Irfan Pathan: ఉమ్రాన్‌ విషయంలో నా అంచనాలు తప్పాయి: ఇర్ఫాన్‌ పఠాన్‌

దక్షిణాఫ్రికా పిచ్‌లపై ఆడేందుకు భారత యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ ఆల్‌ రౌండర్‌ ఇర్ఫాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Published : 01 Dec 2023 11:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పేస్‌ బౌలింగ్‌కు అనుకూలించే దక్షిణాఫ్రికా పిచ్‌లపై ఆడేందుకు భారత సెలక్టర్లు ఎంపిక చేసిన జట్లపై మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కశ్మీర్‌ ఏస్‌ సీమర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు ఓ అవకాశం ఇచ్చి ఉండాల్సిందని ఈ ఆల్‌రౌండర్‌ అభిప్రాయం. ఇదే విషయాన్ని ట్విటర్‌లో నిర్మొహమాటంగా పోస్టు చేశాడు. ‘‘గత 11 నెలల క్రితం టీమ్‌ ఇండియాలో ఉన్న ఆటగాడికి ఈ సారి జట్టులో స్థానం దక్కుతుందని పూర్తిగా నమ్మాను’’ అని పేర్కొన్నాడు. దీనికి హ్యాష్‌ట్యాగ్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ అని జోడించాడు. 

గతంలో కూడా పఠాన్‌ చాలా సందర్భాల్లో ఉమ్రాన్‌కు మద్దతుగా నిలిచాడు. ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ యువ పేసర్‌కు అక్కడ ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. అప్పట్లో దీనిపై పఠాన్‌ ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘‘ఐపీఎల్‌లోనే అత్యంత వేగవంతమైన బౌలర్‌ను రిజర్వు బెంచ్‌లో ఎందుకు కూర్చోబెట్టారో నాకర్థం కావడంలేదు. ఉమ్రాన్‌ను ఆ ఫ్రాంఛైజీ సరిగ్గా వినియోగించుకోలేదు’’ అని పేర్కొన్నాడు. 

దక్షిణాఫ్రికాకు ముగ్గురి సారథ్యంలో..

మరోవైపు వేగంగా బంతులు వేయడం పక్కనపెడితే.. ధారాళంగా పరుగులిస్తాడనే అపవాదు ఉమ్రాన్‌పై ఉంది. అతడు తరచూ లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను కోల్పోవడంతో ఈ పరిస్థితి వస్తోందనే పేరుంది. వన్డేల్లో అతడి ఎకానమీ 6.54 కాగా.. టీ20ల్లో ఏకంటా 10.48గా నిలిచింది. ఓ సందర్భంలో వ్యాఖ్యాత, టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘తన (ఉమ్రాన్‌) బౌలింగ్‌ను తానే అర్థం చేసుకొనేట్లు చేయాలి. ఆటను, బ్యాటర్‌ను అర్థం చేసుకోవడం అవసరం. అతడు ఇప్పుడు ఆలోచిస్తున్న విధానం తప్పని స్వయంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఉమ్రాన్‌కు నేను ఒక్కటే చెబుతున్నా.. ఎప్పుడు వేగాన్నే నమ్ముకొన్ని దుమ్మురేపేద్దామనుకొంటాడు. కానీ, అతడు గంటకు 150 కి.మీ వేగంతో బంతి వేస్తే.. బ్యాటర్‌ దానిని గంటకు 250 కి.మీ వేగంతో బాదేస్తాడు. ఎలా మొదలు పెట్టాలో అతడు తెలుసుకోవాలి. అతడు ఎందుకు విఫలమవుతున్నాడో వారు (కోచ్‌లు) వీడియో ఫుటేజీల్లో చూపించి ఉంటారు. అతడు మరింత భిన్నంగా ప్రయత్నించాలని చెప్పండి’’ అని పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని