు చేరడానికి ఛాన్స్ ఉంటుంది.  

బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరాలంటే..   

ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే హైదరాబాద్‌ ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లో ఓడాలి. దాంతోపాటు లఖ్‌నవూ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లోనే విజయం సాధించాలి. వీటితోపాటు ముఖ్యంగా మే 18న చెన్నైతో జరిగే మ్యాచ్‌లో తప్పక విజయం సాధించాలి. సీఎస్కేపై 18 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ రన్స్‌ తేడాతో గెలవాలి లేదా చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేదించాలి. అప్పుడే సీఎస్కే నెట్‌ రన్‌రేట్‌ను ఆర్సీబీ అధిగమిస్తుంది.  

ఆర్సీబీ చేతిలో ఓడినా చెన్నైకి ఛాన్స్‌ 

ఆర్సీబీ చేతిలో ఓడినా చెన్నైకి ఛాన్స్‌ ఉంటుంది. బెంగళూరుపై భారీ తేడాతో కాకుండా స్వల్ప తేడాతో ఓడి నెట్‌ రన్‌రేట్ పడిపోకుండా చూసుకోవాలి. దీంతోపాటు సన్‌రైజర్స్‌ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో ఓడిపోయి 14 పాయింట్లతో ఉండాలి. అంతేకాదు మే 14న లఖ్‌నవూను దిల్లీ ఓడించాలి. శుక్రవారం ముంబయి చేతిలో లఖ్‌నవూ ఓడాలి లేదా స్వల్ప తేడాతో నెగ్గాలి. అప్పుడే నాలుగైదు జట్లు 14 పాయింట్లతో ఉంటాయి. నెట్‌ రన్‌రేట్‌ మెరుగ్గా ఉన్న జట్టు ముందంజ వేస్తుంది. 

- ఇంటర్నెట్ డెస్క్ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని