IPL 2024 Qualifier 1: ప్లేఆఫ్స్‌ తొలి పోరు... రైడర్స్‌పై సన్‌ ‘రైజ్’ అయితే ఫైనల్‌కు!

ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగే క్వాలిఫయర్‌-1లో సన్‌రైజర్స్‌ (Sunrisers Hyderabad)ను కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) ఢీకొంటుంది. 

Updated : 21 May 2024 17:11 IST

ఐపీఎల్ 17వ సీజన్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగే క్వాలిఫయర్‌-1లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders)ను సన్‌రైజర్స్‌ హైదరాబద్‌ (Sunrisers Hyderabad) ఢీకొంటుంది. మరి ఈ రెండు సన్‌రైజర్స్‌, నైట్‌రైడర్స్‌ (SRH vs KKR) బలబలాలెంటి, ఆ వేదిక మీద ఎలాంటి ప్రదర్శన చేశాయో చుద్దాం. 

  • గతేడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన హైదరాబాద్‌.. ఈ సీజన్‌లో కనీసం ప్లేఆఫ్స్‌కు వస్తే చాలని అభిమానులు భావించారు. కానీ, జట్టు నాయకత్వంతోపాటు మరికొన్ని మార్పులు చేయడంతో సన్‌రైజర్స్ దశ తిరిగింది. మరోవైపు కోల్‌కతా పరిస్థితీ దాదాపు ఇంతే. మెంటార్‌గా గౌతమ్‌ గంభీర్‌ రాక, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ జోరుతో ప్లేఆఫ్స్‌కు వచ్చేసింది.
  • ఐపీఎల్‌లో మొదటి రెండు అత్యధిక స్కోర్లు (287/3, 277/3) సాధించిన ఆరెంజ్ ఆర్మీ.. ప్లేఆఫ్స్‌లో అలాంటి ప్రదర్శనే చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అహ్మదాబాద్‌ పిచ్‌ కూడా అలాంటి సూపర్ ఫాస్ట్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది కూడా. 
  • సన్‌రైజర్స్‌లో అభిషేక్ శర్మ, ట్రావిస్‌ హెడ్‌ సిక్సర్లు - ఫోర్లతో ప్రత్యర్థి జట్లను షేక్ చేస్తుంటే.. భువనేశ్వర్‌, నటరాజన్‌, కమిన్స్‌ స్లో బంతులు, యార్కర్‌లతో బెంబేలెత్తిస్తున్నారు.
  • నరైన్, శ్రేయస్, నితీష్‌ రాణా, రింకు, రసెల్‌ వంటి వారితో కోల్‌కతా బ్యాటింగ్‌ లైనప్‌ దుర్భేద్యంగా కనిపిస్తోంది. వరుణ్‌ చక్రవర్తి, హర్షిత్‌ రాణా బంతితో మ్యాజిక్‌ చేస్తున్నారు. వీరికి నరైన్‌ అదనం.
  •  కీలక బ్యాటర్‌ ఫిల్‌ సాల్ట్‌ (435 పరుగులు) స్వదేశానికి వెళ్లిపోవడం మాత్రం కోల్‌కతాకు ప్రతికూలాంశమే.
  • హైదరాబాద్‌ మిడిల్ ఆర్డర్‌లో నితీశ్‌ రెడ్డి ఆల్‌రౌండ్‌ పెర్ఫామెన్స్‌తో అదరగొడుతుంటే... కోల్‌కతాలో ఆ పని ఆండ్రూ రసెల్‌ చేస్తున్నాడు. క్లాసెన్ సిక్సర్ల వర్షానికి.. రింకూ సింగ్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌ మ్యాచింగ్‌ అవుతుంది. 
  • కోల్‌కతాతో పోలిస్తే హైదరాబాద్‌కు నమ్మకమైన స్పిన్నర్లు లేకపోవడం మైనస్‌గా మారింది. కానీ కోల్‌కతాతో పోలిస్తే హైదరాబాద్‌ పేస్ బలంగా ఉండటం కలిసొచ్చే అంశం. 
  • శ్రేయస్ అయ్యర్‌, వెంకటేశ్‌ అయ్యర్ పెద్దగా ఫామ్‌లో లేకపోవడం కోల్‌కతాకు ఇబ్బంది కలిగించే విషయం అయితే... మిడిలార్డర్‌లో క్లాసెన్‌, నితీశ్‌ మినహా సరైన బ్యాటర్‌ లేకపోవడం సన్‌రైజర్స్‌కు ప్రతికూలాంశం. 
  • ఇక ఐపీఎల్‌ చరిత్రలో కోల్‌కతా, హైదరాబాద్‌ జట్లు 26 సార్లు తలపడ్డాయి. ఇందులో కేకేఆర్‌ 17 మ్యాచ్‌లు గెలిచి ఆధిపత్యం చెలాయిస్తోంది. సన్‌రైజర్స్‌ ఏడు మ్యాచ్‌ల్లో నెగ్గింది.
  • ఈ సీజన్‌లో కోల్‌కతా సొంత గడ్డ మీద జరిగిన మ్యాచ్‌లోనూ హైదరాబాద్‌ ఓటమి పాలైంది. అయితే అది నాలుగు పరుగుల తేడాతోనే. అయితే ఆ మ్యాచు ట్రావిస్‌ హెడ్‌ రాకముందు జరిగిన మ్యాచ్‌.
  • ఇక అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌తో జరిగిన మ్యాచులోనూ సన్‌రైజర్స్‌ ఓడిపోవడం గమనార్హం. బలమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఉన్న హైదరాబాద్‌ 162/8కే పరిమితమై ఓటమి మూటగట్టుకుంది.
  • పిచ్‌ బ్యాటర్లకు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. టాస్‌ గెలిచిన కెప్టెన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడం ఖాయం.
  • అహ్మదాబాద్‌లో ఇటీవల జరగాల్సిన మ్యాచ్‌ (గుజరాత్‌ X కోల్‌కతా) వర్షం కారణంగా రద్దయింది. అయితే క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.

- ఇంటర్నెట్ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని