Devdutt Padikkal: ధర్మశాలలో పడిక్కల్‌ అరంగేట్రం చేసేనా?

ధర్మశాల వేదికగా టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు భారత్‌, ఇంగ్లాండ్‌లు సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ మ్యాచ్‌లో మరో ఆటగాడు టెస్టుల్లోకి అడుగుపెడతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 

Updated : 06 Mar 2024 16:03 IST

స్వదేశంలో ఇంగ్లాండ్‌తో అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ (IND vs ENG 2024)ను భారత్‌ ఇప్పటికే 3-1తో సొంతం చేసుకుంది. ఇక మిగిలింది ఆఖరి టెస్టు మాత్రమే. గురువారం ఈ మ్యాచ్‌ ఆరంభమవుతుంది. ఇప్పటికే సిరీస్‌ టీమ్‌ఇండియా సొంతమైన నేపథ్యంలో ఇది నామమాత్ర మ్యాచ్‌గా మారిపోయింది. అయినా ఈ మ్యాచ్‌కు ముందు ఓ విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది. భారత ఆటగాళ్ల అరంగేట్రాలకు వేదికగా మారిన ఈ సిరీస్‌లో మరో ఆటగాడు టెస్టుల్లో అడుగుపెడతాడా? అన్నది హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ ఆటగాడే.. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (Devdutt Padikkal). మరి ఈ టెస్టుతో అతను సుదీర్ఘ ఫార్మాట్లో రంగప్రవేశం చేస్తాడా? అన్నది చూడాలి. 

పటీదార్‌ వైఫల్యంతో..

ప్రస్తుతం టీమ్‌ఇండియా తుదిజట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉంది. అవకాశం కోసం కుర్రాళ్లతో పాటు సీనియర్‌ ఆటగాళ్లూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఛాన్స్‌ను ఉపయోగించుకోకుంటే వేటు తప్పదు. ఇప్పుడు రజత్‌ పటీదార్‌ (Rajat Patidar) పరిస్థితి కూడా ఇలాగే మారింది. కోహ్లీ స్థానంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన అతను.. రెండో మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. వరుసగా మూడు టెస్టులాడాడు. కానీ బ్యాటింగ్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. 30 ఏళ్ల ఈ మధ్యప్రదేశ్‌ ఆటగాడు ఆరు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 32, 9, 5, 0, 17, 0 పరుగులే చేశాడు. దీంతో చివరి టెస్టులో అతని స్థానంలో దేవ్‌దత్‌కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేఎల్‌ రాహుల్‌ గాయం నుంచి కోలుకోకపోవడంతో మూడో టెస్టుకు ముందు పడిక్కల్‌కు జట్టు నుంచి పిలుపొచ్చింది. అప్పటినుంచి జట్టుతోనే సాగుతున్న అతణ్ని అయిదో టెస్టులో ఆడించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మెరుగైన ప్రదర్శనతో..

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో సగటు, తాజా ఫామ్, వయసు ఇలా ఏరకంగా చూసినా పడిక్కల్‌ మెరుగ్గా కనిపిస్తున్నాడు. ఇప్పటివరకూ అతను 31 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 44.54 సగటుతో 2,227 పరుగులు చేశాడు. ఇందులో 6 శతకాలున్నాయి. 23 ఏళ్ల ఈ కర్ణాటక బ్యాటర్‌ ఫామ్‌ కూడా అద్భుతంగా ఉంది. ఈ రంజీ ట్రోఫీ సీజన్‌లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో 92.66 సగటుతో 556 పరుగులు సాధించాడు. మూడు సెంచరీలు చేశాడు. ఇప్పటికే భారత్‌ తరపున రెండు అంతర్జాతీయ టీ20లు ఆడిన దేవ్‌దత్‌ను టెస్టు జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.

ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో రజత్‌ స్థానంలో దేవ్‌దత్‌ను ఆడించాలని టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగార్‌ సూచించాడు. మరికొంతమంది మాజీ ఆటగాళ్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రజత్‌కు జట్టు మేనేజ్‌మెంట్‌ మరో అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా తెలిపాడు. ఈ నేపథ్యంలో రజత్‌నే కొనసాగించాలని జట్టు అనుకుంటే.. టెస్టు అరంగేట్రం కోసం దేవ్‌దత్‌ ఎదురుచూడక తప్పదు. ఒకవేళ 30 ఏళ్ల రజత్‌కు బదులు 23 ఏళ్ల దేవ్‌దత్‌ను ప్రోత్సహించాలని జట్టు మేనేజ్‌మెంట్‌ అనుకుంటే.. అప్పుడు పడిక్కల్‌కు తుది జట్టులో ప్లేస్‌ దక్కుతుంది. దీంతో రజత్, సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్‌ జూరెల్, ఆకాశ్‌ దీప్‌ తర్వాత ఈ సిరీస్‌తో టెస్టుల్లో అడుగుపెట్టిన అయిదో భారత ఆటగాడిగా దేవ్‌దత్‌ నిలుస్తాడు. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు