Ishan Kishan: ఈ ఇన్నింగ్స్‌తో ఇషాన్‌ వరల్డ్‌కప్‌ రేసులో ముందుకొచ్చాడు: రవిశాస్త్రి

వన్డేల్లో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు బాదిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) వన్డే వరల్డ్‌ కప్‌ జట్టులో స్థానం సంపాదించే అవకాశాలను మరింత మెరుగుపర్చుకున్నాడు. ఆసియా కప్‌లో పాక్‌పై అద్భుత ఇన్నింగ్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు.

Published : 03 Sep 2023 14:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌లో (Asia Cup 2023) పాకిస్థాన్‌పై 81 బంతుల్లోనే 82 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇషాన్‌ (Ishan Kishan) ఆటతీరుపై టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, పాక్ మాజీ పేసర్ వసీమ్‌ అక్రమ్ స్పందించారు. వన్డే ప్రపంచ ముంగిట ఇషాన్ కిషన్‌కు ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకున్నాడని పేర్కొన్నారు. ‘‘బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఇషాన్‌ కిషన్ ఎక్కడైనా ఆటగలడని మరోసారి నిరూపించాడు. పేస్‌ను ఎదుర్కోవడం, స్పిన్‌ను ఆడిన తీరు అద్భుతం. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్‌ దాడి కలిగిన పాక్‌ను అడ్డుకోవడం తేలికేం కాదు. కొన్ని షాట్లు ఆడిన తీరు అమోఘం’’ అని వసీమ్ అక్రమ్ తెలిపాడు. 

నంబర్‌ 4లో బ్యాటింగ్‌కు వారిద్దరే రావాలి.. యువకులు కాదు: గంభీర్‌

వరల్డ్‌ కప్‌ కోసం ప్రకటించనున్న జట్టులో కనీసం ముగ్గురు ఎడమచేతివాటం బ్యాటర్లు ఉండాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు ఈ ఇన్నింగ్స్‌తో ఇషాన్‌ కిషన్ రేసులో అందరికంటే ముందుకు వచ్చాడని వ్యాఖ్యానించాడు. ‘‘బ్యాటర్‌గా పటిష్ఠమైన బౌలింగ్‌ను ఎదుర్కొని పరుగులు చేస్తే వచ్చే సంతృప్తి మాటల్లో చెప్పలేనిది. హారిస్ రవూఫ్, షహీన్, నసీమ్‌ వంటి పేసర్లు కలిగిన పాక్‌పై కీలక ఇన్నింగ్స్‌ ఆడటం అద్భుతం. తప్పకుండా ఇలాంటి ఇన్నింగ్స్‌ అతడిలో ఆత్మస్థైర్యం నింపుతుంది. వన్డే ప్రపంచకప్‌ స్క్వాడ్‌ రేసులో ఇషాన్ అందరికంటే ముందున్నాడు. ఎడమచేతివాటం కావడం కూడా కలిసిరావచ్చు. మరోవైపు కేఎల్‌ రాహుల్‌ వంటి ఉత్తమ బ్యాటర్‌ కూడా టీమ్‌ఇండియాకి అందుబాటులో ఉన్నాడు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. 

షహీన్‌ను అర్థం చేసుకోవడం రోహిత్‌కు కష్టమే: షోయబ్

పాక్‌ పేసర్ షహీన్‌ బౌలింగ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో షహీన్ బౌలింగ్‌ను రోహిత్ అర్థం చేసుకోవడంలో మరోసార విఫలం కావడంపై పాక్‌ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. ‘‘ఇప్పటికీ షహీన్‌ బౌలింగ్‌ను అర్థం చేసుకోవడంలో రోహిత్ ఇబ్బంది పడుతున్నాడు. అతడు ఆడిన తీరు బాగోలేదు. ఇంకాస్త ఉత్తమంగా ఆడాల్సిన అవసరం ఉంది. మరీ ఎక్కువగా ఆందోళన పడుతున్నందు వల్లే ఇలా జరిగి ఉండొచ్చు. అలాగే వర్షం వల్ల ఆటంకాలు ఎదురు కావడం కూడా బ్యాటర్ల మానసిక స్థితిపై ప్రభావం పడుతుంది. గ్రౌండ్‌లోకి రావడం, మళ్లీ వెనక్కి వెళ్లడం వల్ల ఫోకస్ దెబ్బతింటుంది. గిల్ ఇలానే తన వికెట్‌ను కోల్పోయినట్లుగా అనిపించింది’’ అని షోయబ్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని