T20 World Cup 2024: ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్‌డౌన్‌ బ్యాటర్‌గా అతడే: ఇర్ఫాన్ పఠాన్‌

మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్‌ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్‌ పఠాన్ తన టీమ్‌ను వెల్లడించాడు.

Updated : 24 Apr 2024 14:03 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ కోసం (T20 Wolrd Cup 2024) జట్టును ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. భారత స్క్వాడ్‌ను ఈ నెల 27న వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మాజీ క్రికెటర్లు తమ అంచనాలతో కూడిన టీమ్‌లను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సౌరభ్ గంగూలీ ఓపెనర్లుగా ఎవరు ఉండాలి? అని మాట్లాడగా.. తాజాగా భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన జట్టును వెల్లడించాడు. ఇందులో కీపర్లుగా కేఎల్‌ రాహుల్‌, సంజూలకు చోటు కల్పించకపోవడం గమనార్హం.

టాప్‌ ఆర్డర్‌లో వీరే: బ్యాటింగ్‌ టాప్‌ ఆర్డర్‌లో ఓపెనర్లుగా నలుగురిని ఎంచుకుంటా. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్‌ అందులో ఉంటారు. గిల్ బ్యాకప్‌గానే ఉంటాడు. యశస్వితో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. విరాట్ కోహ్లీ వన్‌డౌన్‌లో వస్తాడు. 

మిడిలార్డర్: భారత జట్టులో మిడిలార్డర్‌కు మంచి పోటీ ఉంది. సూర్యకుమార్ యాదవ్, రిషభ్‌ పంత్, రింకు సింగ్‌, శివమ్‌ దూబెకు అవకాశం ఇస్తా. ఏకైక పేస్‌ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యకే ఎక్కువ ఛాన్స్‌ ఉంది. దూబె కూడా మీడియం పేస్ వేస్తాడు. కానీ, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో అతడితో బౌలింగ్‌ వేయించలేదు. పంత్‌తోనే కీపింగ్‌ చేయిస్తా.

స్పిన్‌ - పేస్ బౌలర్లు: రవీంద్ర జడేజా స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులో ఉంటాడు. చాహల్, కుల్‌దీప్‌ యాదవ్‌లకు స్పిన్‌ విభాగంలో చోటు కల్పిస్తా. రవి బిష్ణోయ్, వరుణ్‌ చక్రవర్తి మంచి ప్రదర్శనే చేస్తున్నా.. అవకాశం మాత్రం కష్టమే. పేస్ విభాగంలో షమీ (ఫిట్‌నెస్ కీలకం) వస్తే ఉంటాడు. అలా కాని పక్షంలో బుమ్రాకు తోడుగా సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ పేస్‌ ఎటాక్‌ను నడిపిస్తారు. నటరాజన్‌, మయాంక్‌ యాదవ్‌, ఖలీల్ అహ్మద్‌ సహా మరికొందరు పేర్లను పరిగణనలోకి తీసుకున్నా.. ఎలాంటి ప్రయోగాలకు వెళ్లే అవకాశం ఉండదు. 

ఇర్ఫాన్‌ 15 మంది సభ్యుల టీమ్‌ ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, రింకు సింగ్, శివమ్‌ దూబె, హార్దిక్‌ పాండ్య, రిషభ్‌ పంత్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్‌ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని