Ishan Kishan: ఇషాన్ రేపిన చిచ్చు.. దేశవాళీ క్రికెట్‌పై బీసీసీఐ అల్టిమేటం

ఒక్క క్రికెటర్‌ చేసిన దానికి బీసీసీఐ (BCCI) కఠిన చర్యలకు ఉపక్రమించాల్సి వచ్చింది. దేశవాళీ క్రికెట్‌ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేసింది.

Updated : 22 Feb 2024 10:00 IST

భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు దేశవాళీ టోర్నీలేవీ ఆడకపోవడంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. జట్టులో కొంచెం కుదురుకుని, స్టార్ క్రికెటర్లుగా పేరు తెచ్చుకుంటే చాలు.. దేశవాళీ టోర్నీల వైపే చూడట్లేదు ఆటగాళ్లు. యువ ఆటగాళ్లు కూడా ఇదే బాట పడుతున్నారు. ఇది ఎన్నోఏళ్ల నుంచి ఉన్న ఒరవడే అయినా.. యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) వ్యవహారంతో దీనిపై చిచ్చు రాజుకుంది. ఎంత పేరున్న క్రికెటర్లయినా భారత జట్టుకు ఆడనపుడు కచ్చితంగా రంజీ ట్రోఫీ లాంటి దేశవాళీ టోర్నీల్లో ఆడాలని బీసీసీఐ (BCCI) కార్యదర్శి జై షా ఆటగాళ్లకు లేఖ రాయడానికి.. ఈవిషయంలో ఓ నిబంధన కూడా తేవాలని బీసీసీఐ యోచిస్తుండటానికి ఇషాన్ రేపిన చిచ్చే కారణం.

అక్కడే ఆరంభం..

గత నెలలో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా తప్పుకొని ఇండియాకు వచ్చేశాడు ఇషాన్ కిషన్. అయితే వ్యక్తిగత కారణాలతో అతను స్వదేశానికి వచ్చినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కానీ ఈవిషయంలో అంతర్గతంగా పెద్ద కథే నడిచినట్లు వార్తలు వచ్చాయి. తనకు తుది జట్టులో చోటు ఇవ్వకపోవడంపై అసహనం చెంది అతను స్వదేశానికి వచ్చేయాలని నిర్ణయించుకున్నాడని.. ఇది టీమ్ మేనేజ్మెంట్‌కు ఆగ్రహం తెప్పించి ఆ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్‌కు అతణ్ని పక్కనపెట్టారని బీసీసీఐ వర్గాల్లో చర్చ జరిగింది. ఇషాన్ అయినా ఇంకొకరైనా భారత జట్టులోకి రావాలనుకుంటే దేశవాళీ ప్రదర్శనే ప్రామాణికం అని కోచ్ రాహుల్ ద్రవిడ్ తేల్చేశాడు. ఐతే దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వచ్చేసిన ఇషాన్.. రంజీ ట్రోఫీలో ఆడి ఆస్ట్రేలియా సిరీస్‌కు జట్టులో చోటు సంపాదించే ప్రయత్నం చేస్తాడనుకుంటే.. అతను ఆ టోర్నీ ఊసే ఎత్తలేదు. ఇషాన్ సొంత జట్టు ఝార్ఖండ్‌కు తన అవసరం ఉన్నా పట్టించుకోలేదు.

కొన్ని రోజులు విరామం తీసుకుని, ఐపీఎల్ కోసం ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యతో కలిసి ఇషాన్‌ సాధన చేయడం మొదలుపెట్టాడు. రంజీ ట్రోఫీని విస్మరించి ముంబయిలో జరిగే డీవై పాటిల్ టీ20 టోర్నీలో ఆడాలని అతను భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దేశవాళీల్లో అత్యున్నతమైన రంజీ ట్రోఫీలో ఆడటాన్ని ఇషాన్ తేలిగ్గా తీసుకోవడం బీసీసీఐకి రుచించలేదు. ఈనేపథ్యంలో భారత క్రికెటర్లు జట్టుతో లేనపుడు కచ్చితంగా రంజీ ట్రోఫీ ఆడాలనే నిబంధన తేవాలని, ఈవిషయంలో కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే జై షా.. భారత క్రికెటర్లకు ఓ లేఖ రాశాడు. టీమ్‌ఇండియాకు ఆడనపుడు రంజీ ట్రోఫీతో పాటు ఇతర దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీల్లో పాల్గొనాలని ఇందులో స్పష్టంచేశాడు. 

ఇప్పుడా మేల్కొనేది?

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో దేశవాళీ క్రికెట్‌కు అక్కడి బోర్డులు ఎంతో ప్రాధాన్యం ఇస్తాయి. ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఎంత బలంగా ఉందో తెలిసిందే. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్లు చాలామంది అందులో ఆడతారు. మన క్రికెటర్లు కూడా సీజన్లో అక్కడికే వెళ్లి కౌంటీల్లో ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడుతుంటారు. మరోవైపు ఆస్ట్రేలియాలో షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ బాగా పాపులర్. వీటిలో అంతర్జాతీయ ఆటగాళ్ల ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ ఇండియాలో మాత్రం పరిస్థితి భిన్నం. భారత క్రికెటర్లు ఎవరూ రంజీ ట్రోఫీలో కనిపించరు. స్టార్ ఆటగాళ్ల సంగతి సరేసరి. ఒకసారి భారత జట్టులోకి వచ్చాక మళ్లీ రంజీలు ఆడడం అన్నదే ఉండదు.

జట్టులో చోటు కోల్పోయి, గడ్డు పరిస్థితులు ఎదురైతే తప్ప కథ మారదు. స్టార్ క్రికెటర్లను చూసి యువ ఆటగాళ్లు కూడా ఇదే బాట పడుతున్నారు. ఐపీఎల్  రాకతో ఈ ఒరవడి ఇంకా పెరిగింది. క్రమంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల సంఖ్య పెరిగిపోవడంతో క్రికెటర్లకు ఖాళీ దొరకడం కూడా కష్టమైన మాట వాస్తవం. బీసీసీఐ కూడా ఐపీఎల్‌కు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చి అందులో ప్రదర్శన ఆధారంగా భారత జట్టులో చోటిస్తుండడం కూడా రంజీల్లాంటి టోర్నీలను క్రికెటర్లు తేలిగ్గా తీసుకోవడానికి కారణమైంది. దీనివల్ల ఆ ప్రతిష్టాత్మక టోర్నీ కళ తప్పుతోంది. ఏళ్లతరబడి ఈ విషయాన్ని బీసీసీఐ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఇషాన్ ఉదంతం ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా మారడంతో దీనిపై దృష్టిసారించింది. కానీ బీసీసీఐ హెచ్చరికలు, కొత్త నిబంధనలు క్రికెటర్లను ఎంతమేర రంజీ ట్రోఫీ వైపు మళ్లిస్తాయో చూడాలి.

-ఈనాడు క్రీడావిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని