Team India: అశ్విన్‌ టాప్‌ స్పిన్నరే.. కానీ సెలెక్టర్ల ప్రణాళికలు సరిగ్గా లేవు: ఇర్ఫాన్ పఠాన్‌

వన్డే ప్రపంచకప్‌ (ODi World Cup 2023) స్క్వాడ్‌లో ఇద్దరు ఆటగాళ్లు గాయాలపాలు కావడంతో కొత్తగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై సందిగ్ధత నెలకొంది. అయితే, సీనియర్‌ అశ్విన్‌ను ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు తీసుకున్న సెలెక్టర్లు.. అతడిని వరల్డ్ కప్‌ కోసం ఎంపిక చేస్తారో లేదో వేచి చూడాలి.

Updated : 20 Sep 2023 12:09 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్‌ ముంగిట ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను భారత్‌ ఆడనుంది. సెప్టెంబర్ 22 నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్‌ రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత 50 ఓవర్ల క్రికెట్‌ను ఆడేందుకు అశ్విన్‌ సిద్ధం అవుతున్నాడు. అక్షర్ పటేల్‌ గాయపడటంతో అతడికి అవకాశం లభించింది. ఒకవేళ అక్షర్ లేదా శ్రేయస్‌ అయ్యర్ అందుబాటులో లేకపోతే ప్రపంచ కప్ స్క్వాడ్‌లోకి అశ్విన్‌ వచ్చినా ఆశ్చర్యం లేదు. దీంతో భారత సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయంపై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. అశ్విన్‌ టాప్‌ స్పిన్నరే అయినప్పటికీ అతడిని ఎంపిక చేసిన విధానం సరిగ్గా లేదని వ్యాఖ్యానించాడు. మెగా టోర్నీకి ఎంపిక చేయాలని భావిస్తే అశ్విన్‌కు తగినంత సమయం ఇస్తే బాగుండేదని పేర్కొన్నాడు.

‘‘ప్రపంచంలోనే అశ్విన్‌ను మించిన అత్యుత్తమ స్పిన్నర్ లేడు. ఎంతో అనుభవం కలిగిన ఆటగాడు. అలాంటి ప్లేయర్‌ను వరల్డ్ కప్‌ కోసం ఎంపిక చేయాలని చూస్తున్నారు. అయితే, మెగా టోర్నీలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. సీనియర్‌ ఆటగాడు కాబట్టి నేరుగా వచ్చేసి ఈ ఫార్మాట్‌లో సాధారణంగా ఆడేస్తాడని భావించడం సరైంది కాదు. ఎందుకంటే అశ్విన్‌ దాదాపు పదిహేడు నెలల నుంచి వన్డేల్లో ఆడలేదు. అతడికి తగినంత మ్యాచ్‌లు ఆడే సమయం ఇచ్చి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆసీస్‌తో ఎంపిక చేసినా ఈ సమయం సరిపోతుందని అనిపించడం లేదు. 

ODI WC 2023: తేల్చుకోవాలిక..

బీసీసీఐ సెలెక్షన్ కమిటీ వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవు. అశ్విన్ కోసం ఏదైనా ప్రణాళిక ఉండుంటే వరల్డ్‌ కప్‌ ముందు అతడికి మరిన్ని అవకశాలు ఇచ్చి ఉండాల్సింది. ఆసీస్‌తో ఆడినంత మాత్రన సరిపోతుందా? పది ఓవర్ల బౌలింగ్‌ వేయించాలి. అలాగే ఫలితం భారత్‌కు అనుకూలంగా రావాలి. ఇదంతా అంత సులువేం కాదు. అందుకే, ప్రణాళికలు మరింత ఉత్తమంగా ఉంటే బాగుండేది’’ అని ఇర్ఫాన్‌ వ్యాఖ్యానించాడు. 

అక్షర్‌కు అలా జరగకపోతే.. : కైఫ్‌

‘‘అక్షర్ పటేల్‌కు ఊహించని రీతిలో గాయమైంది. ఇలా జరగకుండా ఉంటే మాత్రం అశ్విన్‌ను ఎంపిక చేయాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదు. ఇప్పుడు అక్షర్ పటేల్ గాయాలతో బాధపడుతున్నాడు. త్వరగా కోలుకుని రావడం కష్టమే. వారంలోనే వచ్చేస్తాడని చెబుతున్నా.. అతడి గాయాలనుబట్టి కనీసం మూడు వారాలు పట్టొచ్చు. అందుకే, అశ్విన్‌ వంటి అనుభవం కలిగిన బౌలర్‌ వైపు మొగ్గు చూపారు. వాషింగ్టన్ సుందర్‌ కూడా వేచి ఉన్నాడు. కానీ వీరిద్దరిని పోల్చడం సరైంది కాదు. ఎందుకంటే అశ్విన్‌ అన్ని ఫార్మాట్లలోనూ కలిపి దాదాపు ఏడు వందలకుపైగా వికెట్లు పడగొట్టాడు’’ అని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని