IPL 2024: ఐపీఎల్ 2024.. రూ. 3.60 కోట్ల యువ ఆటగాడికి రోడ్డు ప్రమాదం

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్‌ 2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో గుజరాత్‌ ఆటగాడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

Updated : 03 Mar 2024 17:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ మినీ వేలంలో రూ.3.60 కోట్లు దక్కించుకుని అందరి దృష్టి ఆకర్షించిన గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాడు రాబిన్‌ మింజ్‌ (Robin Minz) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మరో వాహనం ఢీకొనడంతో అతడికి గాయాలయ్యాయని తండ్రి ఫ్రాన్సిస్‌ మింజ్‌ తెలిపారు. గాయం మరీ తీవ్రమైంది కాదని.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని ఆయన చెప్పారు. ఈ ప్రమాదంలో అతడి వాహనం ధ్వంసం కాగా.. మోకాలికి గాయాలయ్యాయి.

ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాకు చెందిన రాబిన్‌ మింజ్‌ ఐపీఎల్‌లో ఆడనున్న తొలి గిరిజన క్రికెటర్‌గా నిలిచాడు. ఎడమచేతి వాటం కలిగిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దేశవాళి టోర్నీల్లో దూకుడైన ఆటతో వెలుగులోకి వచ్చాడు. మాజీ కెప్టెన్‌ ధోనీకి కెరీర్‌ మొదట్లో శిక్షణ ఇచ్చిన చంచల్‌ భట్టాచార్య దగ్గరే మింజ్‌ కూడా శిక్షణ పొందుతున్నాడు.

2023 ఐపీఎల్‌ వేలంలో రాబిన్‌ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. ఈ సీజన్‌లో మాత్రం ముంబయి, లఖ్‌నవూ, దిల్లీ, కోల్‌కతా జట్లు పోటీ పడగా గుజరాత్‌ జట్టు భారీ ధరకు దక్కించుకుంది. మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప అతడిని ఎడమ చేతి వాటం పోలార్డ్‌ అని కొనియాడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని